
‘‘కోర్ట్’ చాలా అందమైన సినిమా. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ జగదీష్ బాగా తీశారు. ఈ సినిమా చూశాను... ఇందులో హీరో ఎవరో చెప్పడం కష్టం. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అని హీరో నాని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ కథ సున్నితమైనది. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీష్ చాలా పరిశోధన చేశారు. ఇది అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా. గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొడతారు... ఇందుకు నాదీ గ్యారెంటీ.
ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్లే’’ అన్నారు. ‘‘నాని అన్న బ్యానర్‌లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి చెప్పారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీగారికి థ్యాంక్స్. ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్‌ని నమ్మి ఆయన సినిమా నిర్మించారు’’ అని రామ్ జగదీష్ తెలిపారు.
‘‘నాని, ప్రశాంతి ప్రోడక్షన్ హౌస్‌లో కథ నచ్చితే ఎంత అయినా ఖర్చు పెడతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత దీప్తి గంటా. ‘‘ఇలాంటి మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని రోషన్, శ్రీదేవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment