
కృతిక ఉదయనిధి ఒక బిగ్‌స్టార్‌తో సినిమా ప్రారంభించనున్నారు. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే మూడు చిత్రాలతో పాటు ఒక వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కానీ, పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఈసారి ఒక బలమైన కథతో హిట్ కొట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి(Kiruthiga Udhayanidhi) అన్న విషయం తెలిసిందే. ఈమె దర్శకురాలిగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా నటుడు రవి మోహన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా కాదలిక్క నేరమిల్‌లై చిత్రాన్ని తెరకెక్కించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 4వ తేదీన తెరపైకి వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే చిత్రంలోని సన్నివేశాలు ప్రత్యేకంగా ఉన్నట్లు ప్రశంసలు పొందాయి. తర్వాత చిత్రానికి కృతిక ఉదయనిధి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం.

ఇందులో విజయ్ సేతుపతిని(Vijay Sethupathi) కథానాయకుడిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఆర్ముగకుమార్ దర్శకత్వంలో నటించిన ఏస్, మిష్కిన్ దర్శకత్వంలో నటించిన ట్రైన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విజయ్‌సేతుపతి, క్రితిక కాంబోలో రూపొందనున్న ఈ చిత్రంపై కచ్చితంగా మంచి అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు.