ఇక కమలమే లక్ష్యం!  | TRS decision to counteract BJP criticism | Sakshi
Sakshi News home page

ఇక కమలమే లక్ష్యం! 

Published Thu, Aug 22 2019 2:57 AM | Last Updated on Thu, Aug 22 2019 4:44 AM

TRS decision to counteract BJP criticism - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుండటంతో, ఇకపై కమలం పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బలహీన పరిచే వ్యూహాన్ని అమలుచేసిన టీఆర్‌ఎస్, ప్రస్తు తం కమలదళం దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా వ్యూహం సిద్ధం చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పారీ్టల నుంచి బీజేపీలో చేరుతున్న నేతలపై ఓ కన్నేయడంతో పాటు, టీఆర్‌ఎస్‌ నుం చి బీజేపీలో చేరే అవకాశమున్న నేతల కదలికలను ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

2023లో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా తమ పార్టీ కార్యకలాపాలు ఉంటాయని చెప్తున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. గత నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా, మూడు రోజుల క్రితం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పార్టీ తెలంగాణ టీడీపీ నేతల చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి నెలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లో ఎవరో ఒకరు తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేతలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. 

బీజేపీ వ్యూహాలకు విరుగుడు.. 
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి కేంద్రీకరించింది. బీజేపీ నేతల విమర్శలు, ప్రకటనలను ఖండిస్తూ నే, బీజేపీ విస్తరణను అడ్డుకునే దిశగా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలో చేరికలతో టీటీడీపీ క్లీన్‌స్వీప్‌ కాగా.. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్‌ ఉన్న కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసేందుకు ఆపార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతలు ఎవరనే కోణం లో టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి వలస వెళ్లే నేతలను అడ్డుకుని, వారిని టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్రోత్సహించే వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

బీజేపీ చేసే ఆరోపణలు, విమర్శలను అడ్డుకోవడం, తిప్పికొట్టడంతో పాటు, పార్టీ పరంగా బలమైన వాదన వినిపించాలనే భావన నెలకొంది. ఈ విషయంలో పార్టీ నాయకు ల తీరుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదుపై ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కేటీఆర్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీపై ఎదురుదాడికి తానే స్వయంగా ముందు వరుసలో నిలవాలని కేటీఆర్‌ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

సొంత పార్టీ నేతలపైనా కన్ను 
పార్లమెంటు ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వంటి ఒకరిద్దరు నేతలు బీజేపీలో చేరగా.. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు, గులాబీ పార్టీ ముఖ్య నేతలు కూడా తమవైపు వస్తారని బీజేపీ చెప్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న రాజ్య సభ సభ్యుడు త్వరలో బీజేపీలో చేరే అవకాశముంది. ‘స్థాయిలేని నేతలు బీజేపీలో చేరుతున్నారని’ ప్రకటిస్తున్న టీఆర్‌ఎస్, లోలోన మాత్రం పార్టీని వీడే అవకాశమున్న నేతల కదలిక లపై ఓ కన్నేసింది. ఒకే నియోజకవర్గంలో విభిన్న రాజకీయ నేపథ్యానికి చెం దిన నాయకులు ఉండటంతో.. చాలా చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి.

బీజేపీ దూకుడు నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఉన్న ముఖ్య నేతలు, అసంతృప్తవాదులను గుర్తించడంపై దృష్టి సారించింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత వీరిలో కీలకమైనవారికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టడం ద్వారా వలసలను అదుపుచేయాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 జిల్లాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను పార్టీలో చేర్చుకున్న టీఆర్‌ఎస్‌.. అదే వ్యూహాన్ని అనుసరించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ, అనుబంధ సంఘాలు, వ్యక్తులు చేసే టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. సోషల్‌ మీడియా కమిటీల ఏర్పాటు, శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement