శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే. తన పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చేశారనా? ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోంది?’ అన్నది వారి సంశయం అనుకోవాలి. ఆర్థికంగా ఎన్ని అవరోధాలున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ మూడేళ్లుగా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి నచ్చడం లేదు. వైసీపీ పాలనలో ఏపీ శ్రీలంకలా మారితే బాగుండు, వైసీపీని కాదని మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవడానికి ఇది ఉపయోగపడితే బాగుండు అని టీడీపీ కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది.
‘ఆర్థిక అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారబోతోంది, దివాళా తీయబోతోంది’... ఇదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఆయనకు పవన్ కల్యాణ్ వంత పాడుతారు. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నేత ఏదైనా వ్యాఖ్య చేస్తే అది సీరియస్‌గా ఉండాలి. దురదృష్టవశాత్తు ఆయన అలా చేయడం లేదు. గమ్మత్తు ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఏ స్కీమ్‌నూ వ్యతిరేకించే ధైర్యం చంద్ర బాబు చేయలేరు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాటన్నిటిని రద్దు చేస్తానని చెప్పి, తాను తేబోయే వాటి గురించి చెప్పలేరు. ఇలా డబుల్ గేమ్ ఆడటమే ఆయన బలంగా భావించేవారు ఉండవచ్చు. అది అన్నిసార్లూ కుదరదని 2019 శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. ఏ సంక్షేమ స్కీమ్‌లోనైనా ఏదైనా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే వెంటనే పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తారు. పోనీ ఆ స్కీమ్ కింద ఎలాగోలా డబ్బులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం తలపెడితే అందుకు ఆయా వ్యవస్థల ద్వారా అడ్డుపడుతుంటారు.
జగన్ తాను మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమ్మ ఒడి, చేయూత, పేదలకు ఇళ్ల స్థలాలు, చేనేత నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆటో డ్రైవర్లకూ, క్షురకులకూ ఇలా వివిధ వర్గాలవారికి ఆర్థిక సాయం ప్రకటించే పథకాలను అమలు చేస్తున్నారు. అవన్నీ వృథా అని చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ గానీ భావిస్తే ఆ మాట చెప్పాలి కదా? స్కూళ్లను బాగు చేయడానికి నాడు–నేడు అమలు చేయడం ఖర్చు దండగ అని టీడీపీ అనుకుంటే ఆ సంగతి వివరిం చాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల అదనపు ఖర్చు అని భావిస్తే ఆ సంగతి చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే వాటిని తీసివేస్తామని సవాల్ చేయాలి. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్ వంటివి అనవసరం అనుకుంటే ధైర్యంగా ఆ విషయం తెలపాలి. అలా చేయకపోగా, తమ పాలన వస్తే వలంటీ ర్లుగా టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తుంటారు. తాను చేయలేకపోయిన జిల్లాల విభజన జగన్ చేస్తే తప్పు పడతారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమనీ, తాము అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దుతామనీ అంటారు. అంత నమ్మకం ఉంటే కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు? ఆయన దానిని మంజూరు చేశారే. తాను అధికారంలోకి వచ్చేవరకు ఆగి ఉండవచ్చు కదా? అంటే అధికారం లోకి వస్తామన్న నమ్మకం ఆయనకే లేదన్నమాట.
ప్రభుత్వం చెత్త పన్ను వేసిందని చెత్త ప్రచారం జరిగింది. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ సంస్కరణలలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం కోసం చెత్త కోసం ప్రత్యేక రుసుము వసూలు చేయాలని చెప్పింది. దానిని చంద్రబాబు హయాంలోనే జీవోగా ఇచ్చారు. ఆ సంగతి మరుగుపరచి ప్రస్తుత ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం చేస్తారు. అసలు ఆస్పత్రులలో గానీ, ఇతరత్రా యూజర్ చార్జీలను ప్రవేశపెట్టిందే చంద్ర బాబు. అప్పట్లో తానే దేశంలోకల్లా సంస్కర ణల ఛాంపియన్ అని ప్రచారం చేసుకునేవారు. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ను ఉచితంగా ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవలసిందే నని చెప్పేవారు. చివరికి వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ ఇస్తున్నా, మీటర్లు పెడతారా అంటూ హూంక రిస్తారు. కేంద్రాన్ని మాత్రం ఏమీ అనరు.
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 23 శాతం కాదు, 29 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ సమయంలో మాత్రం ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగిందని అంటారు. వెంటనే టీడీపీ మీడియా ఏవేవో లెక్కలు తీసి, ‘అవును, ఆదాయం పెరిగిం’దని ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం అప్పులు చేయగానే అమ్మో, ఆర్థిక వ్యవస్థ అంతటినీ నాశనం చేస్తున్నారంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు చేయకుండా ఉందా? కేంద్రమే ఏటా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నదో తెలియనిదా? పోనీ చంద్రబాబు టైమ్‌లో అప్పులు తీసుకురాకుండా ఉన్నారా? సెస్‌లు వేయలేదా? వాటిని ఆయన చేస్తే అదంతా అభి వృద్ధి కోసం చేసినట్లు జనం భావించాలి. ఎదుటి వారు చేస్తే అంతా నాశనం అని ప్రచారం చేయాలి.
ఏపీని శ్రీలంకతో పోల్చే ఈ పెద్ద మనిషి 2014 ఎన్నికల సమ యంలో రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నిటినీ సుమారు లక్ష కోట్లకు పైగా ఎలా మాఫీ చేస్తానని చెప్పారు? లక్షల కోట్లతో అమరావతిని నిర్మించడానికి ఎందుకు పూనుకున్నారు? సాధ్యా సాధ్యాలతో నిమిత్తం లేకుండా వందల హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయలేక ఎందుకు చతికిల పడ్డారు? దానిని కదా శ్రీలంక తోనో, మరే దేశంతోనో పోల్చుకోవలసింది! శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే కదా? మరి జగన్ ఏమి చేశారు! తాను చెప్పినవి చెప్పినట్లు చేస్తూ పేద ప్రజలకు ఊతం ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్లను ఇళ్లకు తీసుకువెళ్లి ఇచ్చే వ్యవస్థను తెచ్చారు. దానిని తీసి వేస్తామని చంద్రబాబు చెప్పగలరా?
కరోనా కాలంలో జగన్ స్కీములు పేదలకు ఎంతగానో మేలు చేయడం వల్లే ఏపీ ప్రజలు సంక్షోభంలో పడలేదన్న సంగతి అర్థం అవుతూనే ఉంది. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ ఇచ్చింది. ఆ కోటాకు అదనంగా ఏపీ ప్రభుత్వం కూడా బియ్యం అందజేసింది. ఆ విషయాలను విస్మరించ గలమా? ప్రజల చేతిలో నగదు చలామణి అవ్వాలని నిపుణులు సూచించేవారు. అప్పటికే జగన్ దానిని అమలు చేశారు. దానికి తగినట్లు సుస్థిరాభివృద్ధి, జీఎస్టీ వంటి వాటిలో దేశం లోనే ఏపీ అగ్రభాగాన ఉంది. చంద్రబాబు పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చే శారని అనుకోవాలా? విద్యుత్ డిస్కమ్‌లకు వేల కోట్ల బకాయిలు పెట్టి అధికారం నుంచి దిగిపోయారు. టీడీపీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, అధికారం కోల్పోయాక జగన్ ప్రభుత్వానికి అప్పు ఎవడు ఇస్తాడని చంద్రబాబు, యనమల అన్నా... జగన్ విజయవంతంగా మూడేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి సుతరామూ నచ్చడం లేదు. ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోం’దన్నది వారి సంశయమనుకోవాలి.
నిజానికి ఒక దేశం దెబ్బతినడానికి ఆ దేశ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణం అవుతాయి. శ్రీలంకలో పేదలకు సంక్షేమ ప«థకాలు అమలు చేయడం వల్ల సంక్షోభం రాలేదు. కరోనా మహ మ్మారి, బాంబు పేలుళ్లు వంటివి వారి ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంను దెబ్బతీశాయి. వాటికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరిన్ని ఇబ్బందులలోకి నెట్టింది. చైనా నుంచి అప్పులు తెచ్చి మౌలిక వసతుల భారీ ప్రాజెక్టులు చేపట్టడం స్థోమతుకు మించినవి కావడంతో రుణాలు తీర్చలేకపోతున్నారు. ఇలాంటి కార ణాలు అనేకం ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ పైనే ఆరోపణలు చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుకుంటోంది.
మన దేశంలో అప్పులు ఎంత మేర చేయాలో అన్నదానికి నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఇష్టారాజ్యంగా అప్పులు చేయాలని ఎవరూ సలహా ఇవ్వరు. ప్రభుత్వం తన ప్రాధాన్యత ప్రకారం అప్పులు చేసినా వాటిని సకాలంలో తీర్చే స్థితికి వెళ్లాలి. ప్రభుత్వానికి ఆయా సేవలు అందించినవారికీ, చిన్న చిన్న కాంట్రా క్టర్‌లకూ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు తీర్చివేయాలి. పథకాల అమలుతో పాటు ఇలాంటివి కూడా ముఖ్యమే. తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక సూచనలు చేయకపోయినా ఫర్వాలేదు గానీ సంక్షో భంలో కూరుకుపోయిన శ్రీలంకతో పోల్చి ఏపీ ప్రజలను అవమా నించవద్దని చంద్రబాబును కోరుకుందాం.
కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment