‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్‌ఆర్‌ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు.
ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment