గ్యాంగ్ రేప్ జరిగి మూడు రోజులైనా చర్యలు శూన్యం
ఇంత వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
బాధితుల వద్దకు మమ్మల్ని ఎందుకు అనుమతించరు?
వారిని పరామర్శించాలంటే అధికారం ఉండాలా?
వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
సాక్షి, పుట్టపర్తి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కరువైంది. బాలికలు బతకాలంటేనే భయం భయంగా గడపాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి సమీపంలోని పేపరు మిల్లు వద్ద ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై శనివారం తెల్లవారుజామున కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పండుగ రోజున ఓ కుటుంబం అన్యాయానికి గురైతే ప్రభుత్వానికి పట్టదా? బాధితులను పరామర్శిద్దామని సాటి మహిళలుగా నేను (ఉషశ్రీచరణ్), దీపిక హిందూపురం ఆస్పత్రి వద్దకు వెళ్తే.. పోలీసులు లోపలికి అనుమతించలేదు.
బాధితులను పరామర్శించాలంటే అధికారంలోనే ఉండాలా? చట్టం మీ చుట్టమా? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాలేజీ బాత్ రూముల్లో వీడియోలు తీసి బయటకు వదిలేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పొట్ట కూటి కోసం వచ్చే కుటుంబాలపై గ్యాంగ్ రేప్ చేస్తున్నారు..’ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.
సోమవారం సాయంత్రం ఆమె పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులతో కలిసి పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులును కలిసి గ్యాంగ్ రేప్ విషయమై మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మహిళలకు అన్యాయం జరగకుండా ఎస్‌ఓఎస్ ద్వారా రక్షణ కోరే అవకాశం ఉండేదని చెప్పారు.
ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. మొన్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లిని కిడ్నాప్ చేసి హత్య చేశారు, అంతకుముందు పుంగనూరు, నంద్యాలలోనూ మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment