అమరావతి కాదు భ్రమరావతి
మనుసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
అమరావతి గత మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనలో భ్రమరావతిగా మారిపోయింది తప్పితే అక్కడ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ నేత, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. అమరావతి బ్రాండుతో విజయవాడ నగరం ఉనికిని కూడా గుర్తించని తీరులో వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితిని ప్రజలు బాధపడుతూనే గమనిస్తున్నారన్నారు. పాలనా రాజధానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తాత్కాలిక నిర్మాణాలకే పట్టం కట్టడంతో అమరావతిలో అసలుకే ఎసరు వచ్చినట్లుందని, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకుండిపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ట్రాన్స్ ట్రాయ్ వంటి నాసిరకం కంపెనీకి కట్టబెట్టి సంవత్సరంలోపే దాన్ని తప్పించే ప్రయత్నం చేయడం అక్కడ అవినీతి ఏ స్థాయిలో జరిగిందో తేల్చి చెబుతోందంటున్న మల్లాది విష్ణు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
విజయవాడ రాజకీయాలు ఉన్నట్లుండి వేడెక్కినట్లున్నాయి కదా?
గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మనసులో పెట్టుకుని దివంగత మాజీ శాసనసభ్యులు, మా అందరికీ అభిమానపాత్రులు వంగవీటి రంగా గురించి అనవసరమైన, అసందర్భమైన వ్యాఖ్యలు చేయడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరైన సమయంలో వైఎస్సార్ సీపీ స్పందించి చర్యలు తీసుకోవడం ముదావహం. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ సరిగా వ్యవహరించడం సంతోషదాయకం.
ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు ఏదో జరిగిపోతోందంటూ వ్యాఖ్యానించారే?
తన నేతృత్వంలోని టీడీపీలో ఎలాంటి వారు ఉంటున్నారో బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నారో అందరికీ తెలుసు. వైజాగ్‌లో పి. గోవింద్ విషయం ఏమిటి? తెలుగుదేశం ప్రభుత్వమే టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన స్థితి. నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి వ్యవహారం ఏంటి? అద్దంకిలో అయితే టీడీపీవాళ్లే ఒకరినొకరు చంపుకున్నారు. నడిరోడ్డులో రవాణా కమిషనర్ మీద, ఆయన భద్రత చూసే కానిస్టేబుల్ మీద కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు దాడిచేశారంటే ఈ మూడున్నరేళ్లలో విజయవాడ పరిస్థితి ఏరకంగా ఉందో ఆలోచించుకోవాలి.
విజయవాడపై అమరావతి సెంటిమెంటు ప్రభావం ఏమిటి?
తొలినుంచి అమరావతి అంటూ పెద్ద ప్రచారం చేశారు. తప్పులేదు. కానీ అదే సమయంలో విజయవాడ ప్రాశస్త్యాన్ని, నేపథ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ అలా వ్యవహరించడం లేదు. విజయవాడ పేరును అమరావతిలో కలిపేసి దానికి ఉనికే లేకుండా చేశారు.
విజయవాడ ప్రజలు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారు?
శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన విజయవాడకు ఇప్పుడు ఉనికే లేకుండా చేస్తున్న పరిస్థితిని ప్రజలు బాధపడుతూనే గమనిస్తున్నారు. కానీ తమ బాధను, అసంతృప్తిని తక్షణం తెలియచెప్పలేరు కాబట్టి సమయం కోసం వేచి చూస్తున్నారు.
అమరావతి సెంటిమెంట్ టీడీపీకి లాభమా?
అమరావతి వ్యవహారాన్ని అందరం చూస్తున్నాం. అది భ్రమరావతి. ఈ మూడున్నరేళ్ల కాలంలో అక్కడ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. సెంటిమెంటును వాడుకున్నారు కానీ రాజధాని అమరావతికి దూరంగానే ఉంది. అమరావతితో పాటు విజయవాడకు కూడా గుర్తింపు వచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం చేయడం లేదు.
రాజధాని వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోవడం ఏమిటి?
రాజధాని నిర్మాణం అంటే మూడేళ్లో, అయిదేళ్లలో పూర్తయ్యే పని కాదు. సుదీర్ఘమైన సమయం తీసుకుంటుంది. మొదటేమో రాజధానిగా నూజివీడు అన్నారు. తర్వాత గన్నవరం అన్నారు. ఇప్పుడేమో తీసుకొచ్చి తుళ్లూరులో పెట్టారు. ఈ గందరగోళం మూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత ఇబ్బందికి గురైంది. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకుండిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాజధాని లక్ష్యాలనేమో 2020, 2050 అంటూ దీర్ఘకాలానికి పెట్టుకుని ఇప్పుడు కాస్త నెమ్మదిగా చేసుకుంటూ పోదామని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో అందరూ సంశయిస్తున్నారు. రాజధాని ఇక్కడ ఉంటుంది అంటూ మొదట్లో మూడు ప్రాంతాలను ప్రకటించి గందరగోళం సృష్టించడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇబ్బందికి గురైంది కాబట్టి తొందరపడి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది ఇబ్బందికరమైన విషయమే.
రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి దీంతో సమస్యే కదా?
విభజనకు గురైన రాష్ట్రానికి ముందుగా పాలనా రాజధాని అవసరం. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంటూ ఆ దిశగా ఈ మూడున్నరేళ్లలో కొద్ది అడుగులే వేశారు. ఇక ఆసుపత్రులు, హోటల్స్ అంటూ ప్రైవేట్ రంగంలో వచ్చేవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం పాలనా రాజధానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు వేగవంతం చేసి ఉంటే అందరికీ నమ్మకం ఏర్పడేది. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేయడంతో అసలుకు ఎసరు వచ్చినట్లయింది.
పోలవరం ప్రాజెక్టులో అవకతవకలపై మీ అభిప్రాయం?
వైఎస్సార్ హయాంలోనే పోలవరంపై 4 వేల కోట్లు ఖర్చు చేశారు. కుడి ఎడమ కాలువల పని కూడా చేపట్టారు. ఇప్పుడు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారు. ఇది నాసిరకం కంపెనీ.. జాతీయ స్థాయిలో రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ సంస్థ శక్తిసామర్థ్యాలేమిటి అని ఆలోచించాలి కదా. కానీ మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ కంపెనీని తొలగించి మరో కొత్త కంపెనీకి కట్టబెట్టబోతున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రాయపాటిది అంటున్నారు. దాన్ని తొలగించేశారా?
నోటీసు ఇచ్చారు. పదిరోజుల్లో ప్రభుత్వం తొలగిస్తుంది కూడా. అందుకే రాయపాటి ఈ విషయంలో నోరు విప్పాల్సి ఉందని ముందే చెప్పాను. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నాసిరకం సంస్థ అని, పని చేయలేకపోతోందని ప్రభుత్వం భావిస్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా చెప్పాలని మొన్ననే రాయపాటిని ప్రశ్నించాను. కొత్త కంపెనీకి ఏ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇస్తారు అనేది ప్రశ్న. పోలవరంపై ప్రశ్నిస్తేనే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అని ఆరోపిస్తారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఏపీ అసెంబ్లీలో కూడా పోలవరంపై ప్రజెంటేషన్ ఇవ్వండి. శ్వేతపత్రం ప్రకటించండి అని డిమాండ్ చేశాం.
పోలవరంలో అవినీతిపై మీ అభిప్రాయం?
ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల్లోపే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 300 కోట్లు ఇస్తే దాన్ని ఏమనాలి? ఇప్పుడు నాసిరకం కంపెనీ అని చెబుతూ తొలగించే ప్రయత్నం చేస్తోంది.
కోస్తా జిల్లాల ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఎలాంటి భావన ఉంది?
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కలబోతే తమ ప్రభుత్వం అని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఇవేవీ కనిపించలేదు. సంక్షేమం అంటున్నారు. కొత్తగా మీరు తీసుకొచ్చిన సంక్షేమం ఏంటి? 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలకు ఒక రోల్ మోడల్‌గా సంక్షేమ భావనను ఆయన తీసుకొచ్చారు. ఈరోజు ఆ పథకాలను బాబు కాపీ గొడుతున్నారు. బాబు ప్రభుత్వంలో సంక్షేమ చర్యల గురించి చెప్పాలంటే 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల తన పాలనను చూపిస్తే చాలు.
ఏపీలో చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమం ఏంటి? 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలకు ఒక రోల్ మోడల్‌గా సంక్షేమ భావనను ఆయన తీసుకొచ్చారు. ఈరోజు ఆ పథకాలనే బాబు కాపీ కొడుతున్నారు. బాబు ప్రభుత్వంలో సంక్షేమ చర్యల గురించి చెప్పాలంటే 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల తన పాలనను చూపిస్తే చాలు.