తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఇందులో ఆయన చిత్తశుద్ధి ఎంత ఆ వెంకటేశ్వరుడికే తెలియాలి కానీ.. ఆయన తన వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు.. పశ్చాతాప పడినట్లు మాత్రం లేరు. జరగని తప్పును జరిగినట్లు చూపించేందుకు పోటీ పడుతున్న పవన్.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణను పుట్టించింది.. ఆపై ప్రచారం చేస్తూ అపచారం చేస్తున్నదీ చంద్రబాబే అన్నది గుర్తించడం అవసరం. ఎందుకంటే.. ప్రాయశ్చిత్త దీక్షపై వస్తున్న కథనాలు చదివితే అవి.. బాబుకు వంత పాడేందుకు చేస్తున్నవే అన్న సందేహం రాకపోదు.
లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో తానెక్కడ ప్రచారం పడిపోతానో అన్న ఆదుర్దాతో పవన్ ఈ దీక్ష హంగామా సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలాగూ నెరవేర్చలేకపోయాం కాబట్టి.. ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఈ డ్రామాకు లేవనెత్తారా? అన్నది సామాన్యుడి ఒక సందేహం.
పోనీ.. లడ్డూ ప్రసాదంలో కల్తీని పవన్ కళ్యాణ్ నిజంగానే విశ్వసిస్తున్నాడని అనుకుందాం. స్వామివారిపై భక్తి కూడా నిజమే అని భావిద్దాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుగా చేయాల్సిన డిమాండ్ ఏమిటి? కల్తీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించి దోషులెవరో పట్టుకుని శిక్షించాలని కదా? తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలపై దాడు చేసి కల్తీకి సంబంధించిన ఆధారాలు సేకరించాలి కదా? పవన్ ఈ డిమాండ్లేవీ చేయడం లేదు ఎందుకని? నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి సంబంధించిన నెయ్యి నమూనాను పరిశీలించి నిర్దిష్టంగా ఫలానా కొవ్వు కలిసిందని పవన్ నమ్ముతున్నారా?.
వెనకటికి దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. దూడను కట్టేయండని అన్నారట. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు (ఒకవేళ నిజంగానే కల్తీ జరిగిందని అనుకుంటే) జగన్ ప్రభుత్వానికి ఆపాదించడం ఏమిటి? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాసి కోరినట్లుగానే బాబు, పవన్‌లు కూడా సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు?. ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసి ఉండవచ్చు కదా?. పైగా.. తన ఆధీనంలోనే ఉండే సిట్ వేయడం వల్ల బాబుకు కలిగే ప్రయోజనం ఏమిటి?. టీటీడీ ఈవో లాంటి వారే ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా తన మాటలను రోజుకో తీరుగా మార్చేస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఉన్నతాధికారుల మాటలకు తగ్గట్టుగా నివేదిక సిద్ధం చేయరన్న గ్యారెంటీ ఏమిటి?.
పాపం పవన్.. ఉపముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్ద ఏదో నేర్చుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ.. వాస్తవానికి ఆయన అబద్ధాలు ఎలా చెప్పాలి? మాట తప్పడం ఎలా? వంటివే తన గురువు నుంచి ఒంటపట్టించుకుంటున్నట్లు అర్థమవుతోంది. అసలు విషయాలపై ప్రజల దృష్టిని ఎలా మళ్లించడం అన్న అంశంలో స్పెషలైజేషన్ చేస్తున్నట్లుంది. ఈ విద్య బాబుకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలుసునంటే నమ్మలేము. ఒకటో రెండు పాఠాలూ పవన్‌కూ అబ్బినట్లు కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఫలానా మంచి పని చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు ఈ డ్రామాను సృష్టించారనిపిస్తుంది. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటికి నెరవేర్చుతారో చెప్పలేకపోతున్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గప్పాలు పలికిన వీరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తారు. చంద్రబాబు అయితే ప్రైవేటీకరణకు అనుకూలంగా గొంతు సవరించుకుంటున్న తీరుపై కార్మిక సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఈ అంశాలన్నింటీ నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకే బాబు లడ్డూ ప్రసాదం అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇటీవల విజయవాడకు వచ్చిన వరదల్లో కేవలం తాను నివసిస్తున్న అక్రమ కట్టడాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబు లక్షలాది సామాన్యులను నీట ముంచాడని ప్రజలకూ ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇలాంటి వాటన్నిటిని మర్చిపోయేలా చేయాలంటే ఏదో పెద్ద అంశాన్నే లేవనెత్తాలని అనుకుని మరీ తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో రాజకీయం మొదలుపెట్టారు. చంద్రబాబు లాంటి వారికి దేవుడిపై నిజంగానే నమ్మకం ఉంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే, తిరుమలతోపాటు రాష్ట్రం పరువు పోయేలా కల్పిత గాథలను జనంలోకి వదులుతారా?. చివరికి టీడీపీ మీడియా కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ దారుణమైన, నీచమైన అసత్యాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందా?
నెయ్యిలో కల్తీపై జూలై 23న నివేదిక వచ్చిందని చెబుతున్నారు కదా! నిజాయితీ ఉన్న పాలకులు అయితే ఏమి చేయాలి? వెంటనే సంబంధిత సంస్థపై దర్యాప్తునకు ఆదేశించాలి. దాడులు చేసి ఆధారాలు సేకరించాలి. సాక్ష్యాలు దొరికితే అరెస్టులు చేయాలి. అలాకాకుండా రెండు నెలలు ఏమీ తెలియనట్లు ఉంటారా? ఆ తరువాత తీరికగా.. వైఎస్ జగన్‌పై నీచమైన అభాండాలు వేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తారా?. వైఎస్ జగన్‌పై రాజకీయ ద్వేషం ఉంటే వేరే రీతిలో తీర్చుకోవాలి. అంతేకానీ తిరుమలను అడ్డుపెట్టుకుని ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా?. కల్తీ జరిగి తిరస్కరించామని చెబుతున్న తమిళనాడు కంపెనీ నుంచే మళ్లీ నెయ్యి తీసుకుంటామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చెప్పడం ఏమిటి? ఇంకోపక్క మంత్రి లోకేష్ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెబుతారు. మీ పాలనలో టీటీడీలో తప్పు జరిగితే దానికి బాధ్యత ఆ సంస్థదే. అటువంటప్పుడు జగన్ పాలనలో తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? ఇదెక్కడి తర్కం?.
కోట్ల మంది స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అపవిత్రమైందో లేదో తెలియదు కానీ.. పవన్, లోకేష్, చంద్రబాబుల మాటలు, చేష్టలతో మాత్రం కచ్చితంగా అయ్యిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనసుల్లో ఇప్పుడు వీరు అనుమానాలు లేవనెత్తారు. వాస్తవానికి చంద్రబాబు, పవన్‌లు ఏం కోరుకుంటున్నారు?. తిరుమలలో లడ్డూలు కల్తీవి సరఫరా చేస్తున్నారని డప్పు వేసి చెప్పాలన్నది, ప్రచారం చేయాలన్నది వీరి అభిమతమా? తద్వారా తిరుమలకు భక్తులు తిరుమలకు రాకుండా, లడ్డూలు తినకుండా చేయాలన్నది ఉద్దేశమా? తిరుమలకు ఎంత అప్రతిష్ట వచ్చినా ఫర్వాలేదు కానీ.. వైఎస్ జగన్ బద్నాం కావాలనే వీరు పట్టుపట్టి పనిచేస్తున్నారా?.
గతంలో రథాలు తగులు పెట్టారని, దేవాలయాలపై దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వాటిపై సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశిస్తే కేంద్రం ఎందుకు వేయలేదో ప్రశ్నించరు. నిజానికి సోషల్ మీడియాలో ఈయనపై వస్తున్న కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంత హిందూ మతోద్దారకుడినని చెప్పుకునే ఈయన వేరే మతానికి చెందిన మహిళను ఎలా పెళ్లి చేసుకున్నారు? పోనీ చేసుకుంటే చేసుకున్నారు. వారికి పుట్టిన బిడ్డలలో ఒక్కరికి కూడా హిందూ పేరు పెట్టకుండా అన్యమత పేర్లు ఎందుకు పెట్టారని కొందరు అడుగుతున్నారు.
అంతేకాదు.. చంద్రబాబు గోదావరి పుష్కర స్నానాలకు వెళ్లి షూటింగ్ పెట్టుకుని తొక్కిసలాటకు కారణమై ఇరవై తొమ్మిది మంది మరణిస్తే అందులో పాపం ఏమి లేదా? అప్పుడు పవన్ నోరు విప్పలేదే!. ఇవన్నీ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో భార్య ఇంటిలో ఉండగానే వేరే మహిళను తీసుకు వచ్చి కాపురం చేశారన్న ఆరోపణపై ఎన్నడైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో వేరేవారు అంటే నమ్మలేం. స్వయంగా ఆయన మాజీ భార్యే ఈ విషయం వెల్లడించారే!.
పవన్ శిష్యుడు వంటి జానీ మాస్టర్ తాజాగా రేప్ కేసులలో ఇరుక్కుంటే ఆయన ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదు. తను పవన్ స్పూర్తితోనే ప్రయాణం చేస్తున్నానని జానీ మాస్టర్ చెబుతుంటే, అతనికి సామాజిక స్పృహ ఉందని ఈయన సర్టిఫికెట్ ఇచ్చారు. వలంటీర్లను కిడ్నాపర్లుగా పోల్చి ముప్పైవేల మంది యువతులకు తరలించారని నీచమైన ఆరోపణ చేశారే. దానిని రుజువు చేయలేకపోయారే. ఇలాంటి వాటికి కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి! బొట్టు పెట్టుకుని, కాషాయ శాలువా కప్పుకుంటే పవిత్రులై పోరు. నిజ జీవితంలో కూడా పవిత్రంగా ఉండాలి. పవన్ ఇది గుర్తిస్తే మంచిది!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment