పిడికిళ్లు బిగించి పలుగు, పార పట్టుకున్నా.. వారి చేతి గీత మారింది లేదు. చెమట నీరు చిందించి చలువరాతి మేడను కట్టినా.. వారి నుదుటి రాత బాగుపడ్డదీ లేదు. యజమానికి నచ్చినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా ఇళ్లు కట్టే భవన నిర్మాణ కూలీలు భారంగా బతుకీడుస్తున్నారు. పనులన్న రోజుల్లో మస్తుగా ఉండటం.. లేకుంటే పస్తులుండటం వాళ్లకు మామూలే. సిమెంట్, ఇసుక, నీళ్లు సమపాళ్లలో కలిపి ఇంటికి దృఢత్వం తీసుకువచ్చే వీరికి మాత్రం కష్టాల పాళ్లే ఎక్కువ. తాపీతో మెరిసిపోయే ఫినిషింగ్ ఇచ్చే ఈ మేస్త్రీల జీవితాలు మాత్రం తాపీగా సాగడం లేదు.ఈ కష్టజీవులను సాక్షి సిటీప్లస్ తరఫున సినీగీత రచయిత చంద్రబోస్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు.