తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ఏడుసార్లు గెలుపొందిన ఎన్నికైన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి జంప్ చేయడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బే అవుతుంది. శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశేష గౌరవమే ఇచ్చారు. సంజయ్ అయితే కేసీఆర్‌కు సొంత మనిషి కింద లెక్క. అయినా వారిద్దరూ పార్టీని వీడారంటే ఏమిటి అర్థం. రాజకీయాలలో తమ వ్యక్తిగత అవసరాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని మరోసారి వెల్లడైంది. ఇందులో కులం లేదు. ప్రాంతం లేదు. సిద్దాంతం లేదు.. తమ స్వప్రయోజనాలే మిన్నగా ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయంగా ఇప్పటికిప్పుడు జరిగే నష్టం కన్నా, నైతికంగా పార్టీ క్యాడర్‌పై దీని ప్రభావం పడుతుంది.
పెద్ద నేతలు, పలు ముఖ్యమైన పదవులు చేసినవారు సైతం పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం ప్రబలితే కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తాము కూడా పక్క చూపులు చూడాలా అన్న ఆలోచనకు వస్తారు. విశేషం ఏమిటంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాను కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చెబుతారు. దానికి పోచారం ఉదంతం కూడా ఒక ఉదాహరణే. పోచారం ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆహ్వానించడం విశేషం. దీని ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్లయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా రేవంత్ వెంట వెళ్లారు.
ఇప్పటికే మరో సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు వంటివారు కాంగ్రెస్‌లో చేరిపోయారు. బహుశా అలాంటివారి ప్రభావం కూడా పోచారంపై పడి ఉండవచ్చు. 1994లో తొలిసారి శాసనసభకు టీడీపీ పక్షాన ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్ వాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా ఎదిగారు. 1995లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి పోచారానికి మంత్రి పదవి వచ్చింది. కాని ఆయన అల్లుడుపై వచ్చిన స్టేషనరీ స్కామ్ కారణంగా పదవికి రాజీనామా చేశారు. ఆ స్కామ్ రుజువు కాకపోవడంంతో సేఫ్‌గా బయటపడ్డారు. 2004లో ఓటమి చెందిన ఈయన 2009లో తిరిగి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో కెసిఆర్ కోరిక మేరకు ఆయన టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి పదవి పొందారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉన్న ఆయన 2018లో మరోసారి గెలిచారు. ఈసారి ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్ అయ్యారు. స్పీకర్‌గా ఇతరత్రా పెద్ద వివాదాస్పదుడు కాకపోయినప్పటికీ, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి కొందరుఎమ్మెల్యేలు చేరే క్రమంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సూచనల ప్రకారమే వ్యవహరించారు తప్ప ఈ విషయంలో స్వతంత్రంగా పనిచేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో విలీనం చేసినట్లు ప్రకటించారు. 2023 ఎన్నికలలో మరోసారి గెలిచారు. నిజానికి పోచారం బదులు ఆయన కుమారుడు 2023 ఎన్నికలలో పోటీచేయవచ్చని అనుకున్నారు. కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈయననే పోటీచేయాలని కోరారు .దాంతో పోటీచేయక తప్పలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయింది.
అయినా గత ఆరు నెలలుగా పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. పోచారం కదలికలపై కొంత అనుమానం ఉన్నప్పటికీ, ఈ వయసులో పార్టీ మారతారా అన్న భావన ఉండేది. బహుశా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చి ఉండాలి. అలాగే బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తుండాలి. ఈ క్రమంలోనే స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి నేతలను, క్యాడర్‌ను ఆకర్షించే యత్నాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది.
దీంతో రేవంత్, కాంగ్రెస్ నేతలు మరింత అప్రమత్తమై బీఆర్ఎస్ నుంచి వీలైనంతమందిని ఆకర్షించే పనిలో పడ్డారు. వీరు తొందరపడకపోతే బీజేపీ నాయకత్వం గాలం వేసి వారివైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచినా, లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకి సహకరించారన్న అభిప్రాయం వచ్చింది. బీజేపీ పక్షాన గెలిచింది కూడా ఒకప్పుడు టీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కావడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రేవంత్ చొరవ తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం చేయకపోతే కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న భయం ఉంటుంది. అందుకే టీడీపీ బాగ్రౌండ్ ఉన్న నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారనిపిస్తుంది. గతం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను ఆయన తనతో పాటు క్యారీ చేస్తున్నారు. ఉదాహరణకు వేం నరేంద్రరెడ్డి వంటివారు సలహాదారు పదవిలో కీలకంగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేత కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తెచ్చారు.
ఆయన కుమార్తెకు ఎంపీ పదవి కూడా వచ్చింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీని పటిష్టం చేయడం కోసం ఈయనను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చి ఉండాలి. పోచారం కాంగ్రెస్‌లో చేరడంతో ఇబ్బంది రాలేదు కాని, జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లోకి రావడం సీనియర్ నేత టి.జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. కనీసం తనకు చెప్పకుండా చేస్తారా అని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్దమయ్యారు.
అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఆయనను చల్లబరిచారు. ఇలాంటి సమస్యలు అక్కడక్కడా ఉన్నా, ఈ నాలుగేళ్లు ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి, బీజేపీకి అవకాశాలు తగ్గించి, బీఆర్ఎస్‌ను బలహీనపరచడానికి రేవంత్ ఇదే రూట్ లో వెళ్లవచ్చు. కాగా పోచారం తాను ఎందుకు పార్టీ మారింది చెప్పిన విషయాలు వింటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా ఉందని చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోందని, అందుకే కాంగ్రెస్‌లోకి వెళుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే మొదలైందని వెల్లడించారు. మరి కొందరు నేతలు కే.కేశవరావు, దానం నాగేందర్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జారుకున్నారు.
వరంగల్ ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకరరావు కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరిగినా, ఆయనైతే ఖండించారు. పోచారం పార్టీ మారుతున్న సమాచారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు. పోచారం పార్టీ మారడాన్ని వారు తప్పు పట్టారు. ఆయనకు ఏమి తక్కువ చేశామని పార్టీ ఫిరాయించారని ప్రశ్నించారు. నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఇలా ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల నుంచి నయానోభయానో తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అధికారం పోవడంతో ఇప్పుడు అదే పనిని ఇతర పార్టీలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎందరు వస్తే అందరిని, ప్రత్యేకించి ఎమ్మెల్యేలను లాగడానికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. పదిహేను నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని చెబుతున్నా, అవన్ని ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా బీజేపీ వారు కూడా వలపన్నుతున్నట్లుగా ఉంది.
ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఈడి దాడులు ఇందులో భాగమేనా అన్న సందేహం పలువురికి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ను బలహీనపర్చితే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోకూడదని ఏమీ లేదు. ఉదాహరణకు శాసనసభ ఎన్నికల ముందువరకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా సాధారణ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టింది. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బతీస్తున్నాయి. అందువల్లే కేసీఆర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలతో భేటీ అవుతూ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్తు ఉంటుందని వారికి నమ్మకం కలిగించే యత్నం చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం. ప్రజలలో కేసీఆర్ మళ్లీ పట్టు సాధిస్తారన్న విశ్వాసం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుంది. సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ ఏ మేరకు ఈ ఫిరాయింపు రాజకీయాలను తట్టుకుని నిలబడుతుందన్నదానికి కాలమే సమాధానం ఇస్తుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment