పెళ్లి పీటలు కలిపాయి! | Sakshi Special Interview With Singer Chandrabose | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలు కలిపాయి

Published Sun, Jan 26 2020 1:25 AM | Last Updated on Sun, Jan 26 2020 1:57 PM

Sakshi Special Interview With Singer Chandrabose

చంద్రబోస్, సుచిత్ర

వేళా విశేషం అంటారు. చంద్రబోస్, సుచిత్ర కలవడం అలాంటి విశేషమే! ఇద్దరూ చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుంటే ఫ్లయిట్‌లో పక్క పక్క సీట్లొచ్చాయి.. ‘హలో’ చెప్పుకున్నారు.. తర్వాతేం జరిగిందో.. ఈ ఇంటర్వ్యూలో ఉంది. చూపులో, మనసులో, పెద్దలో కలిపితే.. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చుంటారు. వీళ్లిద్దర్ని మాత్రం.. పెళ్లి పీటలు కలిపాయి! అవును.. పెళ్లి పీటలు వీళ్లకు ముడివేశాయి. చదవండి... ఒక చక్కటి పాటను వింటున్నట్లో.. హుషారైన ఒక డాన్సును చూస్తున్నట్లో ఉంటుంది.

►ఆటా పాటలది విడదీయలేని అనుబంధం.. మీరు పాటల రచయిత.. సుచిత్రగారు డ్యాన్స్‌ మాస్టర్‌.. మీ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది?
చంద్రబోస్‌: 1998లో ‘పెళ్లి పీటలు’ సినిమా రికార్డింగ్‌ కోసం చెన్నై వెళ్లాను. పని పూర్తయ్యాక హైదరాబాద్‌ వస్తున్నాను. ఆ పాటల్ని షూట్‌ చేయడానికి కొరియోగ్రాఫర్‌గా సుచిత్ర హైదరాబాద్‌ వస్తోంది. మేమిద్దరం ఒకే సినిమాకు పని చేస్తున్నాం కాబట్టి ఫ్లయిట్‌లో పక్కపక్క సీట్లు వచ్చాయి. ‘హలో’ అని ఆమెను పలకరించాను. అప్పటికే విడుదలైన ‘పరదేశీ’ సినిమాలో నేను రాసిన పాటల గురించి చెబుతూ, కొన్ని వాక్యాల గురించి ప్రస్తావించింది.

కొరియోగ్రాఫర్‌లు విన్యాసాలకు మాత్రమే అనుకుంటున్న తరుణంలో మనసుకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా గుర్తుపెట్టుకుని చెప్పడంతో తనంటే నాలో మంచి భావన కలిగింది. కవితాత్మకంగా చెప్పాలంటే... కవిత్వాన్నే అర్థం చేసుకున్నది కవిని కూడా అర్థం చేసుకుంటుందని అర్ధాంగిని చేసుకోవాలనుకున్నాను. ఫ్లయిట్‌ ప్రయాణం మరుసటి రోజు నా బర్త్‌డే. మాటల మధ్యలో ఆ విషయం చెప్పాను. మరుసటి రోజు నాకో పుష్పగుచ్చం, గ్రీటింగ్‌ కార్డ్‌ పంపింది.

►మీరు గ్రీటింగ్‌ కార్డ్‌ పంపేటప్పుడు చంద్రబోస్‌గారి మీద ఏదైనా ఫీలింగ్‌ ఉందా?
సుచిత్ర: ఫీలింగ్‌ ఏం లేదు. నిజానికి మగవాళ్లంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. బాగా మాట్లాడుతూ సందర్భం చూసుకుని ‘ప్రేమ’ అంటూ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారనుకునేదాన్ని. అందుకే ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉండేదాన్ని. బోస్‌గారి విషయంలో ఆయన వర్క్‌ నాకు చాలా నచ్చింది.

►ఫ్లయిట్‌ జర్నీ తర్వాత మళ్లీ ఎప్పుడు కలిశారు?
బోస్‌: ‘పెళ్లి పీటలు’ పాటలు తీస్తుంటే ఆ షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లాను. మేమిద్దరం ఒకర్నొకరం జస్ట్‌ అలా చూసుకున్నాం. ఆ తర్వాత ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లోను, వేరే సినిమాల షూటింగ్స్‌లోనూ కలుసుకున్నాం.

సుచిత్ర: ఎక్కువ ఫోన్లు చేసేవారు. అలాగే లొకేషన్లో పాట పాడుతున్నప్పుడు నన్నే చూసి పాడేవారు. ఆడియో ఫంక్షన్‌లో క్యాసెట్స్‌ ఇస్తారు కదా.. నాకు ఇచ్చిన క్యాసెట్‌ను లాగేసుకొని తన క్యాసెట్‌ నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆ క్యాసెట్లో ఆయన ఫొటో ఉంది. అందుకే నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆయన్ని నా చేతిలో పెట్టినట్టుగా ఫీలయ్యారు. నాకు అప్పటికి ఓ కన్‌ఫర్మేషన్‌ వచ్చింది. దాంతో ‘మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మానాన్నలను ఒప్పించండి. మా ఇంట్లోవాళ్లతో మాట్లాడండి’ అన్నాను.

►అంటే అప్పటికి బోస్‌గారంటే మంచి అభిప్రాయం ఏర్పడిందా?
సుచిత్ర: మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే మనకు సహజంగానే వాళ్లంటే ఒకలాంటి మర్యాద ఏర్పడుతుంది కదా.

బోస్‌: అప్పటికే నా కెరీర్‌ ప్రారంభమై మూడేళ్లయింది. 95లో కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. నెలకి 15–20 పాటలు రాసేవాణ్ణి. ప్రేమ అని సమయం వృథా చేయడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుని కెరీర్‌ మీద దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పటికి నాకు రెండుమూడు సంబంధాలు చూశారు. సినిమా పాటలు రాస్తానని చెబితే వాళ్లకు అర్థం కాలేదు. హీరోలే పాటలు రాసుకుని పాడతారని వాళ్ల అభిప్రాయం. ఎన్టీఆర్, చిరంజీవి వాళ్లు రాసుకుంటారు కదా. మీరు రాయడమేంటి? అన్నారు. అబద్ధం చెబుతున్నామనుకున్నారు.

మన పని, మన కష్టం, మన ఆనందం.. వాళ్లకు అర్థం కావు. ఈ పరిశ్రమ గురించి తెలిసినవాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది. అందుకని బయట పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని ఇంట్లో చెప్పాను. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నా సమీపం వరకూ వచ్చింది, వదులుకోకూడదనుకున్నాను. సుచీ గురించి ఇంట్లో చెప్పాను. సినిమా ఫీల్డ్, డ్యాన్స్‌ మాస్టర్‌ అని వాళ్లు భయపడ్డారు. నేను ఇష్టపడుతున్నానని ఇంట్లో ఒప్పించాను.

►వాళ్ల ఇంట్లో ఏమన్నారు?
సుచిత్ర: ముందు మా అక్క ఒప్పుకుంది. తర్వాత వద్దంది.  

బోస్‌: సుచిత్ర ఇంట్లో వాళ్ల అక్కే అన్నీ చూసుకునేవారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. మేం నిశ్చింతగా పని చేసుకుంటున్నాం అంటే తన వల్లే. అయితే ముందు పెళ్లికి ఒప్పుకుని, ఆ తర్వాత నాకంటే వయసులో సుచీ పెద్ద కాబట్టి వద్దన్నారు. ‘ఆరో ప్రాణం’ సినిమా కథ సుచిత్రదే. ఆ సినిమాలో వినీత్‌ కంటే సౌందర్య పెద్దది. మా విషయంలో ఆ కథ నిజమైంది.

సుచిత్ర: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే విజయం ఉందని నమ్ముతా. అందుకే తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇంటి నుంచి వచ్చేశాను. తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నాం. కరెక్ట్‌ కాదనిపించింది. మా ఇంట్లో వాళ్లు ఎలాగూ లేరు. మీ వాళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుందాం అన్నాను ఆయనతో.

బోస్‌: వరంగల్‌ మా సిస్టర్‌ వాళ్ల ఇంటికి వెళ్లాం.. ఆ తర్వాత మేమంతా కలసి భద్రాచలం వెళ్లాం. అక్కడ పెళ్లి చేసుకున్నాం.  

సుచిత్ర: ఆయన ఇంట్లోవాళ్లను పరిచయం చేసుకున్నాక నా జీవితం అంతా వీళ్లే అని నిర్ణయించుకున్నాను.

►ఆ తర్వాత మీ ఇంట్లోవాళ్లు అంగీకరించారా?
సుచిత్ర: పెళ్లయిన నెలకి మా వాడు కడుపులో పడ్డాడు. పుట్టబోయే బిడ్డను మంచిగా స్వాగతిద్దాం అని కలుపుకున్నారు.

►రచయితగా మీరు స్ఫూర్తి నింపే పాటలు ఎన్నో రాశారు. మీ వ్యక్తిగత జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈ దిశగా మిమ్మల్ని  మీరు మార్చుకున్న విషయాలేమైనా?
బోస్‌: కళాకారులు ఆదర్శప్రాయంగా ఉండాలని నమ్ముతాను. వ్యక్తిగతంగా మనం ఆచరించనిది మనం ఎవ్వరికీ చెప్పకూడదు. కళాకారులకు చెడు వ్యసనాలు ఉండకూడదు. అయితే నాకు కొన్ని వ్యసనాలు ఉండేవి. సినిమాల్లో బిజీగా ఉండే కొత్తలో పాన్‌ పరాగ్‌ తినేవాణ్ణి. మానేయమని మా ఆవిడ పోరు పెట్టేది. ఓసారి సీరియస్‌గా ‘పాన్‌ పరాగ్‌ మానేయండి. పాటలు రాయకపోయినా ఫర్వాలేదు, సాయిబాబా గుడి దగ్గర అడుక్కు తిందాం. మీరు కూడా అక్కర్లేదు. నేను అడుక్కుని మీకు పెడతా’ అంది.

మానేశా. ఆ తర్వాత సిగరెట్‌ అలవాటయింది. ఫ్లాస్క్‌లో టీ పెట్టుకుని సిగరెట్లు కాల్చుకుంటూ రాసేవాణ్ణి. ‘నువ్వు ఈ మత్తులో పడిపోయి రాస్తూ ప్రజల్ని మేలుకొలపడం ఏంట్రా’ అనిపించింది. రచయిత గురువు స్థానంలో ఉంటాడు. ఆ ఆలోచన వచ్చీ రాగానే సిగరెట్‌ మానేశా. ఆ సినిమాకు రాశాను, ఈ హీరోకు రాశాను, ఆ అవార్డు వచ్చింది.. ఇది కాదు.. వ్యక్తిగతంగా మన చెడు అలవాట్లను అధిగమించడమే గొప్ప విజయాలు. మంచి దారిలో ప్రయాణిస్తూ మంచి చెప్పాలి. మనం ముసుగు వేసుకుని ఇతరులను మేలుకొల్పడం ఏంటి?

►డ్యాన్స్‌ డైరెక్టర్‌గా సుచిత్రగారు రఫ్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. విడిగా ఆమె ఎలాంటివారు?
బోస్‌: టీమ్‌లో చాలామంది డ్యాన్సర్లు ఉంటారు. ఇలా చెయ్‌ అని చెబుతూ అన్నీ సరి చూసుకుంటూ, బుజ్జగిస్తూ, గద్దిస్తూ ఉండాలి. తనలో నాయకత్వపు లక్షణాలున్నాయి కానీ అవన్నీ కళాకారిణి వరకే. గృహిణిగా తనంత సాత్వికంగా ఉండేవాళ్లను చూడలేం. మా అమ్మానాన్నలను నాకన్నా బాగా చూసుకునేంత మంచి మనసు తనది. మా అమ్మ చనిపోయి 9 నెలలవుతోంది. అమ్మ చనిపోయిందనే నిజాన్ని నేను తీసుకున్నాను. కానీ తను తీసుకోలేకపోతోంది.

►మీది ‘ఇంటర్‌క్యాస్ట్‌ మ్యారేజ్‌’. పైగా మీకన్నా సుచిత్రగారు కాస్త పెద్ద. మీ వైవాహిక జీవితంలో వీటి తాలూకు ప్రభావం ఎంతవరకూ ఉంటుంది?
బోస్‌: తను ఫార్వార్డ్‌ క్యాస్ట్‌. నేను బీసీ. ఒకే రకమైన ఆహారపు అలవాట్లు, ఒకే విధమైన ఆచార సంప్రదాయాలు ఉంటే ఏ సమస్యా రాదు. అయితే భిన్నమైన ఆచారాలు, ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను నాజ్‌వెజ్‌ తింటాను. సుచిత్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తను తినదు. నాకు చేసి పెట్టమని నేను అడగలేదు. అయితే నేను చేయకపోతే మా ఆయన ఎలా తింటారని యూట్యూబ్‌ చూసి వండటం నేర్చుకుంది.  మా పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా ఆహారపు అలవాట్ల విషయంలో మాకు అవగాహన కుదిరింది. తను పూజలు చేస్తుంది. నాకూ భక్తిభావం ఎక్కువే.

సుచిత్ర: ఆయనకు ఏం ఇష్టమో అది చేసి పెట్టడం నా బాధ్యత. నేను అదే పనిగా పూజలు చేయను. పుట్టింటివారిని, మెట్టినింటివారిని బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ పూజలూ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను.

►అత్తమామలను చూసుకునే విషయంలో సుచిత్రగారి గురించి?
బోస్‌: 1999 మార్చి 7న భద్రాచలంలో మా పెళ్లి జరిగింది. మా అమ్మానాన్నను మాతో పాటు హైదరాబాద్‌ తీసుకువచ్చాం. అమ్మ ఈ మధ్య చనిపోయింది. నాన్న ఉన్నారు. అప్పుడప్పుడు మా ఊరికి నాన్న వెళ్లి వస్తుంటారు. అక్కడ మాకు ఇల్లు ఉంది. ఇంకో విశేషం ఏంటంటే.. మా నాన్నగారు, సుచీ నాన్నగారు మాతోనే ఉంటున్నారు. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మా అమ్మానాన్న... తన అమ్మానాన్న అనే తేడా మాకు లేదు. మా ‘ఇద్దరివాళ్లు’ ‘మావాళ్లే’ అనే ఫీలింగ్‌తో ఉంటాం.

సుచిత్ర: కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పేపర్స్‌లో యాడ్స్‌ ఇవ్వడం, భారీగా తద్దిన భోజనాలు పెట్టడం, దర్పం కోసం గిఫ్ట్‌లు పంచడం చేస్తుంటారు. చనిపోయాక ఇవన్నీ చేస్తే వాళ్లకు తెలుస్తుందా ఏంటి? బతికి ఉండగానే తల్లిదండ్రులకు సేవ చేయాలి.

బోస్‌: చనిపోయాక ఖర్చు చేసే డబ్బులతో వాళ్లు బతికి ఉన్నప్పుడే బాగా చూసుకోవచ్చు కదా. నీతులు చెప్పే చాలామందిని చూశాను నేను. కానీ తల్లిదండ్రులను మాత్రం చూడరు. అమ్మానాన్నలను నిస్వార్థంగా చూసుకోవడంలో ఉన్న సంతృప్తి వేరే ఎందులోనూ దొరకదు.

►మరి.. వయసు వ్యత్యాసం గురించి.. పెళ్లి విషయంలో అబ్బాయికన్నా అమ్మాయి చిన్నగా ఉండాలనే నియమం ఎందుకంటే అబ్బాయికన్నా అమ్మాయికి మానసిక పరిణతి ఎక్కువ ఉంటుందని..
బోస్‌: అబ్బాయిని పురుషుడ్ని చేసేది సమాజం. అమ్మాయిని స్త్రీగా చేసేది ప్రకృతి. నేచురల్‌గానే తనకు పెద్దరికం వచ్చేస్తుంది. ఆలోచనల్లో, సమయస్ఫూర్తి పరంగానూ అమ్మాయిలు ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. మామూలుగా అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న అయితే అమ్మాయి ఎక్కువగా అలక పూనుతుంది. అప్పుడు అమ్మాయిని అబ్బాయి బుజ్జగిస్తాడు. కానీ ఇక్కడ నేనే అలుగుతుంటాను. మా ఆవిడ బుజ్జగిస్తుంది. సో.. మాకు ఆ సమస్య లేదు (నవ్వుతూ).

సుచిత్ర: మనం ఏదైనా క్షమించగలగాలి. భర్త తప్పులు చేస్తున్నప్పుడు భార్య అతన్ని అమ్మలా ప్రేమించాలి. అమ్మలా ప్రేమిస్తున్నప్పుడు మన కోపంలోనూ ప్రేమే కనపడుతుంది కాబట్టి భర్త ఆ కోపాన్ని పెద్దది చేయడు.

►మీ భార్యని మనసులో పెట్టుకుని రాసిన పాట?
బోస్‌: ‘సీతయ్య’ సినిమాకి రాసిన ‘సమయానికి తగు సేవలు సేయనీ..’ పాట తనని దృష్టిలో పెట్టుకుని రాశాను. ఈ పాట రాసే సమయానికి తను ఇద్దరు పిల్లల్ని కన్నది. కానీ నాకు ఆమెకు సేవ చేసే అవకాశం లభించలేదు. ఆమెను వాళ్ల అక్కయ్యవాళ్లు తీసుకుని వెళ్లారు. ఒకవేళ నేను మా ఆవిడకు సేవ చేస్తే ఎలా చేసి ఉండేవాడిని అనే తలంపుతో ఈ పాట రాశాను.
సుచిత్ర: ఆయన సినిమాటిక్‌గా బిహేవ్‌ చేయరు. కానీ ఆయన గొప్పతనం గురించి చెబుతాను. మా నాన్నగారు నాతోనే ఉన్నారు. ఆయన ఖర్చులన్నీ నేనే పెడుతున్నాను. పెళ్లయ్యాక ఇలా పుట్టింటివాళ్లను చూసే అదృష్టం అందరికీ రాదు.

►ఓకే.. మీ ఇద్దరి పిల్లల గురించి?
బోస్‌: మా అబ్బాయి నంద వనమాలి బీటెక్‌ మెకట్రానిక్స్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనకు కార్లు, వాటి డిజైన్ల మీద ఇంట్రస్ట్‌. గిటార్‌ ప్లే చేస్తాడు. అమ్మాయి అమృత వర్షిణి స్పోర్ట్స్‌ పర్సన్‌. త్రోబాల్‌లో రెండు సార్లు నేషనల్స్‌ ఆడింది. ఇప్పుడు కూడా ఆడుతోంది.

►ఫైనల్లీ.. మ్యారీడ్‌ లైఫ్‌ హ్యాపీగా సాగాలంటే...?
బోస్‌: అందరిలోనూ మానవ సహజమైన చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ముఖ్యంగా నేనేమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని నిండు మనసుతో క్షమిస్తుంది నా భార్య. మా కాపురం ఇంత హాయిగా సాగటానికి ఆమె క్షమాగుణమే ప్రధాన కారణం. సిగిరెట్లు, పాన్‌పరాగ్‌లు తిని నోరంతా పాడు చేసుకుని, వొళ్లంతా పాడైపోయి వారానికో, పదిరోజులకో మందు తాగినా కూడా క్షమించేది. లేడీ ఫ్యాన్స్‌ అంటూ కొంతమంది ఫోన్‌ చేస్తారు.

అలాంటి సమయంలో కూడా ఏ అపోహలకు తావు లేకుండా క్షమించేస్తుంది. ఆ గుణమే భర్తలో మార్పును తీసుకొస్తుంది. భార్య రెండు సార్లు క్షమించిన తర్వాత భర్తకు ఎంత సిగ్గుగా ఉంటుంది. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో చెడుతనం ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కడన్నా అమ్మాయిలో చెడుతనం ఉంటే అప్పుడు అబ్బాయి క్షమించాలి. ఆ సమతూకం వల్లే కాపురాలు చక్కగా ఉంటాయి.

సుచిత్ర: మగవాళ్లు ఎన్ని తప్పులు చేసినా భార్య ఆ తప్పుల్ని క్షమిస్తే ఎరేజర్‌ (రబ్బర్‌)లాగా అవుతుంది. కానీ భార్య మాత్రం తప్పు చేయకూడదు. చేయకపోవడం మంచి సంసారానికి పునాది. ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకున్నామో అప్పుడు అతనితో పాటు ఉన్న అన్ని బంధాలూ మనవే అనుకోవాలి. బేసిక్‌గా మేం ఇద్దరం ఎవరిలోనూ నెగటివిటీ చూడం.

బోస్‌: మా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నవాణ్ని. నాకు ఓ అక్క. మా అందరి పిల్లలూ కలిపి ఓ పన్నెండు మంది ఉంటారు. పెద్దలు, పిల్లలు మొత్తం ఇరవైమందిమి. మీ ఫ్యామిలీలో ఎవరు బెస్ట్‌ అని ఒకరికి తెలీకుండా ఇంకొకరిని అడిగితే అందరూ సుచిత్ర పేరే చెప్తారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నమ్మకంగా ఈ వ్యక్తికి చెప్పొచ్చు అనే పేరు తెచ్చుకుంది సుచీ.

సుచిత్ర: మళ్లీ అదే చెబుతున్నా.. జీవిత భాగస్వామిని అమ్మలా ప్రేమించాలి. క్షమాగుణం ఉండాలి. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ఉండాలి.

►ఒకప్పుడు రచయితగా మీరు బిజీ.. కొరియోగ్రాఫర్‌గా ఆవిడ బిజీ. ఇప్పుడు కాస్త రిలాక్స్‌ అవుతున్నట్లున్నారు?
బోస్‌: వాస్తవం ఏంటంటే 20 ఏళ్లు విరామం విశ్రాంతి లేకుండా పని చేసింది. పనిలోనే పండగ అన్నట్టు పని చేసింది. నేనూ 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. మనిషికి పరిగెత్తడం ఒక కళ అయితే పరుగు ఆపడం ఒక గొప్ప కళ. జీవితాంతం పని చేయలేడు. చేయకూడదు. మన శరీరమో, ప్రకృతో వాతావరణం వల్లో పనిలో మనం మందకొడిగా అయ్యే అవకాశం ఉంది. ఇద్దరం పరిగెత్తితే ఇల్లు, పిల్లలు ఏమైపోవాలి అని నెమ్మదించాం. పెద్దవాళ్లను చూసుకునే సమయం ఉండాలి.

సుచిత్ర: పెద్దవాళ్లు మనకు చేసింది తిరిగిచ్చేయాలి. పిల్లల భవిష్యత్‌ కోసం మనం కొంచెం ఖాళీగా ఉండాలి.

బోస్‌: విరామాన్ని కూడా ఆస్వాదించాలి.

►మీ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు పంచుకుంటారా?
సుచిత్ర: చెప్పడం కాదు.. చూపిస్తా (నవ్వుతూ). మా ఫస్ట్‌ ఫ్లయిట్‌ జర్నీ టికెట్లు, మేం పెళ్లి చేసుకోవడానికి చెన్నై నుంచి తిరుపతి వెళ్లి అటునుంచి వరంగల్‌ వెళ్లిన జర్నీ టికెట్స్, మేం ఇద్దరం కలిసి ఫస్ట్‌ వెళ్లిన గుడికి సంబంధించి టికెట్లు.. నా దగ్గర భద్రంగా ఉన్నాయి. పెళ్లయ్యాక ఒకేరోజు కంటిన్యూస్‌గా రెండు సినిమాలు చూశాం. ఆ సినిమా టికెట్లు, నాకు మొదటిసారిగా ఆయన 450 రూపాయలు పెట్టి కొనిపెట్టిన చీర బిల్లు అన్నీ ఉన్నాయి.

బోస్‌: అవును. నాకు పంపిన మొదటి గ్రీటింగ్‌ కార్డ్‌ కూడా చాలా జాగ్రత్తగా దాచింది. 1999 మార్చి7న మా పెళ్లి జరిగింది. 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల మా ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు తోడుగా ఉంటూ ఆనందంగా ఉన్నాం. కావాలనే పని తగ్గించుకున్నాం. తీరిక సమయాలను ఆస్వాదిస్తున్నాం.

►‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్లీ డైరెక్షన్‌ ఎప్పుడు?
సుచిత్ర: మంచి కథ ఉంది. అయితే మంచి నిర్మాత దొరికితే మళ్లీ డైరెక్షన్‌ చేస్తా.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement