ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 80 శాతం గ్రామాలను గెలుచుకుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆ పార్టీ సోషల్ ఇంజినీరింగ్ ఈ విజయానికి దోహదపడ్డాయి. అయితే, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీ అధిక సర్పంచ్ పదవులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం కూడా ఓ అద్భుతమైన విషయంగా ప్రచారం చేసుకునే దుస్థితి ఆ పార్టీకి దాపురించింది. దీనికి విరుద్ధంగా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఊపు చూస్తుంటే వచ్చే మున్సిపల్, మండల, జడ్పీ ఎన్నికలతోపాటు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్ని కల ఘట్టం పూర్తయింది. పార్టీ రహిత ఎన్నికలే అయినా, గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా ఈసారి పార్టీలు పోటీపడ్డాయని చెప్పాలి. ఆయా పార్టీలు తమ మద్దతుదారులను రంగంలో దించి పంచాయతీలను గెలుచుకునే యత్నం చేశాయి. ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు గెలిచిందన్న లెక్కలు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రమాణం ఏమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఒక వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా ప్రారంభించి, గ్రామాలలో గెలిచిన తమ పార్టీ మద్దతు దారుల ఫొటోలు, పేర్లు తదితర వివరాలను ఉంచడమే కాకుండా, వాటిలో తప్పుంటే చెప్పాలని సవాల్ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. కానీ తెలుగుదేశం వైపు నుంచి స్పందన లేదు. అయినా తాము ఇన్ని గెలిచాం అని ఏవో లెక్కలు చెప్పడం మానలేదు.
చివరికి ప్రతిపక్ష నేత నియోజకవర్గం కుప్పంలో కూడా 74 పంచాయతీలను వైసీపీ గెలుచుకోవడం ఒక పెద్ద సంచలనం. మిగిలిన ఫలితాల సంగతి ఎలా ఉన్నా, ఈ ఒక్కటి చంద్రబాబును విపరీతంగా డ్యామేజీ చేసిందంటే ఆశ్చర్యం కాదు. నాలుగు దశలలో కలిపి 4,230 సర్పంచ్ పదవులు దక్కాయనీ, మొత్తం మీద నలభై శాతం పైగా గెలుచుకున్నామనీ మేకపోతు గాంభీర్యంతో చెప్పారు కానీ వాటికి నిర్దిష్ట ప్రాతిపదిక, ఆధారాలు చూపించలేకపోయారని అనిపిస్తుంది. అందులో ఏమాత్రం నిజం ఉన్నా, ఆయనకు మద్దతిచ్చే పత్రికలు, చానళ్లు జిల్లాలు, మండలాల వారీగా టీడీపీ విజయాలను ప్రచారం చేసి ఉండేవి. మొదటి దశల్లో టీడీపీ బాగా పుంజుకుందని ప్రచారం చేసిన ఈ మీడియా తన పరువు పోతోందని గ్రహించిందో, లేక మరే కారణమో తెలియదు గానీ ఇది టీడీపీ లెక్క, అది వైసీపీ లెక్క అంటూ ప్రచారం చేసి ఊరుకున్నాయి.
చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే చంద్ర బాబు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం అద్భుతమైన విషయమన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఒకటి వాస్తవమే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆయన సొంత గ్రామంలో కూడా తెలుగుదేశం ఓడిపోతే మరింత నష్టం జరిగేది. అది జరగకుండా చంద్రబాబు కొంత జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. అయితే అదే సమ యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 90 శాతం పంచాయతీలు వైసీపీ వశం అవడం కూడా గమనించదగిన అంశమే అవుతుంది.
రాష్ట్రంలో ఫలానా నియోజకవర్గంలో టీడీపీ అధిక సర్పంచ్ పద వులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం 13,097 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 10,382 సర్పంచ్ పదవులను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుందనీ, 2,062 గ్రామాలను టీడీపీ గెలుచు కుందనీ, 475 గ్రామాలలో ఇతర పార్టీలు విజయం సాధించాయని వైసీపీ పేర్కొంది. ఆరు నియోజకవర్గాలలో టీడీపీ ఒక్క సర్పంచ్ పద విని కూడా దక్కించుకోలేదు. 39 నియోజకవర్గాలలో పది లోపు గ్రామాలకే అది పరిమితం అయింది. చంద్రబాబు సైతం వైసీపీ మెజా రిటీ స్థానాలు గెలుచుకుందని పరోక్షంగా అంగీకరిస్తూనే, తమకు వచ్చిన స్థానాలను రెట్టింపు చేసి ప్రచారం చేసుకున్నట్లు కనిపిస్తుంది. తద్వారా పార్టీ ఉనికి రక్షించుకునే యత్నం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్యాడర్ మరీ నీరుగారిపోకుండా ఉండటానికి ఆయన తంటాలు పడుతున్నారు.
కాగా వైఎస్సార్ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉంది. పల్లెల్లో వచ్చిన ఈ సానుకూల ఫలితాల ఊపుతో పట్టణాలలో కూడా పట్టు బిగిం చాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతంగానో, పరిసర ప్రాంతంగానో పరి గణనలోకి తీసుకునే గుంటూరు, కృష్ణా జిల్లాలలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ అధిక స్థానాలలో జయకేతనం ఎగురవేసింది. గుంటూరు జిల్లాలో 744 గ్రామాలను వైసీపీ కైవసం చేసుకుంటే టీడీపీకి 162 మాత్రమే దక్కాయి. అలాగే కృష్ణా జిల్లాలో 680 గ్రామాలను వైసీపీ గెలుచుకుంటే టీడీపీ 168 గ్రామాలను దక్కించుకుంది. అమరావతి రాజధానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని ఇంతకాలమూ టీడీపీ ప్రచారం చేస్తూ వచ్చింది.
ఎన్నికలకు రావాలని పలుమార్లు సవాల్ చేసింది. కానీ ఈ రెండు జిల్లాలలోనూ టీడీపీ ఆధిక్యత తెచ్చుకోలేక పోవడం దేన్ని సంకేతిస్తుంది? రాజధాని అమరావతి పేరుతో గతంలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమనీ, దానికి ప్రజల మద్దతు ఉందన్న వాదనలో వాస్తవం లేదనీ అర్థం అవుతోంది. అంతేగాక అమ రావతి మహోద్యమం అంటూ ప్రచారం చేసిన టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు ఇది జీర్ణించుకోలేని విషయమే అవుతుంది. రాజధాని గ్రామాలు అధికంగా ఉండే తాడికొండ నియోజకవర్గంలో సైతం వైసీపీ ఎక్కువ పంచాయతీలను గెలుచుకుందన్న సమాచారం వచ్చింది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో, దుగ్గిరాల మండలం లోనూ వైసీపీదే గెలుపు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ 696 గ్రామాలను కైవసం చేసుకుంటే తెలుగుదేశం అతి తక్కువగా 71 స్థానాలకే పరిమితం అయింది. ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా టీడీపీ గెలవలేకపోవడం, 108 పంచాయతీలను అన్నింటినీ వైసీపీ గెలుచుకోవడం ఒక రికార్డుగా కనిపిస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పుంగనూరు నియో జకవర్గంలోనూ వంద శాతం వైసీపీ అభ్యర్థులే సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1,161 పంచాయతీలను గెలుచుకుంటే, 188 పంచాయతీలకే టీడీపీ పరిమితం అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం అయ్యాయని అనుకోవాలి. గ్రామాలలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పలు పథకాలు బాగా పనిచేశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు సోషల్ ఇంజినీరింగ్ కూడా జగన్ సమర్థంగా చేయగలిగారనీ, మిగిలిన వర్గాలతో పాటు బీసీలను కూడా బాగా ఆకట్టుకోవడం వల్లే కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాలలో విజయం సాధ్యమైందనీ చెబుతున్నారు.
ఈ గెలుపు ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది. పల్లె ప్రజలు వైసీపీ పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరిచారు. ఇదే సోషల్ ఇంజినీరింగ్‌ను జగన్ కొనసాగించగలిగితే భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలలో గానీ, మండల, జడ్పీ ఎన్నికలలో గానీ, తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సైతం తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ వైఫల్యం చెందిందో గుర్తించలేక, అధికార దుర్వినియోగమనీ, అరాచకమనీ ఏవేవో ఆరోపణలు చేయడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అవి ఏ మాత్రం నిజం కాదని చెప్పడానికి ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు ఉదాహరణ అవుతాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తి సజావుగా జరిగాయని ఆయన ప్రకటిం చారు. ఇది చంద్రబాబుకు నచ్చడం లేదు.
మొన్నటి దాకా ఎన్నికల కమిషనర్‌ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ని కింద పడేసి, ఎన్నికల కమిషన్ వైఫల్యం అని ప్రచారం చేస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు ఈ విషయంలోనూ అలాగే చేశారని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి టీకాలు ఇవ్వాలనీ, ఎన్నికలు వాయిదా వేద్దామనీ ప్రతిపాదిస్తే, ఎన్ని కల కమిషన్ గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ససేమిరా అన్నాయి. తీరా ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా మారింది. దీన్నే పడుకున్న ఎద్దును లేపి తన్నించుకోవడం అంటారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అర్థవంతంగా ఉందని అనుకోవాలా?
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment