![Kommineni Srinivasa Rao Article On AP CM YS Jagan Delhi Tour - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/06/16/YS-Jagan-Amit-Shah.jpg.webp?itok=FCFhPmqn)
అయ్యగారు అరసోలెడు ఆముదాలను అమాంతం లేపాడని వెనుకటికి ఎవరో గొప్పలు చెప్పారట. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం మీడియా వైఖరి ఇలాగే ఉంటుంది. ఆయన ఏది చేసినా గొప్పే. ఏం మాట్లాడినా ఘనతే. ఆయన ఢిల్లీ వెళ్తే కేంద్రప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహించి వచ్చాడన్నట్టుగా కథనాలు రాస్తారు. అయినవాడికి ఆకుల్లో వడ్డించుకున్నారు సరే, మరి జగన్ విషయంలో ఎందుకు కాని కథనాలు వండుతారు? రాష్ట్రం కోసం చేసిన ఢిల్లీ పర్యటనను కేవలం వ్యక్తిగతమైనదిగా ఎందుకు కుదిస్తారు? వాళ్లు వార్చే కథనాల్లో కట్టుకథలు ఎన్నో జనానికి కచ్చితంగా తెలుసు. మాటల ఉరవడిలో కొట్టుకుపోతుందేమోగానీ అరసోలెడు ఆముదాల బరువెంతో కూడా జనానికి తెలుసు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సఫలం అయిందా, లేదా? అన్న చర్చ ఎలా ఉన్నా, ఆయన రెండు రోజులలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై విజ్ఞప్తులు అందచేసిన తీరును గమనించాలి. ఆయన చేసిన పని ఒక చిత్తశుద్ధితో చేసినట్లు కనిపిస్తుంది. ప్రచారపటాటోపం లేకుండా, ప్రతి చోటా మీడియా హడావుడి లేకుండా ఆయన తన పర్యటన పూర్తి చేశారు. వీటన్నింటిలోకి కీలకమైనది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు గంటన్నర సేపు భేటీ కావడం. అలాగే పోలవరం అంశంపై జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మాట్లాడటం. మిగిలి నవి ప్రాధాన్యత లేవని కాదు. ఉదాహరణకు ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ గురించి చర్చించి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోరారు. సహజంగానే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అదే సమయంలో జగన్ ప్రత్యేక హోదా గురించి అడగటాన్ని
మర్చిపోలేదు.
మనవాడైతే బిజీబిజీ
గతంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లేవారు. కానీ ఎంత హడావుడి, ఎంత ప్రచారం! అది గుర్తు చేసుకుని, ఇప్పటి జగన్ పర్యటనను పోల్చుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో ఒక వర్గం మీడియా చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా బిజి బిజీ అన్న హెడ్డింగ్ పెట్టకపోతే ఆశ్చర్యపడాల్సి వచ్చేది. ఆయన లోపల ఏమి మాట్లాడినా, మొత్తం రాష్ట్రం గురించే మాట్లాడినట్లు, అసలు కేంద్రానికి ఈయనే మార్గదర్శకత్వం వహిస్తున్నంతగా బిల్డప్ ఉండేది. మళ్లీ అదే మీడియా భారతీయ జనతా పార్టీతో చంద్రబాబుకు చెడిన తర్వాత ఏమిరాసిందో గుర్తుకు తెచ్చుకోండి. రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నా కేంద్రం సహకరించడం లేదనీ, చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ పర్యటించారనీ, ఏడాదిన్నర పాటు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనీ... ఇలా రకరకాలుగా కథనాలు ఇచ్చేవారు. మరి అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాధించిందేమిటా అన్న సందేహం ఎవరికైనా వచ్చేది.
వండుతున్న కథనాలు
నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా, అది చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు జగన్ కావచ్చు... ఎవరైనా వారు తమ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి, వీలైతే ప్రధాని పరిశీలనకు తీసుకువెళతారు. అంతమాత్రాన అవన్నీ జరిగిపోతాయని కాదు. అలాగని జరగవని కూడా కాదు. కానీ చంద్రబాబు మాత్రం క్రెడిట్ ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకునేవారు. మీడియా కూడా ఆయనకు పల్లకీ మోసేది. మరి అదే జగన్ ఢిల్లీ వెళ్తే ఏం ప్రచారం చేస్తున్నారు? ఒకసారి ఏదో కారణం వల్ల అమిత్ షా అపాయింట్‌మెంట్ రద్దయితే చాలు... ఇక తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియాకు పండగే. ఇంకేముంది, జగన్ పట్ల అమిత్‌షాకు అసంతృప్తి ఉందనీ, అసమ్మతి ఎంపీ విషయంలో ఆయన జగన్‌తో మాట్లాడటానికి సిద్ధంగా లేరనీ... ఇలా ఒకటేమిటి? చిలువలు పలువలుగా వండి వార్తలు ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత మూడు రోజులకు అమిత్ షాతో సహా నలుగురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అపాయింట్‌మెంట్లు ఖరారవడం, వారితో భేటీలు జరగడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ వర్గం మీడియా ఏమి ప్రచారం చేస్తోంది?
అజీర్తి కలిగించిన విందు
జగన్ తన సీబీఐ కేసుల గురించి షా వద్ద ప్రస్తావించడానికి వెళ్లారనీ, అలాగే అసమ్మతి ఎంపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించే యత్నం చేశారనీ... ఇలా అదేదో వ్యక్తిగత పర్యటనలాగా ఫోకస్ చేసేందుకు ఆ మీడియా యత్నించింది. ఇది మొదటిసారి కాదు. జగన్ ఢిల్లీ పర్యటన వార్తలు వచ్చినప్పుడల్లా ఇదే తంతు. అయినా ఇదంతా మీడియా స్వేచ్ఛగా వారు భావించవచ్చు. ఊహాగానాలు చేయడమే మీడియా పని కాదు. అమిత్ షా రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా గంటన్నర పాటు జగన్‌కు సమయం కేటాయించి వివిధ అంశాల గురించి చర్చించారంటే ఆయన ఎంత గౌరవం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు. జగన్‌తో అమిత్ షా విందు సమావేశం నిర్వహించారన్న సమాచారం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం అజీర్తినే మిగిల్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు అమిత్ షా ముఖ్యమంత్రి జగన్‌ను కలవరనుకుంటే ఏకంగా భోజనమే పెట్టి పంపించారు. ప్రతిపక్ష టీడీపీకి, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు కూడా ఇది మింగుడుపడని సంగతే. విశ్వసనీయ వ్యక్తికి దూరం కారు ప్రధాని మోదీని కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కానీ జగన్ కలిసిన వెంటనే టీడీపీ, ఆ వర్గం మీడియా కేసుల కోసమే కలిశారని ఏళ్ల తరబడి ప్రచారం చేస్తూనే ఉన్నాయి. తద్వారా వారు ఏమి సంకేతం పంపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలా అని కేసులు ఏమైనా లేకుండా పోయాయా అంటే అదేమీ జరగలేదు. దీన్ని బట్టి టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం కలగదా? ఇద్దరు ముఖ్యనేతలు భేటీ అయినప్పుడు అభివృద్ధి అంశాలతో పాటు కొన్ని రాజకీయ విషయాలు కూడా చర్చకు రావచ్చు. అయితే ఆ విషయాలు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాలి. తమకు తోచిన కథనాలను మీడియా రాస్తే ఎవరు ఏమి చేయగలరు?
ఇక పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా, ఇతర అంశాలకు సంబంధించి మంత్రి గజేంద్ర షెకావత్ కూడా కొంత స్పందించినట్లే కనబడుతోంది. జగన్‌తో భేటీ అయిన తర్వాత ఆయన అధికారిక సమావేశానికి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా జరగడం కొంత ఆశాజనకమైన పరిణామమే. వర్తమాన జాతీయ రాజకీయాలను గమనంలోకి తీసుకున్నా, ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వంటి విశ్వసనీయ వ్యక్తిని, మాట మీద నిలబడే వ్యక్తిని దూరం చేసుకుంటుందని అనుకోలేం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ కొంతమేర తగ్గుతున్న తరుణంలో జగన్ వంటివారిని శత్రువులుగా మార్చుకోవడానికి ఏ తెలివైన నేతా సిద్ధపడరు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంత మేర సాయం చేస్తారన్నది వేరే అంశం. కానీ జగన్‌పై శత్రుత్వంతో ఉంటారని అనుకోలేం అనడానికి ఈ ఢిల్లీ పర్యటనను మించిన ఉదాహరణ ఉండకపోవచ్చు. పార్లమెంటులో వైసీపీ ఇబ్బంది లేని అంశాలపై ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. విద్యుత్ సంస్కరణలను ఏపీలో ఇప్పటికే అమలు చేస్తున్న సంగతిని గుర్తు చేసుకోవాలి.
సున్నితం అయినా దృఢం
ఇదే సమయంలో బీజేపీ అన్ని రకాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం లేదన్నది కూడా వాస్తవం. పార్టీని బద్నాం చేస్తున్న ఒక ఎంపీని అనర్హుడిని చేయాలని వైసీపీ పార్లమెంటరీ పక్షం కోరినా లోక్‌సభ స్పీకర్ ఇంతవరకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. అది వైసీపీకి అసంతృప్తి కలిగించే అంశమే. అలాగే ఆ ఎంపీ చేస్తున్న అసత్య ప్రచారం గురించి కూడా ప్రస్తావన వచ్చి ఉంటే ఉండవచ్చు. లేదా జగన్ దాని గురించి మాట్లాడకపోయినా ఆశ్చర్యం లేదు. జగన్ కేంద్రంతో సంబంధాలను సున్నితంగా కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఏదైనా ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు తన అభిప్రాయం చెప్పడానికి వెనుకాడటం లేదు. ఉదాహరణకు వ్యాక్సినేషన్‌ను కేంద్రమే చేపట్టాలనీ, ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయాలనీ కోరిన మొదటి ముఖ్యమంత్రి జగనే అన్న సంగతి తెలిసిందే. వీటన్నింటిని గమనిస్తే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన అత్యంత గౌరవప్రదంగా సాగిందని చెప్పవచ్చు.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment