అడ్డగోలు మాటలకు అర్థం ఏమిటి? | Kommineni Srinivasa Rao Guest Column On Chandra babu Naidu | Sakshi
Sakshi News home page

అడ్డగోలు మాటలకు అర్థం ఏమిటి?

Published Wed, Oct 13 2021 12:39 AM | Last Updated on Wed, Oct 13 2021 8:57 AM

Kommineni Srinivasa Rao Guest Column On Chandra babu Naidu - Sakshi

కేంద్ర నిఘా సంస్థల దగ్గర కూడా లేని సమాచారం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుంది. అందుకే తాలిబన్లు, తాడేపల్లి అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలన్నంత కసితో ప్రకటనలు గుప్పించారు. సమస్య ఏమిటంటే– ప్రజాక్షేత్రంలో ఓటమిని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం అన్న మాటే మరిచిపోయారు. రాజకీయాలను విషక్రీడగా మార్చారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా తట్టెడు బురద చల్లడం మొదటినుంచీ చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయనకు ఎన్టీఆర్‌ అయినా, కేసీఆర్‌ అయినా, జగన్‌ అయినా, మరొకరు అయినా ఒకటే.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన రెండు ప్రకటనలు గమనించదగినవి. తన పార్టీ  ఓడిపోవడం ఆయనకు జీర్ణించుకోలేని విషయమే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎవరు కావాలని అనుకుంటే వారిని ఎన్నుకుంటారు. అయినా ప్రతిపక్షంలో ఉన్నా తామే పెత్తనం చేయాల నుకుంటే కష్టమే. ఇంతకీ బాబు చేసిన ప్రకటనలు ఏమిటో చూద్దాం. తాలిబన్లకూ తాడేపల్లికీ ఉన్న లింక్‌ బయటపెడతామని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు చూస్తే ఏమని పిస్తుంది! తక్షణమే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయా లన్న వ్యూహం ఏమైనా ఉందా అన్న సంశయం కలుగుతుంది. 

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి, అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఘాతుకాలకు పాల్పడు తున్నారు. మరి ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిని తాలిబన్లతో పోల్చ డమే కాకుండా, లింకులు బయటపెడతామని చంద్రబాబు అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగా అలాంటి లింకులు ఉంటే కేంద్ర ప్రభు త్వానికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకూ తెలియదా? వారికన్నా చంద్ర బాబుకే ఎక్కువ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ఉందా? ఆ దేశ అధ్యక్షుడు తెలుసు... ఈ దేశ ప్రధాని తెలుసు... తాను, బిల్‌ క్లింటన్, టోనీ బ్లేయర్‌ అంటూ గతంలో ఏవేవో కబుర్లు చెప్పేవారు. సింగపూర్, మలేíషియాలతో సంబంధం ఉందనీ, జపాన్‌కు చెందిన ప్రముఖుడిని అమరావతికి తెచ్చాననీ అనేవారు. వీటన్నింటిని బట్టి కేంద్రం కన్నా చంద్రబాబే తెలివైనవాడనీ, ఎక్కడి సమాచారం అయినా ఆయనకు ఇట్టే వస్తుందని అనుకోవాలి కదా? చంద్రబాబే స్వయంగా ఆ దర్యాప్తు సంస్థలకు తన వద్ద ఉన్న సమాచారం అందించవచ్చు కదా!

తాలిబన్లతో పోల్చుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించా ల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. అంటే ఇప్పటి కిప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తాను ఆ కుర్చీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారా! 1989–94 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండేది. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పక్షాన బాబు ఇలాగే మాట్లాడేవారు. దానికి ఆనాటి మంత్రి రోశయ్య ‘బాబూ... నువ్వు దిగు, దిగు... నేను ఎక్కుతా అంటే కుదర’దనీ; ‘ఉట్టి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపో’దనీ అనేవారు. కానీ ఎలాగైతే నేమి 1995లో తన మామ ఎన్టీ రామారావును చంద్రబాబు పదవీచ్యు తుడిని చేశారు. అంటే ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. తాలిబన్లు మరో పద్ధతిలో అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. మరి అలాంటప్పుడు చంద్ర బాబు ఆధ్వర్యంలోని టీడీపీ తాలిబన్ల మాదిరి వ్యవహరించిందని చెప్పవచ్చా? చంద్రబాబును తాలిబన్‌ అనడం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్‌పై అలాంటి విమర్శ చేసినప్పుడు, సహజంగానే ఆయా విషయాలు స్ఫురణకు వస్తాయి. 

ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కూడా ఆయా వ్యవస్థలను విజయవంతంగా చంద్రబాబు వాడుకున్నారని ప్రచారం జరిగేది. తన మామను దించినట్లుగా జగన్‌ ప్రభుత్వాన్ని దించడం సాధ్యమయ్యే పని కాదు కనుక, కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఏమైనా కుట్ర పన్నుతారా అన్న సందేహం కలగవచ్చు. ఇలాంటివి చేసేవారిని కదా తాలిబన్లు అనాలి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌కు జగన్‌ ఒక వినతిపత్రం సమర్పిం చిన సందర్భంలో– చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట అంటేనే ఇంకేముంది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని హోరెత్తిం చారే! మరో వైపు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే! ఇంకో సంగతి చెప్పాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి బాబు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని, ఆ తర్వాత వీలైతే మరికొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్‌ కాస్త అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది... లేకుంటే ఆయన బాబు చేతిలో ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడా నికి చేసే ప్రయత్నాన్ని కదా తాలిబన్‌ అని అనాలి!

డ్రగ్స్‌ వ్యవహారానికీ, జగన్‌ ప్రభుత్వానికీ లింక్‌ పెట్టడానికి విశ్వ యత్నం చేశారు. చోటామోటా నేతలతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి మరికొందరు నేతలపై ఆరోపణలు చేయిం చారు. అక్కడ మత్స్యకారుల బోటు దగ్ధం అయితే అందులో డ్రగ్స్‌ ఉన్నాయని ప్రచారం చేశారట. దానిపై మత్య్సకారులు టీడీపీ ఆఫీస్‌ వద్ద నిరసన చెప్పారట. దీనిని వైసీపీ వారు దాడి చేశారని చంద్ర బాబు ప్రచారం చేశారు. అక్కడ ఒక ఎగుమతిదారుడితో వైసీపీ వారికి సంబంధాలు అంటగట్టే యత్నం చేశారు. తీరా చూస్తే ఆ ఎగుమతి దారుడు అలీ షాతో చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు దిగిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి బయటపెట్టారు. పైగా స్వయంగా అలీ షా జిల్లా ఎస్పీని కలిసి తనపై విచారణ చేయాలనీ, డ్రగ్స్‌ ఆరోపణలు నిజం కాదని తేలితే, ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకోవాలనీ కోరారు. దాని గురించి టీడీపీ సమాధానం ఇవ్వాలి కదా? దీనిపై పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇస్తే దానిపై మళ్లీ గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు చేయడం, తర్వాత జారి పోవడం టీడీపీకి అలవాటుగా మారింది. కాకినాడలో నిజంగానే పడవలో డ్రగ్స్‌ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? ఇన్ని కబుర్లు చెప్పే జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుజరాత్‌లో అంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడితే ఆ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనే సాహసం చేయడం లేదేమి? ఒకప్పుడు మోదీని తీవ్రంగా దూషించిన టీడీపీ ఇప్పుడు నోరు విప్పడానికే ఎందుకు భయపడు తోంది?

చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీటీడీ అధికారిక ప్రకటన చేస్తే దానిపై చంద్ర బాబు ఇంతవరకు నోరు విప్పలేదు. అలాగే పండోరా పత్రాలలో పలువురు భారత ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వెంటనే దానిని జగన్‌కు పులిమే యత్నం చేశారు. ఇందులో జగన్‌ పేరు కూడా ఉండ వచ్చేమో అని టీడీపీ నేతలు అనుకున్నారట. దానిని ఈనాడు పత్రిక పెద్ద శీర్షిక పెట్టి వార్త ఇచ్చింది. తద్వారా పత్రికా ప్రమాణాలను మరింతగా దిగజార్చింది. వాస్తవంగా ఎవరిపై ఆధారాలు ఉన్నా బయటపెట్టవచ్చు. అలాకాకుండా ఒక ప్రతిపక్ష పార్టీ ఇలా అను కుంది... అలా అనుకుంది... అనుకుంటే అందులో చెత్త ఉన్నా, అలాగే రాస్తారా? అందుకే సజ్జల ఒక ప్రశ్న వేశారు. రామోజీరావు పేరు కూడా పండోరా జాబితాలో ఉందని తామెవరైనా అనుకుంటే రాస్తారా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అంటూ అలీషాతో ఆయన ఉన్న ఫొటోలను చూపించారు. లోకేశ్‌ హడావుడిగా దుబాయి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 

రాజకీయాన్ని ప్రజాసేవగా కన్నా, ఒక విషక్రీడగా చంద్రబాబు మార్చారన్న విమర్శలకు గురి అవుతున్నారు. గతంలో 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు– అసెంబ్లీలో చంద్ర బాబు మాట్లాడుతూ... కర్నూలులో ఒక అటవీ అధికారితో కుమ్మక్కై విజయభాస్కరరెడ్డి పదికోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని తన చాంబర్‌లో ఉన్న కోట్ల విన్న వెంటనే అసెంబ్లీ హాల్‌లోకి ఆగ్రహావేశాలతో వచ్చి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా, ఏ అవకాశం వచ్చినా తట్టెడు బురద చల్లడం  చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయ నకు ఎన్టీఆర్‌ అయినా, జగన్‌ అయినా, మరొకరు అయినా ఒకటే.


కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement