తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఎనిమిదేళ్లు పూర్తయింది. కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి పోటాపోటీ పరిస్థితి కొంత ఎదురవుతోంది. అయితే టీఆర్‌ఎస్‌కు తాము ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్, బీజేపీ రుజువు చేసుకోవలసి ఉంది. ఇటీవలి కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీఆర్‌ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది అప్పుడే చెప్పలేం. కానీ కేసీఆర్‌ను జాతీయస్థాయి నేతగా చూపడానికి టీఆర్‌ఎస్ గట్టిగా యత్నిస్తోంది.
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఇదే వ్యూహం అవలంబించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై దాదాపు ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్నారు. దేశ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి కాస్త చీకాకు తెప్పిస్తున్నాయి. తొలుత మోదీతో కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. నోట్ల రద్దు లాంటి అంశాలలో మద్దతిచ్చారు. కారణం ఏమైనా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న భావన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏర్పడింది. ప్రస్తుతం మోదీతో సంబంధాలు ఎంత చెడ్డాయంటే ఒకరినొకరు ముఖం చూసుకోనంతగా అని చెప్పాలి.
మోదీ శంషాబాద్ వద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణకు వస్తే, కేసీఆర్ అక్కడకు వెళ్లలేదు. బిజినెస్ స్కూల్‌లో కాన్వకేషన్‌కు మోదీ హాజరైతే, ఆయనకు స్వాగతం పలకకుండా గైర్‌హాజరై, అదే రోజు కేసీఆర్ బెంగళూరు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వరకూ కేసీఆర్ వర్సెస్ మోదీ అన్న పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. తెలంగా ణలో బీజేపీ ముఖాలుగా ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ, ఎన్నికల సమ యంలో మోదీకి ఉన్న పలుకుబడినే బీజేపీ వాడుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏం సాధించారన్నది విశ్లేషించుకుంటే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సుమారు లక్ష కోట్ల వ్యయంతో అతి భారీ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం. నిజానికి గోదావరి నది తెలంగాణ భూమట్టం కన్నా చాలా దిగువన ఉంటుంది. ఎత్తిపోతల ద్వారానే సాగునీటిని మళ్లించే అవకాశం ఉంది. ఇది వ్యయప్రయాసలతో కూడిన విషయమని తెలిసినా, సాహసంతో చేపట్టారు. కాకపోతే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుపై పలు విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టుపై పెట్టిన వ్యయానికీ, దానివల్ల వస్తున్న ప్రయోజనానికీ మధ్య చాలా తేడా ఉందన్నది కాంగ్రెస్, బీజేపీ వాదన. అలాగే అవినీతి ఆరోప ణలూ చేస్తున్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చేయడం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం. అయితే దీనిపై కూడా విమర్శలు లేకపోలేదు. విద్యుత్‌ను అధిక వ్యయంతో కొంటున్నందున వినియోగదారులపై ఎక్కువ భారం పడుతోందన్నది ప్రధానమైన విమర్శ. కేసీఆర్ ఆరంభించిన మరో స్కీమ్... రైతుబంధు. చిన్నా, పెద్ద, ధనిక, పేద రైతులన్న తేడా లేకుండా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నారు.
2018 ఎన్నికలలో టీఆర్‌ఎస్ విజయానికి ఇది బాగా ఉపయోగపడింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని ఆయన ప్రభుత్వం కాపాడుకోగలిగింది. మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు కె.తారక రామారావుకు ఈ విషయంలో మార్కులు వస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిందన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. అలా అని హైదరాబాద్‌లో సమస్యలు లేవని కాదు. ‘దిశ’ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.
దళితబంధు స్కీమును కేసీఆర్ ప్రకటించడం ఒక సంచలనం అని చెప్పాలి. ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమై, కొందరికి అమలు కూడా చేశారు. దీనివల్ల పార్టీకి కొంత నష్టం కూడా జరిగింది. కేవలం ఎస్సీ వర్గాలకే ఈ స్కీము ఇస్తుండటంతో బీసీ, తదితర వర్గాలలో అసంతృప్తి ఏర్పడి హుజూరా బాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమికి ఒక కారణం అయింది.
రాజకీయ విషయాలు చూస్తే కేసీఆర్ తొలి పదవీ కాలం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు ద్వారా ఫిక్స్ చేశారు. రాజీ ఫార్ములాలో భాగంగా చంద్రబాబు హైదరాబాద్ వదలి పోయేలా చేయడంలో సఫలమయ్యారు. తెలంగా ణలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు. ఇది అనైతికమే అయినా, వర్తమాన రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనం చేయడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గానీ, రాష్ట్రాలలో ఉన్న పార్టీలు గానీ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి.
ఈ మాత్రానికే ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనం అవుతాయని చెప్పలేం. కాకపోతే దాని ప్రభావం కొంత పడవచ్చు. తొలి టరమ్‌లో ఏ ఎన్నిక అయినా తిరుగులేని విజయం సాధిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా కేసీఆర్ ఎదురుదెబ్బ తిన్నారు. స్వయంగా ఆయన కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందారు. అలాగే మరో ముఖ్యనేత వినోద్ కుమార్ కూడా పరాజయం పొందారు. అనూహ్యంగా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలపడే పరిస్థితి ఉందనుకున్న సమయంలో ఆయన బీజేపీ పెరగడానికి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉన్నా, ప్రస్తుతం టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య విమర్శలు హద్దులు దాటాయనే చెప్పాలి.
కాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడం, సామాజిక సమీకరణలలో మార్పునకు కాంగ్రెస్ యత్నించడం వంటి పరిణామాలు ఉన్నా, ఇప్పటికైతే కేసీఆర్ పెద్దగా ఇబ్బంది పడక పోవచ్చు. కాగా ప్రభుత్వపరంగా అప్పుల సమస్య కేసీఆర్‌ను వెంటాడుతోంది. గత రెండు నెలలుగా బాండ్లు విక్రయించి రుణాలు తీసుకుందామని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆర్బీఐ గండి కొట్టి, ఎట్టకేలకు నాలుగు వేల కోట్లకు ఓకే చేసింది. కేంద్రంపై ఎంత పోరాడుతున్నట్లు కనిపించినా, ప్రజలలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే.
రైతుల ధాన్యం కొనుగోలు అంశం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దానిని కేంద్రంపైకి నెట్టడంలో కొంత సఫలీకృతమైనా, ప్రాథమికంగా టీఆర్‌ఎస్‌పై కూడా కొంత బాధ్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం వివిధ సామాజిక వర్గాలలో టీఆర్‌ఎస్ పట్టు ఉంది. దానిని అలాగే కొనసాగించగలిగితే కేసీఆర్‌కు తిరుగుండదు. కానీ ఆ విషయంలో మార్పు తేవడానికి ప్రతిపక్షాలు గట్టిగా యత్నిస్తు న్నాయి. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలు బలహీనపడటం లాంటి విషయాలు ఎలా ఉన్నా, తెలంగాణవాదం గణనీయంగా తగ్గి ఇతర రాజకీయ, సామాజిక, ఆర్థికాంశాల ప్రాతిపదికగా రాజకీయం మారడం కూడా ఒకరకంగా మంచిదే.
కానీ దీనివల్ల కూడా విపరి ణామాలు ఉంటాయని మంత్రి మల్లారెడ్డికి ఎదురైన చేదు అనుభవం చెబుతోంది. కేసీఆర్ తెలివిగా రెడ్డి వర్గాన్ని కూడా తనతో కలుపుకొని వెళ్లే యత్నం చేస్తున్నారు. అలాగే బీసీలనూ, దళితులనూ తనతోనే ఉండేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతూనే, కేసీఆర్‌ను జాతీయస్థాయి నేతగా ప్రొజెక్టు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలే అతి పెద్ద రాజకీయ పరిణామంగా చూడాలి.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment