టీడీపీ అస్త్రసన్యాసం వెనుక? | Tdp Double Game On Mptc Zptc Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ అస్త్రసన్యాసం వెనుక?

Published Wed, Apr 7 2021 1:03 AM | Last Updated on Wed, Apr 7 2021 1:03 AM

Tdp Double Game On Mptc Zptc Elections - Sakshi

ఆడలేక మద్దెల ఓడు అంటారు. అసలు బరిలోకి దిగకుండానే కాడి ఎత్తేస్తే! అదీ నలభై యేళ్ల చరిత్ర కలిగిన పార్టీ! అదీ జాతీయపార్టీ అని దానికి మద్దతిచ్చే మీడియా ప్రచారం చేసే పార్టీ! ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు అంతుపట్టకుండా ఉన్నాయి. ఇది చారిత్రక తప్పిదామా లేక పార్టీ తెప్పను తగలేసి అయినాసరే తనను తాను కాపాడుకునే ప్రయత్నమా? ఆంధ్రలో ఆయన మరో శశికళ అవుతున్నారా లేక డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారా? ఇవేవీ కాదు, పోటీలో నిలబడగలిగే చేవ నిజంగానే చచ్చిపోయిందా? అదే గనక నిజమైతే ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డట్టే.

సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుందంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. కార్యకర్తలలో మెజారిటీకి ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాని పక్షంలో ఆ రాజకీయ పార్టీ క్షీణించిపోవడానికి కాలం దగ్గరపడిందన్న భావన ఏర్పడుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు చారిత్రక తప్పిదాలు చేసి, ప్రతిపక్ష హోదా నుంచి ఐదు శాతం ఓట్లు కూడా రాని దుస్థితిలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీని చంద్ర బాబు జాతీయ పార్టీగా చెబుతారు. ఆయనకు మద్దతిచ్చే మీడియా చంద్రబాబు, లోకేశ్‌ జాతీయ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అని అభివర్ణిస్తుంటాయి. కానీ చంద్రబాబు తాజాగా తీసు కున్న నిర్ణయం చారిత్రక తప్పిదమా, కాదా? అన్నదానిపై ఆ మీడియా స్పష్టత ఇవ్వ కుండా ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ప్రాముఖ్యత ఇస్తూ కథనాలు ఇచ్చాయి. ఒక పక్క మున్సిపల్‌ ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు రాని బీజేపీ, ఐదు శాతం ఓట్లురాని జనసేన పోటీ చేస్తున్నాయి. ఒక్క శాతానికే పరిమితం అయిన కాంగ్రెస్, వామపక్షాలు కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించలేదు. కానీ 30 శాతం ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఎందుకు ఎన్నికలను బహిష్కరించిందన్నది ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నలభై ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు నిర్ణయంతో అధికార వైసీపీ ఇరుకున పడుతుం దని వారు అనుకుని ఉండాలి. కానీ మొత్తం క్షేత్రం అంతటినీ వైసీపీకి వదలివేసినట్లయిందని కొందరు టీడీపీ నేతలే నెత్తి కొట్టుకుంటు న్నారు. ఇది రాజకీయంగా ఆత్మహత్య అని కొందరు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తోందని చెప్పారే తప్ప, తమ అభిమా నులు, పార్టీ కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలో చంద్రబాబు చెప్ప లేదు. తాము ఎన్నికలను బహిష్కరించినా స్థానిక పరిస్థితులను బట్టి జిల్లాలలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పలేదు. ఇక్కడ కూడా ఆయన తన శైలి ప్రకారం డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారన్న అనుమానం వస్తోంది. ఎవరినో సంతృప్తి పరచడానికి ఎన్నికల గోదా నుంచి తప్పు కుంటున్నట్లు ఒకవైపూ, స్థానిక నేతలు పోటీలో కొనసాగేలా మరో వైపూ వ్యవహరిస్తున్నారా అని పలువురు శంకిస్తున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తలలో గందర గోళం ఏర్పడింది. 

ఉదాహరణకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక వర్గం కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి దిగగా, మరో వర్గం కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల పచ్చ కండువాలు వేసుకుని య«థాప్రకారం ప్రచారం చేసుకుంటు న్నారు. జ్యోతుల నెహ్రూ వంటివారు నియోజకవర్గ స్థాయిలో తమ సొంత క్యాడర్‌ను కాపాడుకోవడానికి యత్నాలు చేస్తున్నారు. చంద్ర బాబుకు ఈ దిక్కుమాలిన సలహా  ఎవరిచ్చారో గానీ, ఆయన నిర్ణ యంతో టీడీపీ కుదేలైందని చెప్పాలి. నిజానికి పంచాయతీ, మున్సి పల్‌ ఎన్నికలలో పెద్దగా వివాదాలు రాలేదు. కానీ బాబు తన సహజ సిద్ధమైన సరళిలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుసు. అందుకే కొన్నిచోట్ల చంద్ర బాబు నిర్ణయాన్ని టీడీపీ క్యాడర్‌ సీరియస్‌గా తీసుకోవడం లేదు. 

చంద్రబాబు నిర్ణయం వెనుక బీజేపీ హెచ్చరికలు ఏమైనా పని చేశాయా అని కొందరి అనుమానం. తమిళనాడులో జయలలిత సన్ని హితురాలు శశికళ ఎన్నికలలో తన అభ్యర్థులను రంగంలో దించడా నికి సన్నద్ధం అవుతున్న తరుణంలో అనూహ్యంగా అస్త్రసన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన వెనుక బీజేపీ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. చంద్రబాబుపై ఇటీవల వచ్చిన కేసులు గానీ, ఇత రత్రా ఆరోపణలు గానీ గమనిస్తే, వాటి నుంచి తనను తాను కాపాడు కోవడానికి ఇలా చేశారేమో అన్న అభిప్రాయాన్ని కొందరు రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రా శశికళ అని ఏపీసీసీ  ఉపాధ్యక్షుడు గంగాధర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన అవస రార్థం ఎవరినైనా బలి చేయగలరు. ఇప్పుడు ఏకంగా పార్టీని, పార్టీ క్యాడర్‌ను బలి చేయడం ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకునే యత్నంలో ఉన్నారా అన్నది ఆయన అనుమానం. 

అదే సమయంలో బీజేపీ సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని వారు ప్రచారం చేస్తున్నారు. రెండు శాతం ఓట్లు వచ్చినవారు, నాలుగు శాతం ఓట్లు వచ్చిన జనసేనతో కలిస్తే ప్రత్యామ్నాయం ఎలా అవుతారబ్బా అని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఈ నిర్ణయంతో నిజంగానే ఆ కూటమికి ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. టీడీపీకి ఓట్లు వేసే వారు అయితే వైసీపీకి అట్రాక్ట్‌ కావాలి, లేదంటే బీజేపీ–జనసేన కూటమికి వేయాలి. క్రమేపీ తెలుగుదేశం తనను తాను బలహీనపరచుకుంటూ పోతే, అందులోని వారు బీజేపీ వైపు వస్తే అప్పుడు ఈ పార్టీ బెటర్‌ అవుతుందన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది చెప్పలేం గానీ, చంద్రబాబు చర్య మాత్రం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక ఆంగ్ల పత్రికలో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో డీల్‌ కుదిరిందని ఏప్రిల్‌ ఫూల్‌ వార్త ఒకటి వేశారు. ఆ తర్వాత రోజు అది ఏప్రిల్‌ ఫూల్‌ వార్త కాదేమోనన్న చందంగా చంద్రబాబు  ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఉదాహరణకు నంద్యాలలో ఓడిపోతామని తెలిసినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని తెలిసినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వెనక్కి తగ్గలేదు. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ వారం రోజులపాటు అక్కడే తిష్టవేసి తన క్యాడరులో ధైర్యం పెంచే యత్నం చేశారు. కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీల బలం వైసీపీకి ఉన్నా, చంద్రబాబు వారిలో చాలామందిని డబ్బుతో కొనుగోలు చేసి క్యాంపులకు తరలించారు. అయినా వైఎస్‌ వివేకానందరెడ్డి వెనక్కి తగ్గకుండా పోటీలో నిలబడి ఓడిపోయారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రభుత్వ పక్షం ఎలా వ్యవహరించినా ప్రతిపక్షం తన పాత్రను పోషించాలి. అలాకాకుండా చేతులు ఎత్తి వేశారంటే వారిలో పోరాట పటిమ చచ్చిపోయి ఉండాలి, లేదా ఏదో బాహ్యశక్తి నుంచి వచ్చిన ఒత్తిడి అయినా ఉండాలి. 

చంద్రబాబు చెప్పిన «థియరీ కరెక్టు అనుకుంటే లోక్‌సభలో ఒకప్పుడు రెండు సీట్లే ఉన్న బీజేపీ ఈ రోజు 303 సీట్లతో అధికారం లోకి వచ్చేది కాదు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నో పోరాటాల తర్వాత వామపక్ష కూటమిని దించి మమతా బెనర్జీ గద్దెనెక్కారు. కేవలం ఇద్దరితో రాజకీయ పార్టీని స్థాపించి, తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత జగన్‌ అధికారం కైవసం చేసుకున్నారు. 2004లో టీఆర్‌ఎస్‌ చిన్న పార్టీ కింద లెక్క. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని ఇప్పుడు వరుసగా రెండోసారి గెలిచింది. మరో ఆసక్తికర విషయాన్ని గమనించాలి. ఓటుకు నోటు కేసు దెబ్బతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలి వేసిన చంద్రబాబు పార్టీని కూడా త్యాగం చేశారు. తెలంగాణలో గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా 106 చోట్ల పోటీ చేశారు. ఒక్క చోట కూడా డిపాజిట్‌ రాలేదు. తెలంగాణ టీడీపీ అధ్య క్షుడు ఎల్‌.రమణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో పోటీచేసిన టీడీపీ నాగార్జునసాగర్‌లో కూడా పోటీకి సిద్ధం అయింది. బలం మొత్తాన్ని కోల్పోయిన చోట డిపాజిట్లు కోల్పోవడానికి ఇష్టపడుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 30 నుంచి 40 శాతం ఓట్లు ఉన్న ఆంధ్రలో జడ్పీ, మండల ఎన్నికలను బహిష్కరించారంటే దాని అర్థం ఏమి తిరుమలేశా? కాంగ్రెస్‌ నేత ఒకరు అన్నట్లు చంద్రబాబు మరో ఆంధ్రా శశికళ పాత్రలో ఉన్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement