- డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు
- వాట్సాప్‌లో హల్‌చల్ చేసిన కామర్స్ ప్రశ్నపత్రం
- ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపిన ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్!
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్రమాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ ప్రశ్నపత్రం విధానాన్ని కూడా అభాసుపాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు.
పరీక్షా సమయానికి గంట ముందు మాత్రమే ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరవేస్తారు. వారు ప్రశ్నపత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మంగళవారం బీకాం ఫైనలియర్ సబ్జెక్టు అయిన ‘ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఈ కామర్స్ ’ పరీక్ష జరిగింది. ఉదయం ఎనిమిదికి ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను ఎస్కేయూ అధికారులు కళాశాలలకు పంపించారు. అయితే.. 8.30 గంటలకల్లా ప్రశ్నపత్రం వాట్సాప్‌లో హల్‌చల్ చేసింది. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంబ్లింగ్ విధానం కావడంతో ఒక కళాశాల విద్యార్థులను రెండు లేదా మూడు కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. దీంతో ప్రశ్నపత్రాన్ని ముందే తమ కళాశాలకు సంబంధించిన వ్యక్తులకు పంపి..వారి ద్వారా తమ విద్యార్థులకు జవాబు స్లిప్పులు అందజేయడానికి వీలుగా వాట్సాప్‌లో పంపినట్లు తెలుస్తోంది.
వాటర్‌మార్క్ ద్వారా గుట్టు రట్టయ్యే అవకాశం
ఆన్‌లైన్ ప్రశ్నపత్రాన్ని ఎక్కడి నుంచి లీక్ చేశారన్న విషయాన్ని పసిగట్టేందుకు తమ వద్ద విభిన్న పద్ధతులు ఉన్నాయని రెండు నెలల కిందట ప్రిన్సిపాళ్లకు ఇచ్చిన శిక్షణలో అధికారులు హెచ్చరించారు. ఏ పరీక్షా కేంద్రం నుంచి లీక్ చేశారన్న అంశాన్ని పసిగట్టేందుకు వాటర్‌మార్క్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం కామర్స్ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో వాటర్‌మార్క్‌ను పరిశీలిస్తే తెలిసే అవకాశముంది.
పేపర్ లీక్ కాలేదు
ప్రశ్నపత్రం గంట ముందే ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్ విధానం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 8.31 గంటలకు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చినట్లు స్పష్టమైంది. అప్పటికే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు. దీంతో పేపర్ లీక్ అయినట్లు భావించకూడదు. ఈ సంఘటనలో ఎస్కేయూ అధికారుల తప్పిదం లేదు. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటాం.
– ఆచార్య రెడ్డి వెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ
అక్ర ‘మార్కులు ’
Published Wed, Apr 5 2017 12:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement