యూనివర్సిటీ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై శుక్రవారం దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినదించారు. శనివారం యూనివర్సిటీ ఎదుట చెన్నై జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు ఆందోళన చేపట్టారు. ఆరు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
వైఎస్సార్‌సీపీ, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం, ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు రిజిస్ట్రార్ దశరాథరామయ్య, ప్రిన్సిపాల్ ఫణీశ్వరరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివారెడ్డితో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివారెడ్డి మాట్లాడుతూ.. ఎస్కేయూ ఆవిర్భావం నుంచి క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించి దాడులు చేయలేదన్నారు. సుదీర్ఘంగా సాగిన సమైక్య ఉద్యమంలో కూడా శాంతియుతంగా ఆందోళనలు చేశామన్నారు. విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రోద్భలంతోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్నారు. ఐక్య విద్యార్థి సంఘం నేత పులిరాజు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆపై ఇటుపల్లి పోలీసుస్టేషన్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఈ క్రమంలో రిజిస్ట్రార్ దశరథరామయ్య ఘటన స్థలికి వచ్చారు.
విద్యార్థులు రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించారు. వాటర్ ప్యాకెట్లు విసిరారు. ‘మీ అనుమతి లేకుండా పోలీసులు లోపలికి ఎలా వచ్చారు.. మీ అండతోనే దాడికి జరిగింద’ని నిలదీశారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ వర్శిటీలోకి పోలీసులు రావడానికి తాను అనుమతి ఇవ్వలేదన్నారు. విద్యార్థులపై దాడి దురదృష్టకరమన్నారు. రిజిస్ట్రార్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈక్రమంలో డీఎస్పీ మల్లిఖార్జున వర్మ విద్యార్థులు, రిజిస్ట్రార్‌కు సర్ది చెప్పబోయారు. జరిగిన పరిణామం సున్నితమైన అంశమని, విద్యార్థులపై దాడి చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు జరిపేందుకు రిజిస్ట్రార్‌ను ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌లోకి డీఎస్పీ ఆహ్వానించారు. చర్చలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు స్టేషన్‌ను ముట్టడించారు. వెంటనే రిజిస్ట్రార్ బయటకు వచ్చారు. ఇదే సమయంలో ఏజేసీ ఖాజామొయిద్దీన్ వచ్చారు. విద్యార్థులు ఏజేసీని చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. దీంతో తిరిగి మళ్లీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆపై అక్కడి నుండి నగరంలోకి ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నించారు. లా కాలేజీ వరకూ ర్యాలీగా వచ్చి అక్కడ బైఠాయించారు. ఈక్రమంలో ఏజేసీ జోక్యం చేసుకుని వారం రోజుల్లో ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామన్నారు. దీనికి ఏజేసీ అంగీకరించారు. దీంతో ఆందోళన విరమించారు. రిజిస్ట్రార్ దశరాథరామయ్య.. ఏజేసీకి వినతి పత్రం అందించారు. నారాయణ రెడ్డి, రవి, జయపాల్ యాదవ్, పూజారి సురేంద్ర, మల్లిఖార్జున, హనుమంతురాయుడు, వెంకటేశ్, పరుశురాంనాయక్, జయసారధి చూదరి, బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరి మల్కారి లక్ష్మణరావు, లక్ష్మీకరబాబు, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్, ఓ. కొండన్న, సురేష్ , ఎర్రిస్వామి, శ్రీరాములు, లక్ష్మినారాయణ, తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
దద్దరిల్లిన ఎస్కేయూ
Published Sun, Feb 15 2015 3:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement