‘భూ’కాయింపు! శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు | CM Chandrababu Lies On YS Jagan Govt In The Name Of Swetha Patram | Sakshi
Sakshi News home page

‘భూ’కాయింపు! శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు

Published Tue, Jul 16 2024 4:30 AM | Last Updated on Tue, Jul 16 2024 4:32 AM

CM Chandrababu Lies On YS Jagan Govt In The Name Of Swetha Patram

జగన్‌ సంస్కరణలకు శ్రీకారం చుడితే.. స్కామ్‌లకు బాబే ఆద్యుడు

భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం

పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతోపాటు అసైన్డ్, చుక్కలు, ఈనాం, అనాధీనం, లంక భూముల సాగుదారులకు లబ్ధి

ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తోందా? 

అసలు దోపిడీ అంటే.. అమరావతి కుంభకోణం.. విశాఖలో భూముల కబ్జా కాదా బాబూ?

మైనింగ్‌ ఆదాయం బాబు హయాంలో ఏటా రూ.2 వేల కోట్లే.. జగన్‌ వచ్చాక ఏటా రూ.4 వేల కోట్లు

ఐదేళ్లలో మైనింగ్‌ ఆదాయం రూ.10 వేల కోట్లు పెరిగితే.. రూ.19 వేల కోట్ల దోపిడీ అంటూ అర్థరహిత ఆరోపణలు 

ఇసుకతో పారదర్శకంగా రూ.4 వేల కోట్ల రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్లా?... 

మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్నేమంటారు?

సాక్షి, అమరావతి: ప్రజలకు మోసపూ­రిత హామీలిచ్చి వాటిని అమలు చేయలేక కాలయా­పన చేస్తున్న సీఎం చంద్రబాబు దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో అభూత కల్పనలు, అడ్డగోలుగా వక్రీకరణలకు దిగారు. పేదలకు మంచి జరిగేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను దోపిడీగా చిత్రీకరి­స్తూ తన కడుపుమంటను మరో­సారి బయట పెట్టుకున్నారు. ఖజా­నాకు రాబడి పెంచిన ప్రభు­త్వాన్ని నిందిస్తూ.. ఆదాయా­నికి తూట్లు పొడుస్తున్న తన సర్కారు గురించి జబ్బలు చరుచుకోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మ­యం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచమే విస్తుపో­యేలా నాడు అమరావతి, విశాఖలో తన హయాంలో జరిగిన భూ కుంభకోణాలను నిస్సిగ్గుగా కప్పిపు­చ్చుతూ బురద చల్లేందుకు సీఎం చంద్రబాబు యత్నించారు. అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా దళితులు, పేదల జీవితకాల కోరికను నెరవేర్చడాన్ని తప్పుబట్టి ఆయా వర్గాలను దారుణంగా అవమానించారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయ­కులు, కార్యక­ర్తలు వేల కోట్లు దోచుకోగా, వైఎస్సార్‌­­సీపీ హయాంలో ఒక క్రమ­పద్ధతి ప్రకారం జరిగిన విక్ర­యాలను తప్పుబడుతు­న్నారు. 

ధరల బోర్డు ఏర్పాటు చేసి మరీ ఇసుకను విక్రయిస్తూ పైకి మాత్రం ఉచితమంటూ బుకాయిస్తు­న్నారు. పారద­ర్శకంగా ఇసుక అందచేసి ఏటా రూ.750 కోట్లకు­పైగా ఆదా­యాన్ని, ఐదేళ్లలో రూ.4 వేల కోట్ల రాబడిని గత ప్రభుత్వం ఖజానాకు జమ చేయడం అక్రమమా? ప్రభుత్వా­నికి రూపాయి రాబడి లేకుండా చేసి ఉచిత ఇసుక పేరుతో పచ్చ­ముఠాల జేబులు నింపడం ఓ గొప్ప పథకమా? భూము­ల సమగ్ర రీ సర్వే (జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష చట్టం) ద్వారా అమ్మేవారికి, కొనేవారికి పూర్తి భరోసా లభిస్తుంది. 

వివాదరహితంగా భూములపై హక్కులు కల్పించడంతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆంగ్లేయుల తరువాత భూము­ల సమగ్ర సర్వే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ హయాంలో చేపట్టింది. రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా సర్వే చేయడంతోపాటు సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగానే పాతేలా చర్యలు తీసుకుంది. 

15,000 మంది సర్వే­యర్లను నియమించింది. చంద్రబాబు ఆరోపిస్తున్న­ట్లుగా కబ్జాలే నిజమైతే తమ భూములు లాక్కున్నా­రని ఏ ఒక్క రైతైనా ఫిర్యాదు చేశారా? గత సర్కారు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా అరికడితే దాని­పైనా అడ్డగోలు వాదనకు దిగారు. సహజ వనరు­లను దోపిడీ చేశారని, భూములను దోచుకున్నారని కళ్లార్పకుండా బుకాయించారు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌ తెచ్చినవి సంస్కరణలైతే చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నవన్నీ స్కామ్‌లే!!

పేదలకు భూమి పంచడం నేరమా?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు భూమిని పంచడాన్ని అక్రమంగా చంద్రబాబు అభివర్ణించా­రు. 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతు­లకు పంపిణీ చేయడాన్ని తçప్పుబడుతూ అందులో 8 వేల ఎకరాలను వైఎస్సార్‌సీపీ వారికి పంచారంటూ గగ్గోలు పెట్టారు. నిరుపేదలైన వారికి భూములు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ అందులో రూ.1,300 కోట్ల అవినీతి జరిగిందని పేదలపై తనకున్న ద్వేషాన్ని చంద్రబాబు చాటుకున్నారు. చంద్రబాబు తన హయాంలో భూ పంపిణీయే చేయ­లేదు. ఏనాడూ పేదల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. 

అసైన్డ్‌ భూములపై అడ్డగోలు వాదన
అసైన్డ్‌ భూముల రైతులకు చారిత్రక రీతిలో వైఎస్సార్‌సీపీ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతు­న్నారు. వారి భూములపై వారికి హక్కులు కల్పించడం తప్పన్నట్లు చిత్రీకరించారు. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక అసైన్డ్‌ రైతులు అవస్థలు పడ్డా పట్టించుకోని చంద్రబాబు, వారికి హక్కులు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ భూములను కొట్టేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. 

అసైన్డ్‌ రైతులకు వారి భూములపై సంపూర్ణ అధికారాలు దక్కడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని దీన్నిబట్టి స్పష్ట­మవుతోంది. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంతమంది రైతులు హక్కులు వచ్చాక వాటిని విక్ర­యించా­రు. 27 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల­కు­గానూ తొలి విడత­లో పది లక్షల ఎకరాలను నిషే­ధిత జాబితా నుంచి తొలగించి వారికి హక్కు­లు కల్పించారు. 

అందులో కొంతమంది అమ్ముకో­వడం ముఖ్య­మంత్రికి నేరంగా కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో 22 ఏలో చేర్చిన 2 లక్షల ఎకరాల నిషేధిత భూములు, 34 వేల ఎకరాల షరతుగల పట్టా భూములు, 50 వేల ఎక­రాల అనాధీనం భూములపై వైఎస్సార్‌పీ హయాంలో ఆంక్షలు తొలిగాయి. 1.79 లక్షల ఎకరాల సర్వీస్‌ ఈనాం భూములను 22ఏ నుంచి తొలిగించి వారికి మేలు చేశారు. 

రైతుల సాగులో ఉన్న 9,064 ఎక­రాల లంక భూము­లను  17,768 మంది లబ్ధి­దా­­రులకు హక్కులతో అందచేసింది. ఎస్సీలకు శ్మశా­­న వాటికల కోసం 1,543 గ్రామాలలో 933 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి  పంచాయ­తీలకు అప్పగించింది. ఇవన్నీ చంద్రబాబుకు అక్ర­మాలు, అన్యాయాలుగా కనిపించడాన్ని ఏమనాలి?

రీ సర్వేపై తప్పుడు భాష్యాలు.. 
గత వందేళ్లలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన భూముల రీ సర్వేను ఒక అనాలోచిత చర్యగా చంద్రబాబు అభివర్ణించటాన్ని బట్టి రెవెన్యూ వ్యవస్థపై సీఎం చంద్రబాబుకు ఉన్న అవగాహన ఏపాటిదో స్పష్టమైంది. అనేక చిక్కు­ముళ్లు, ఆటంకాలు, వ్యయ ప్రయా­సలను అధిగమించి 6 వేల గ్రామా­ల్లో పూర్తయిన రీ సర్వేను రద్దు చేస్తానని ఆయన చెప్పడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడమే. 

వివాదాలు లేని భూముల వ్యవస్థ తేవటాన్ని వ్యతిరేకించడమంటే వివాదాలు కోరుకోవడమే. తద్వారా డ్రోన్లు, విమానా­లతో మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేయడం,  ప్రతి గ్రామా­నికి ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులను అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకి భూహక్కు పత్రం, భూములకు జియో ట్యాగింగ్‌ హద్దులు లాంటివన్నీ వృథా అయినట్లే! ఇప్పటివరకూ సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్‌ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 

అవి కూడా చంద్రబాబుకు తప్పుగానే కనిపించాయి. అన్నిటికీ మించి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. వివాదాస్పదమైన పాత భూముల వ్యవస్థనే మళ్లీ తేవాలని చంద్రబాబు నిర్ణయించడంపై రెవెన్యూ యంత్రాంగం విస్తుపో­తోంది. భూ హక్కులకు భరోసా కల్పించేలా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి రాజకీయ మకిలి అంటించి దాన్ని చంద్రబాబు చెత్తబుట్టలో వేసేశారు. ఏపీలో ఎప్పు­డూ జరగని విధంగా చేపట్టిన ఈ భూసంస్కరణ­లన్నింటిపైనా తప్పుడు ముద్ర వేసి తొలగించాలను­కోవడం మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.

ఇదేం విచిత్రం?
2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి మైన్స్‌ ద్వారా ప్రభుత్వానికి రాబడి ఏటా రూ.2 వేల కోట్లు ఉంటే 2024లో ఏటా దాదాపు రూ.4 వేల కోట్లకు చేరింది. మరి ఖజానాకు ఆదాయం రెట్టింపు అయినప్పుడు రూ.19 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ చేయడం విచిత్రం కాదా? ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యావ్‌ చంద్రబాబూ! గనుల కేటాయింపుల్లో పారదర్శక విధానాలు తెచ్చి ఆదాయం పెంచిన గత ప్రభుత్వం పారదర్శకంగా పని చేసినట్లా? లేక ఆదాయం తక్కువ చేసి, పారదర్శక విధానాలు లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడినట్లా? చిన్న­పిల్లలను అడిగినా ఈ విషయం సులభంగా చెప్పేస్తారు కదా! 

ఇసుకపైనా అసత్యాలే
అధికారంలోకి వచ్చిన నెలన్నర వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను బొక్కేసిన చంద్రబాబు వైఎస్సార్‌­సీపీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిపోయిందంటూ గుండెలు బాదుకోవడం గజ దొంగల్ని సైతం విస్మ­యా­నికి గురిచేస్తోంది. ఇసుక ఫ్రీ అని మభ్యపుచ్చి ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఖజానాకు ఏటా రూ.780 కోట్లు రాబడి తెచ్చే విధానాన్ని తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఇసుక అప్పగించింది. ఐదేళ్లలో రూ. 4 వేల కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వా­నికి రాబడి వచ్చింది. 2014–­19 మధ్య ఇసుక ఫ్రీగా ఇచ్చానని బుకాయించిన చంద్రబాబు ఎంత దోపిడీకి తెర తీశారో ఇప్పుడెంత కొల్లగొట్టనున్నారో ఆయనకే తెలియాలి మరి!!

ఒక్క ఇల్లూ కట్టని చంద్రబాబు.. 31 లక్షల ఇళ్లు ఇచ్చిన జగన్‌పై విమర్శలా?
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలను సైతం చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై చంద్రబాబు బురద చల్లేందుకు సాహసించారు. పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు, 72 వేల ఎకరాల్లో 17 వేల కాలనీలు నిర్మించి పేదలకు పంచడాన్ని కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాలనీల కోసం 28 వేల ఎకరాలను సేకరించగా, మరో 25 వేల ఎకరాల ప్రైవేటు భూములను కొనుగోలు చేసి కాలనీలు కట్టించారు. 

అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా? పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇళ్ల యజ్ఞాన్ని అడ్డుకుని ఇప్పుడు నీతి సూక్తులు చెప్పడం విస్మయపరుస్తోంది. కనీస ఆధారాలు లేకుండా భూసేకరణలో వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం స్థాయి వ్యక్తి దిగజా­రుడు ఆరోపణలు చేయడం తగునా? 31 లక్షల మంది పేదలకు మంచి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి పది వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు కాక మరేమిటి?

‘గీతం’ కబ్జాలు గుర్తులేవా?
సాక్షి, విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్ధా­లను ముద్రించేసిన సీఎం చంద్రబాబు విశాఖ­లో భూములు మింగేసిన అనకొండలు టీడీపీకి చెందినవేనన్న విషయాన్ని కప్పిపు­చ్చేందుకు విఫలయత్నం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చినా తప్పేనంటూ అసత్యాలు వల్లెవేశారు. టీడీపీ అనకొండల నుంచి మార్కెట్‌ ధర ప్రకారం రూ.5 వేల కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.  గీతం పేరుతో రూ.500 కోట్ల విలువైన 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు(ఫైల్‌) 

స్టూడియో భూములపై అవగాహన ఉందా?  
రామానాయుడు స్టూడియోను ప్లాట్ల పేరుతో ఆక్రమించి విక్రయించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు యత్నించారంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. నిజానికి స్టూడియో యజమానులే రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణతో పాటు నిబంధనలు పరిశీలించిన తర్వాతే గత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టూడియో యజమానులు దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు యత్నించారు. నిజంగానే కబ్జా జరిగితే స్టూడియో అధినేతలు ఎందుకు ఉపేక్షిస్తారనే కనీస అవగాహన లేకుండా అర్థం పర్థం లేని విమర్శలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.  

పీఠానికి లీజుకే..  
వేద పాఠశాల నిర్మా­ణం కోసం విశాఖ శారదా పీఠానికి 2022 ఫిబ్రవరి 8న 15 ఎకరాల భూమిని తక్కువ ధరకే అప్పగించేశారని, దీని వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి శారదా పీఠానికి భూమిని కేవలం లీజుకు మాత్రమే అప్పగిస్తున్నట్లు జీవో 64లో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను అనుసరించి ఎకరా రూ.లక్ష చొప్పున లీజుకు ఇస్తే శారదా పీఠానికి భూములు రాసిచ్చేసినట్లు చంద్రబాబు మభ్యపుచ్చేందుకు ప్రయత్నించారు. మరి లీజు, సేల్‌ రెండూ ఒకటి కాదనే విషయం ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా?  

హయగ్రీవపైనా అబద్ధాలు.. 
ఓల్డేజ్‌ హోమ్‌ కోసం హయగ్రీవ ల్యాండ్స్‌ 12.51 ఎకరాలను ఇస్తే వైఎస్సార్‌సీపీ నేతలు కొట్టెయ్యాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 2008 డిసెంబర్‌ 6న ప్రివిలైజ్డ్‌ మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం ఎకరం రూ.45 లక్షలు చొప్పున (ఆ సమయంలో ఎస్‌ఆర్‌వో విలువ ఎకరం రూ.28.40 లక్షలు) 12.51 ఎకరాలను కేటాయిస్తూ జీవో నం.1447 జారీ అయింది. ప్రభుత్వ ఉత్తర్వులు, కన్వేయన్స్‌ డీడ్‌ షరతుల ప్రకారం మొత్తం భూభాగంలో 10% కాటేజీల నిర్మాణానికి, 30% రోడ్లు, డ్రెయిన్లు, ఇతర నిర్మాణాలు, సౌకర్యాల కోసం వినియోగించాలి. 

సదరు సంస్థ జీవీఎంసీకి  2012 ఫిబ్రవరి 24న (బీఏ నం.10900/2014/డీసీపీ–1/జీ1) దరఖాస్తు చేసుకుంది. ప్లాన్‌లను ఆమోదించకపోవడంతో కలెక్టర్‌ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై జీవీఎంసీ, వుడాకు లేఖ రాసే హక్కు కలెక్టర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కరించేంత వరకూ భూమి లాక్కోకూడదని, బలవంతపు చర్యలు వద్దని, చట్ట ప్రకారం వ్యవహరించాలని హై­కోర్టు స్పష్టం చేసింది. 

తక్షణమే పిటిషనర్‌కు ఎన్‌వోసీ జారీ చేయాలని కలెక్టర్‌ను 2017లో ఆదేశించింది. నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు సమయంలో విధించిన షరతులకు లోబడే కన్వేయన్స్‌ డీడ్, ప్లాన్‌ను ఆమోదిస్తే చంద్రబాబు అబద్ధాలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఖనిజ వనరులను దోచుకుంది ఎవరు?
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఆదాయం జగన్‌ హయాంలో అనూ­హ్యంగా పెరిగింది.2020–21లో రూ.502 కోట్లు ఉన్న ఆ సంస్థ ఆదాయం 2022–­23 సంవత్సరానికి రూ.1,806 కోట్లకు చేరింది. 2023–24 నాటికి రూ.4 వేల కోట్లకు చేరడాన్ని బట్టి మైనింగ్‌ ఆదాయాన్ని జగన్‌ ప్రభుత్వంలో ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో గనుల ఆదాయం తగ్గిపోయి అప్పట్లో గనుల దోపిడీ యధేచ్చగా జరిగిపోయిందని స్పష్టమవుతోంది. 

గనుల్ని ఇష్టానుసారంగా దోచుకు తిన్నది టీడీపీ నేతలే. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు లేటరేట్‌ కొండల్ని తొలిచేశారు! రోడ్డు మెటల్‌ తవ్వకాలతో నర్సీపట్నం పరిసర ప్రాంతాలను లోయలుగా మార్చేసిన ఘనత అయ్యన్నదే! మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలిలో చేసిన గనుల దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు గ్రానైట్‌ మాఫియాగా మారి దోచుకున్నారు. 

2019లో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక కొత్త గనుల విధానం ద్వారా ఆదాయం పెరిగేలా చేశారు. రాయల్టీ వసూళ్లలోనూ కొత్త మార్గదర్శకాలు ప్రవే­శపెట్టారు. అరకొరగా ఉన్న మైనింగ్‌ సిబ్బంది వల్ల సీనరేజీ వసూళ్లు సరిగా జరగడంలేదని గుర్తించి ప్రైవేటు సంస్థలకు పారదర్శకంగా కాంట్రాక్టులు ఇచ్చారు. లీజుల జారీ విధానాన్ని అందరికీ అను­కూ­లంగా ఉండేలా మార్చారు. వీటన్నింటి ఫలితంగానే ఆదాయం పెరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement