
అప్రజాస్వామిక విధానాలు సహించం
– రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎస్కేయూ బంద్
– వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళనలు
ఎస్కేయూ(అనంతపురం) : ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో గురువారం విశాఖపట్నంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి హాజరయ్యేందుకు వెళ్లిన వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను అడుకున్న చంద్రబాబు నియంత పాలనను ఖండిస్తూ శుక్రవారం ఎస్కేయూలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థి నాయకులు అన్ని విభాగాల్లో బంద్ చేయించారు.
ప్రాణాలైనా అర్పిస్తాం
విభజన చట్టంతో పూర్తిగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శాంతియుత నిరసనలను సైతం అడ్డుకుంటూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని యావత్ లోకం గర్జిస్తుంటే... పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జి.వి.లింగారెడ్డి, కాంత్రికిరణ్, గెలివి నారాయణరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, నాగేంద్ర, వినోద్; హేమంత్ కుమార్, రాంబాబు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్‌యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, ఎంఎస్‌ఎఫ్ నేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అరెస్ట్... విడుదల
గత మూడు రోజులుగా ఎస్కేయూలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకున్న చంద్రబాబు నియంత పాలనను నిరసిస్తూ శుక్రవారం వర్సిటీలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా పాలక భవనాన్ని బంద్ చేయించేందుకు వెళ్లిన విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలు వీడాలని లేకుంటే అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్న పోలీసుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు, అనంతరం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు.