ఏపీ అసెంబ్లీ తాజా ఎపిసోడ్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన సతీమణిని తానే బదనాం చేసుకున్నంత పనిచేయడం అత్యంత దురదృష్టకరం. ఆయన తన సతీమణి ప్రతిష్ఠను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబును కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలా లేదు. కాదూ... అలా చేశారని ఆరోపిస్తున్నప్పుడు కనీసం దానిపై సభలోనే నిలదీయాల్సింది.
అలా కాకుండా చంద్రబాబు లేచి తాను సీఎం అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడే పరిస్థితిని తానే కోరి తెచ్చుకున్నట్లయింది. ప్రెస్‌మీట్‌లో విలపిస్తూ, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది.
ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కాస్త తొందరపడ్డారు. అసెంబ్లీలో, ఆ తర్వాత జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే ఈ భావన కలుగుతుంది. తన వ్యక్తిగత విషయాన్ని మొత్తం రాష్ట్రానికి వర్తింపచేసి, తాను మళ్లీ సి.ఎమ్. అయ్యాకే సభలోకి వస్తానని చేసిన ప్రకటన, తదుపరి కాస్త సవరించుకుని ప్రజాక్షేత్రంలో తేల్చుకుని వస్తానని చేసిన ప్రకటన తొందరపాటుగా అనిపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన తన సతీమణిని తానే బదనాం చేసుకున్నట్లుగా అవడం అత్యంత దురదృష్టకరం.
డెబ్బై ఏళ్లు దాటిన ఈ వయసులో, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయడం బాగోలేదు. ఆయన తన గౌరవాన్ని పెంచుకునే విధంగా వ్యవహరించి ఉండాల్సింది. తన సతీమణి ప్రతిష్టను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు కావచ్చు..మరొకరు కావచ్చు..ఎవరైనా చంద్రబాబును కాని, ఆయన కుటుంబ సభ్యులను కాని ఉద్దేశించి ఎవైనా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా తప్పే అవుతుంది. వాటిని ఖండించాల్సిందే. కాని దానిపై చర్చ కూడా జరగకముందే చంద్రబాబు లేచి ఆవేశంగా తాను సి.ఎమ్. అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడినట్లయింది.
ఒకవేళ అంబటి రాంబాబు అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే, వెంటనే టీడీపీ సభ్యులంతా కలిసి అసెంబ్లీలో తేల్చుకుని ఉండాల్సింది. అంబటిపై చర్య తీసుకోవాలని కోరి ఉండాల్సింది. అలాకాకుండా చంద్రబాబు సభా బహిష్కారం ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో విలపించడం ద్వారా తనకు అవమానం జరిగిందని, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది.
అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే తప్పు. కాని నిర్దిష్ట ఆధారాలు లేకుండా తన భార్యను ఏదో అన్నారంటూ చంద్రబాబు మాట్లాడడం అంతకన్నా పెద్ద తప్పు అవుతుంది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మధ్య జరిగిన ఈ న్యూసెన్స్‌ను చంద్రబాబు అసెంబ్లీకి తెచ్చి అక్కడ అందరికి పులిమే యత్నం చేయడం ఎంతవరకు సమంజసం? అలా చేయడం ద్వారా తన రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.
నిజంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే, సంబంధిత వీడియోని చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించి ఉండేవారు. అప్పుడు వైఎస్సార్‌సీపీ ఆత్మరక్షణలో పడేది. కానీ ఆయన అలా చేయలేదు. పైగా అంబటి రాంబాబు తాను ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసి ఉంటే చెప్పుతో కొట్టవచ్చని సవాల్ చేశారు. మరి దీనికీ టీడీపీ సమాధానం చెప్పలేదు.
పైగా అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యవసాయరంగంపై మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆ అంశంతో సంబంధం లేని రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటికి కన్నబాబు కానీ, ఇతరులు కానీ సమాధానం ఇస్తూ వెళ్లారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకు వేసి బాబాయి–గొడ్డలి, తల్లి, చెల్లి అంటూ రెచ్చగొట్టే విధంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించసాగారు. చివరికి బాబు సైతం ఈ వ్యాఖ్యలు అన్నారు.
అంటే అది సీఎం జగన్‌ను అవమానించినట్లు కాదా? తల్లికి ద్రోహం చేశారని చంద్రబాబు అనవచ్చా? ఈ క్రమంలో అంబటి లేచి ఏదో సర్దుబాటు ధోరణితో మాట్లాడాలని అనుకుని ఆ ప్రయత్నం చేశారు. కానీ ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే ఎవరో రాంబాబును ఉద్దేశించి అభ్యం తరకర వ్యాఖ్య చేశారు. అది సమంజసమేనని చంద్రబాబు అంటారా? దానికి ప్రతిగా ఆయన అన్నీ మాట్లాడదాం.. అంటూ మాధవరెడ్డి అన్న పదం మాట్లాడారు. ఆ మీదట చంద్రబాబు తన భార్యను కించపరిచారంటూ, ఇది కౌరవ సభ, తాను ఇక్కడ ఉండను, మళ్లీ íసీఎం అయ్యాకే అడుగుపెడతానని శపథం చేసి వెళ్లిపోయారు.
నిజానికి చంద్రబాబు మాట్లాడుతుండగా, కొంత వివాదాస్పదంగా ఉందనుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మైక్ కట్ చేశారు. కానీ, చంద్రబాబు మాట్లాడిన ఇతర మాటలన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. దానికి కారణం ఒక టీడీపీ ఎమ్మెల్యే తన సెల్ పోన్‌లో వాటిని చిత్రీకరించడమేనని తేలింది. నిజానికి ఇలా సెల్ అసెంబ్లీ లోనికి తెచ్చి చిత్రీకరించడం తప్పు. అయినా చేశారు.
ఒకవేళ నిజం గానే అంబటి లేదా మరెవరైనా కనుక అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని కూడా టీడీపీ ఎమ్మెల్యే రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలేవారు. చంద్రబాబు మీడియా సమావేశంలో పెట్టి చూపేవారు. అవేవీ చేయలేదు.అంటే వారి వద్ద అలాంటి ఆధారాలూ ఏవీ లేవు. చంద్రబాబు అసంబ్లీకి రాకుండా ఉండాలనుకుంటే అందుకు అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు.
ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన శపధం నెరవేరాలంటే ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. అంటే అసెంబ్లీ ఎన్నికలు రావాలి. అప్పటి వరకు ఆగాల్సిందే. ఆయన దానికన్నా అసెంబ్లీకి రాజీనామా చేసి సవాల్ విసిరి ఉంటే తెలుగుదేశం కార్యకర్తలలో ఒక ఉత్సాహం వచ్చేది. కాని ఆయన అలా చేయకుండా కుట్రపూరిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ నేత ఒకరు పార్టీ ఆఫీస్‌లో కూర్చుని ఎంత నీచంగా సంబోధించిందీ అందరికీ తెలుసు.
అయినా చంద్రబాబు ఖండించలేదు. వైఎస్ జగన్ కుటుంబంలోని వారందరినీ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అవమానిస్తున్నప్పుడు, జేసీ దివాకరరెడ్డి ఆనాటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ని దారుణంగా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు ముసిముసి నవ్వులతో కూర్చునేవారు. చంద్రబాబు, లోకేష్‌లు జగన్‌ను ఉద్దేశించి సైకో రెడ్డి అని, మరొకటని పలుమార్లు వ్యాఖ్యానించారు. గత టరమ్‌లో నగరి ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ ఎలా వ్యవహరించింది.
ఎంత ఘోరంగా అవమానించిందీ ఆమె చెబుతుంటే ఎవరికైనా బాధ కలిగిస్తుంది. జగన్ కుటుంబంపైన, ఆయన సోదరి షర్మిల పైన బాలకృష్ణకు చెందిన ఒక భవనం నుంచే అసభ్యకర మెస్సేజ్‌లు ప్రచారం అవుతుండేవన్న అభియోగం వచ్చింది. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్.టి.ఆర్ రెండో కళత్రం లక్ష్మీపార్వతిని, చంద్రబాబు వర్గం ఎన్నిరకాలుగా అప్రతిష్టపాలు చేసిందీ ఆమె ఇప్పటికీ చెబుతూనే ఉంటారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన పరాభవం గురించి ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబిస్తారా? ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘట్టం, ఆయన కన్నీటి పర్యంతం అయిన ఘట్టం వంటివి జరిగినా, అప్పట్లో సొంత కుటుంబ సభ్యులు కనీసం ఆయనను పరామర్శించలేదు. ఇప్పుడు చంద్రబాబు భార్యను తాము ఒక్క మాట కూడా అనలేదని వైసీపీ వారు పదేపదే చెబుతున్నా, మీరు అన్నారు... అంటూ టీడీపీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, మరికొందరు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమెకు తీరని అన్యాయం చేస్తున్నారు.
బాబు రాజకీయాలలోకి వీరు రావడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలను పొడిగించుకుంటూ వెళ్లడం సంబంధిత మహిళకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించాలి. అయినా ఆమె కుటుంబ సభ్యులే ఇలా పదేపదే ఉటంకించి ఆమె గురించి ప్రచారం చేయడం బాధాకరం. రాజకీయాల ముందు ఇవేవీ కనిపించవేమో! నేను మాత్రం ఆమె గౌరవానికి భంగం కలగరాదని పేరు కూడా రాయలేదు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment