‘‘పుష్ప’ పాటలు విడుదలయ్యాక ఇండస్ట్రీ నుంచి చాలామంది అభినందిస్తూ మెసేజ్‌లు పంపించారు. అమెరికా నుంచి కొందరు యువకులు ఫోన్ చేసి ‘పుష్ప’ పాటల పల్లవులు, చరణాలు పాడి వినిపించారు. దాంతో నేటి యువత కూడా సాహిత్యాన్ని ఇంతలా ఓన్ చేసుకున్నారా? అని చెప్పలేని సంతోషం కలిగింది’’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాటల రచయిత చంద్రబోస్ విలేకరులతో చెప్పిన విశేషాలు.
► సుకుమార్‌గారితో ‘ఆర్య’ నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన స్వతహాగా కవి కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం మరింత సవాల్ అనిపించింది. మనం ఏం రాయాలి అనే దానిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది.
► ‘పుష్ప’ సినిమాకు పాటలు రాయటం చాలా కష్టం అనిపించింది. ఈ సినిమా పూర్తీగా చిత్తూరు జిల్లా యాసలో నడుస్తుంది కాబట్టి పాటల్లో కూడా ఆ ప్రాంత స్లాంగ్‌ను, పదాలను వాడాల్సి వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ గార్లు చిత్తూరు యాసను కష్టపడి ఒంట బట్టించు కుని అందులో లీనం అయిపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. వారి స్ఫూర్తితో నేను కూడా కష్టపడి రాశాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్ విసిరాయి.
► ‘పుష్ప’లోని ‘దాక్కో దాక్కో మేక, ‘శ్రీవల్లీ’, ‘సామీ సామీ’, ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..’ పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, నా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా..’ అనే ఈ ఐటెమ్ సాంగ్ ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది.
► ‘రంగస్థలం’ సినిమాకి నేను పాటలు రాయలేదు. కేవలం ఆ సందర్భాలు మాటలను పలికాయి.. అవే పాటలై పోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్ షీట్ విడుదల చేయాలనుకున్నప్పుడు మాత్రమే పేపర్ మీద పాటల రూపాన్ని పెట్టాను. నా 27 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.
► మేం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఓ బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు వచ్చిన ఆలోచనే ‘చూపే బంగారమాయెనే..’ పాట. 15 రోజుల మేథో మధనం తర్వాత తిరుపతి హోటల్ రూమ్‌లో పుట్టిందే ‘దాక్కో దాక్కో మేక..’ పాట. మా ‘పుష్ప’లోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంపగుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ తరంలోనూ నా పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉండటం మరింత సంతోషాన్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment