ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీనంపై స్టే | high court stays on out sourcing | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీనంపై స్టే

Published Thu, Aug 3 2017 1:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీనంపై స్టే - Sakshi

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీనంపై స్టే

హైకోర్టులో విద్యుత్‌ సంస్థలకు చుక్కెదురు
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు విలీన ప్రక్రియ వద్దు
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగానే కొనసాగించుకోవచ్చు
వారికి ఏకమొత్తంగా వేతనాలు చెల్లించండి
ఈ దశలో సిబ్బందిని రోడ్డున పడేయలేమన్న కోర్టు
కౌంటర్‌ దాఖలు చేయాలని విద్యుత్‌ సంస్థలకు ఆదేశం
విచారణ నాలుగు వారాలకు వాయిదా


సాక్షి, హైదరాబాద్‌
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విలీనం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీనంపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకోవద్దని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. వారిని ఇప్పటివరకు కొనసాగించిన విధంగానే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అయితే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో సంబంధం లేకుండా వారికి ఏకమొత్తంగా (కన్సాలిడేటెడ్‌) వేతనాలను చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది.

తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా విలీనమైన ఉద్యోగులందరినీ రోడ్డుపాల్జేసి, వారి పొట్టకొట్టలేమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 21 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకోవాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ అనే నిరుద్యోగి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.

ప్రభుత్వం అండతో దొడ్డిదారి నియామకాలు..
పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ సర్వీసుల్ని క్రమబద్ధీకరణ చేయొద్దని గతంలో హైకోర్టు పేర్కొంటే.. విద్యుత్‌ సంస్థలు విలీనం (అబ్జార్బ్‌) అనే పద ప్రయోగంతో క్రమబద్ధీకరణ చేశాయన్నారు. జూన్‌ 29న జరిగిన విచారణ సమయంలో విద్యుత్‌ సంస్థల తరఫు న్యాయవాది.. క్రమబద్ధీకరణ ప్రక్రియకు చాలా సమయం ఉందని, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసుల పరిశీలన నిమిత్తమే కమిటీలను ఏర్పాటు చేశామేగానీ ఇప్పటికిప్పుడు క్రమబద్ధీకరణ జరగబోదని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కానీ అందుకు భిన్నంగా దాదాపు 21 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసుల్ని క్రమబద్ధీకరించారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్మిక సంఘాల సమాఖ్యతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి వచ్చాకే విలీన నిర్ణయంపై బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలుపుతారని చెప్పినట్లు గత విచారణలో హైకోర్టుకు విద్యుత్‌ సంస్థలు చెప్పిన దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్‌ సంస్థల తీరు వల్ల నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. ప్రభుత్వం అండతో విద్యుత్‌ సంస్థలు దొడ్డిదారిన నియామకాలు చేశాయన్నారు. గతేడాది డిసెంబర్‌ 4వ తేదీకి ముందు నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి విద్యుత్‌ సంస్థలతో సంబంధమే లేదన్నారు. వారిని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలే నియమించుకున్నాయి తప్ప విద్యుత్‌ సంస్థలు కాదని వివరించారు.

విలీనాన్ని ఎలా సమర్థించుకుంటారు?
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విలీనాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ని కోరింది. ఎన్ని సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న వారిని విలీనం చేసుకుంటున్నారని, 2016 డిసెంబర్‌ 4వ తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయించడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ వివరాలన్నీ సమర్పించేందుకు ఏజీ స్వల్ప వాయిదా కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు విచారణను ప్రారంభించింది.

దోపిడీని అడ్డుకునేందుకే...
కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయని ఏజీ ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ఆ ఉద్యోగులను విలీనం చేసుకుంటున్నామని చెప్పారు. 20,903 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. వీరిలో గత మూడేళ్లుగా పని చేస్తున్న 3 వేల మందితోపాటు పదేళ్లకుపైబడి పనిచేసే వారూ ఉన్నారని చెప్పారు. వీరికి రూ.22 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.13 వేల చొప్పున నాలుగు గ్రేడ్లలో వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇతర విద్యార్హతలున్న వీరంతా రెగ్యులర్‌ ఉద్యోగుల్లాగే రోజుకు 8 గంటల చొప్పున విధులు నిర్వహిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఇకపై తెలంగాణ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాలు చేపట్టబోదని ఏజీ వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విలీనం పేరుతో ఇలా మూకుమ్మడిగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇది సుప్రీంకోర్టు చెప్పినట్లు దొడ్డిదారి నియామకమే అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విలీన ప్రక్రియను చేపట్టొద్దని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement