
కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీని పెట్టకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ మరెవ్వరికీ రాజకీయ మనుగడ ఉండేది కాదనీ, సింగిల్ పార్టీ నియంతృత్వం నడిచేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పెట్టబట్టే వైఎస్సార్ తనయుడిగా ప్రజల్లో మమేకమై దశా దిశా చూపించగల నాయకుడిగా, చిరుదివ్వెగా వైఎస్ జగన్ ఉన్నాడని రాష్ట్రం మొత్తంగా విశ్వసిస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు నిజమైన పరిపాలన వైఎస్ జగన్ వల్లే సాధ్యమవుతుందని, పైగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబాన్నే కాదు, ఆయన పెట్టిన పార్టీని కూడా బాబు ఖూనీ చేసేశాడన్నారు. టీడీపీని కౌగలించుకోవడమనేది కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి తీరుతుందని, ఈ ఒక్క కారణం వల్లే కేసీఆర్ తెలంగాణలో మళ్లీ సీఎం కావచ్చంటున్న ఆనం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంది?
రాజశేఖరరెడ్డిగారితో ఉన్న అనుబంధం, ఆప్యాయతల్ని తిరిగి పొందగలుగుతున్నాను అనే నమ్మకం నాకు ఉంది. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో ఆవేశంతోనూ, అనాలోచితంగానూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వాటిని సరిచేసుకుని, చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి మళ్లీ వైఎస్సార్ కుటుం బంతో, వైఎస్ జగన్‌తో కలవాలని, వైఎస్సార్‌సీపీతో చివరివరకూ నడవాలని నిర్ణయించుకునే ఇక్కడికి రావడం జరిగింది.
ఉన్నట్లుండి టీడీపీలోకి వెళ్లి, మళ్లీ ఇటువైపు ఎందుకొచ్చారు?
మొదట్నుంచీ అంటే 8 దశాబ్దాలుగా కాంగ్రెస్‌తోనే ముడిపడిన కుటుంబం మాది. కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం నాకు దక్కకపోవడంతో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశాను. తర్వాత మళ్లీ వైఎస్సార్‌తో బంధం బలపడింది. అలా 1991 నుంచి 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌తోటే కొనసాగాను. విభజనానంతరం ఏపీకి కలిగిన నష్టాలు, అడ్డగోలు విభజనతో వచ్చిన చిక్కుల నేపథ్యంలో టీడీపీలో చేరితే బాగుంటుందనుకున్నాను. కానీ గత 8 దశాబ్దాల మా కుటుంబ రాజకీయ జీవితంలో నాకై నేను తప్పటడుగు వేసి తీసుకున్న నిర్ణయం అది. నా నిర్ణయం మా కుటుంబంలో ఎవరికీ సుతరామూ ఇష్టం లేదు. నా తమ్ముడు వివేకా తన జీవితం చివరి దశలో ఉందని గ్రహిం చుకున్నాక, మనం రాజకీయంగా తప్పు చేశాం. మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పేశాడు.
వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టడం సరైందేనని భావిస్తున్నారా?
జగన్ పార్టీని పెట్టకపోయి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో మరెవ్వరికీ రాజకీయ మనుగడ ఉండేది కాదు. అలా జరగకుంటే తెలుగుదేశం పార్టీకి తప్ప మరెవ్వరికీ ఏపీలో మనుగడ లేని స్థితి ఏర్పడేది. సింగిల్ పార్టీ నియంతృత్వంలో నడిచేది. ప్రశ్నించే ఒక ప్రతిపక్షం ఉందిప్పుడు. జగన్ పార్టీ పెట్టకపోయి ఉంటే ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల సమస్యలను దగ్గరికిపోయి అర్థం చేసుకునే వ్యక్తి ఏపీలో ఇవాళ ఉండేవారు కాదు. వైఎస్సార్ తనయుడిగా ప్రజల్లో మమేకమై దశా దిశా చూపిం చగల నాయకుడిగా, చిరుదివ్వెగా వైఎస్ జగన్ ఉన్నాడని రాష్ట్రం మొత్తంగా విశ్వసిస్తోంది.
2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి?
ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అని కచ్చితంగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ఏపీ ప్రజలకు నిజమైన పరిపాలన చూపిస్తుందంటే అది ఒక జగన్ వల్లే సాధ్యమవుతుంది. అన్ని విభాగాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిపెట్టినవాడు బాబు. అందుకే ఇవ్వాళ అతడు మాట్లాడే ప్రతిమాటా నిస్పృ హలోంచే వస్తోంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ బాబుకు పట్టంగట్టి మోసపోతారని మాత్రం నేననుకోవడం లేదు.
మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి కడుతున్నానని బాబు వ్యాఖ్య?
అమరావతి కేంద్రంగా మహాకూటమి కడుతున్నానని చంద్రబాబు చెబుతున్నారు కానీ ఆయన ఎవరితో కూటమి కట్టారు? ఇప్పటికే యూపీఏలో ఉన్న పార్టీల వద్దకు వెళుతున్నాడు. పైగా వాళ్లు ఈయన వద్దకు రాలేదు. చంద్రబాబూ మీరే ఈ దేశానికి దిక్కు అని రాహుల్ గాంధీ బాబు వద్దకు రాలేదు. రాహుల్ వద్దకు ఈయన వెళ్లి శాలువా కప్పి తీగలు లేని వీణ ఇచ్చి నువ్వు వాయించు రాహుల్ అంటున్నాడు. ములాయం సింగ్ వద్దకెళ్లి శాలువా కప్పాడు. అంతకుముందు మోదీ వద్ద మోకరిల్లిన దానికంటే ఎక్కువ స్థాయిలో ములాయం వద్ద మోకరిల్లాడు.
కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిపోవడంపై ప్రజలేమనుకుంటున్నారు?
అధికారంకోసం ఒకసారి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది. మళ్లీ ఇప్పుడు రెండోసారి తన అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేత రాహుల్ గాంధీ కాళ్లవద్ద టీడీపీని పెట్టి, అయ్యా నువ్వే నాకుదిక్కు అని ప్రాధేయపడటం ద్వారా ఎన్టీఆర్‌ను రెండోసారి వెన్నుపోటు పొడిచాడు బాబు. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఎన్టీఆర్ కుటుం బాన్నే కాదు, ఆయన పెట్టిన పార్టీని కూడా ఖూనీచేసేశాడు బాబు. ఈ దేశం కోసం, రాజ్యాంగం కోసం రాహుల్‌తో కలిసిపోయాను అంటున్నావు. నీ రాష్ట్రంలో పాలనను, వ్యవస్థను నిర్వీర్యం చేసిపడేశావు, ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది నీవల్ల. నీ మనసుకు నీవు సమాధానం
చెప్పలేనివాడివి ఆంధ్రప్రజలకు ఏం సమాధానం చెబుతావు?
టీడీపీ, కాంగ్రెస్ కలిసిపోతే చంద్రబాబు పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందా?
2014లో చేసిన తప్పుడు నిర్ణయం వల్ల కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్‌ను కౌగలించుకోవడమనేది కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి తీరుతుంది. మనం తెలుగుదేశంతో కలవడం ఏమిటి? అదీ చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఏమిటి? చంద్రబాబు తాను వస్తానంటే ఢిల్లీలో రాహుల్ తన ఇంటి గేట్లు ఎలా తెరిచాడంటూ కాంగ్రెస్ కేడర్ తీవ్రంగా బాధపడుతోంది. పోయి పోయి టీడీపీతో అదీ చంద్రబాబు టీడీపీతో కలవడంపై కాంగ్రెస్ కేడర్ ఉడికిపోతోంది. మా రఘువీరారెడ్డి, మా కేవీపీ రామచంద్రరావు వెళ్లి టీడీపీతో వేదిక పంచుకునే దృశ్యాన్ని నాకు నేనే ఊహించుకోలేకపోతున్నాను.
తెలంగాణలో కాంగ్రెస్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి మరీ మద్దతిస్తున్నాడట కదా?
డబ్బులిస్తున్నాడు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసిందేమో మరి. నాకు తెలిసి తెలంగాణలో టీడీపీతో కలిసిన కాంగ్రెస్ బాగా నష్టపోనుంది. ఈ కలయిక దెబ్బతో కేసీఆర్ బహుశా రెండోదఫా కూడా తెలంగాణ సీఎం అయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో కేసీఆర్ ఏం తప్పు చేశాడు? ఇప్పుడు తెలుగుదేశం వచ్చి తెలంగాణలో ఉద్ధరించేదేమిటి?
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2DP8oPs
https://bit.ly/2FyJBAO
Comments
Please login to add a commentAdd a comment