
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1967 నాటి ఎన్నికల సమయానికి శాసనసభలో తెలంగాణ ప్రాంతానికి 101 సీట్లు ఉండేవి. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉండడం, కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఐఎంగా చీలిపోవడం, ఇతరత్రా ఏ పార్టీ కూడా ప్రజాదరణ పొందలేకపోవడం వల్ల అప్పట్లో కాంగ్రెస్‌లో తిరుగుబాట్లు కూడా గణనీయంగా ఉండేవి. అందువల్ల ఈ ఎన్నికలలో 21 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ 69 స్థానాలను గెలుచుకుని పట్టు నిలుపుకుంది. ఇక సీపీఐ నాలుగు చోట్ల, సీపీఎం నాలుగు చోట్ల విజయం సాదించాయి. భారతీయ జనసంఘ్, సంయుక్త సోషలిస్టు పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 36 స్థానాలలో గెలిస్తే, ఎస్సీలు 17 చోట్ల గెలుపొందారు. బీసీ వర్గాలు 12 చోట్ల, వెలమ వర్గం 9 నియోజకవర్గాలలో గెలుపొందాయి.
వెలమలు...
వెలమ సామాజికవర్గం నుంచి ఈసారి కూడా తొమ్మిది మంది గెలిచారు. ప్రత్యేకించి కరీంనగర్ జిల్లా నుంచి ఐదుగురు గెలిచారు. జలగం వెంగళరావు, జేవీ నరసింగరావు, కేఎల్ నరసింహారావు, చొక్కారావు, చెన్నమనేని రాజేశ్వరరావు, టి.పురుషోత్తం రావు వంటి ప్రముఖులు ఉన్నారు. మహిళా నేత ఎన్.విమలాదేవి కూడా గెలుపొందారు.
ఏడుగురు బ్రాహ్మణులు
మొత్తం మీద 8 మంది బ్రాహ్మణులు గెలిస్తే.. అందులో ఏడుగురు కాంగ్రెస్ వారే. వీరిలో పీవీ నరసింహారావు, బొప్పరాజు లక్ష్మీకాంతరావు, అక్కిరాజు వాసుదేవరావు, చకిలం శ్రీనివాసరావు, వీబీ రాజు తదితరులు ఉన్నారు. టీఎస్ మూర్తి స్వతంత్రుడిగా (వరంగల్) నెగ్గారు.
బలపడిన ముస్లిం వర్గం
కాంగ్రెస్‌లో ముస్లింల ప్రభ క్రమేమీ తగ్గుతూ వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినపటినుంచీ హైదరాబాద్ పాతబస్తీపై కాంగ్రెస్ జెండా ఎగరేది. కానీ సలావుద్దీన్ ఒవైసీ రాజకీయంగా బలపడడం, ఆయన పార్టీ మజ్లిస్ ప్రభావం పెరిగింది. ముస్లిం ప్రముఖులలో ఎమ్మెమ్ హషీం, ఇబ్రహీం అలీ అన్సారీ, కమాలుద్దీన్ అహ్మద్, రజబ్ అలీ, సలావుద్దీన్ ఒవైసీ తదితరులు గెలిచారు.
బీసీల్లో వారిదే ఆధిక్యత..
బీసీ వర్గంలో మున్నూరు కాపు నేతలే ఎక్కువగా అసెంబ్లీకి వస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఈ వర్గం నుంచి ఐదుగురు గెలిచారు. ఆ తర్వాత గౌడ వర్గం నలుగురు, పద్మశాలి ఇద్దరు, ముదిరాజ్ ఒకరు గెలిచారు. మున్నూరు కాపుల్లో జి.రాజారామ్, సి.జగన్నాథరావు, ఎమ్మెన్ నర్సయ్య ఉన్నారు. పద్మశాలీల్లో కె. రామచంద్రరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌడల్లో ఇద్దరు íసీపీఐ నుంచి నెగ్గారు.
ఎస్సీల్లో..
ఎస్సీ నియోజకవర్గాలను కాంగ్రెస్ స్వీప్ చేసింది. మొత్తం పదిహేడు స్థానాల్లో 13 చోట్ల గెలిచింది. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రముఖ నేత జె. ఈశ్వరీబాయి గెలిచారు. కాంగ్రెస్ ప్రముఖుల్లో కోదాటి రాజమల్లు, సి.రాజనరసింహ, సుమిత్రాదేవి, అరిగే రామస్వామి, పి.మహేంద్రనాథ్‌లు ఉన్నారు.
ఇతర వర్గాలు,.
ఎస్టీల్లో నలుగురు కాంగ్రెస్ వారు. కమ్మ వర్గం నుంచి, వైశ్య వర్గం నుంచి గెలుపొందినవారంతా కూడా కాంగ్రెస్‌కు చెందినవారే. ఎస్టీలలో భీమ్‌రావు ప్రముఖుడు. కమ్మ వర్గంలో ఎమ్.శ్రీనివాసరావు, రెడ్లలో టి.చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. వైశ్యులలో బీవీ గురుమూర్తి ప్రముఖుడు. కాగా లింగాయత్ శివరావు షెట్కార్, మార్వాడీ వర్గానికి చెందిన బద్రి విశాల్ పిత్తీ కూడా ఈ ఎన్నికలో గెలిచారు.
కాంగ్రెస్ నుంచి 22 మంది రెడ్లు
తెలంగాణలో రెడ్ల ఆధిపత్యం కొనసాగింది. అధికార కాంగ్రెస్ నుంచి 22 మంది గెలుపొందితే, సీపీఎం నుంచి ఇద్దరు విజయం సాదించారు. ఇండిపెండెంట్లు 11 మంది నెగ్గారు. కమ్యూనిస్టు పార్టీ చీలిన నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే తిరుగుబాటు దారులు ఎక్కువ మంది ఇండిపెండెంట్లుగా పోటీచేసి, గెలిచి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. గెలిచిన వారిలో మర్రి చెన్నారెడ్డి, జి.సంజీవరెడ్డి, పి.నరసారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి ప్రభృతులు ఉన్నారు. ముగ్గురు మహిళలు కూడా ఈ వర్గం నుంచి గెలుపొందారు. వారిలో బి.సరోజిని పుల్లారెడ్డి, జె.కుముదిని దేవి, రెడ్డిగారి రత్నమ్మ ఉన్నారు. సీపీఎం నుంచి గెలిచిన ప్రముఖులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. జనసంఘ్ తరపున సి.జంగారెడ్డి, ఇండిపెండెంట్లలో సోంభూపాల్ గెలిచారు.
- సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment