అరవై నాలుగు కళల్లో పెళ్లి కళ లేదు (నవ్వులాటకు లెండి). కానీ పెళ్లిలో అరవై నాలుగేమిటి.. నూట అరవై నాలుగు కళకళలు ఉంటాయి. కళలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. పెళ్లికళ మాత్రం మారుతూ ఉంటుంది. మెరుగౌతుంది. తరుగౌతుంది. తరుగైనా, మెరుగైనా తళుక్కున మాత్రం ఒక మెరుపౌతుంది. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి వేడుకలు కాలానుగుణంగా ఎలా మారుతున్నాయో చూతము రారండి.
ఒకప్పుడు ఏడు రోజుల పెళ్లిళ్లు జరిగేవి. మెల్లగా ఐదు రోజులు, మూడు రోజులు, రెండు రోజుల పెళ్లిళ్లు అయ్యాయి. ఇంకా కుదించుకుపోయి ఒక్కరోజుకు పరిమితమయ్యాయి కూడా. నానమ్మ– తాతయ్య తరం నుంచి అమ్మా–నాన్న తరం వరకు వచ్చిన మార్పులవి. కారణాలు ఏమయితేనేం ఇండియా సంపన్నమైంది. అమెరికా ఉద్యోగాలతో ఇండియా చేతిలో డబ్బు గలగలలు పెరిగాయి. ఈ తరానికి పెళ్లి మళ్లీ వారం రోజుల వేడుకైంది. అంతరించిపోయిన వేడుకలను యథాతథంగా తిరిగి తోడడం కంటే మనకు నచ్చిన ఉత్తరాది సంప్రదాయాలను తెచ్చుకుంటే... ఎలా ఉంటుంది? భారతీయతలోని భిన్నత్వాన్ని ఏకత్వం చేసినట్లు ఉంటుంది.
ఇంకేం... ఉత్తరాది, దక్షిణాది సంప్రదాయాలు కలిసిపోయాయి. మెహందీ, సంగీత్‌లకే రెండు రోజులు! మన దగ్గరెలాగూ ఓ రోజు ప్రదానం. ఓ రోజు పెళ్లి కూతుర్ని చేయడం. ఓ రోజు గంధపు నలుగు. తాళికి, తలంబ్రాలకు ఎటూ ఒకరోజు ఉంటుంది. మరుసటి రోజు అమ్మాయిని అత్తవారింటికి తోడ్కొని వెళ్లడం... ఏడు రోజులు సరిపోయాయి. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. అదయ్యాక పదహారు రోజుల పండగ ఎలాగూ ఉంటుంది. ఒక పెళ్లి ఇన్ని పండుగలను తెస్తుంది. పండగలతో ఆగదు, పనులనూ తెస్తుంది. ఇన్ని పనులా! ఎన్ని పనులైతేనేమి? ఒకప్పుడు ధాన్యం పట్టడం నుంచి విస్తరాకులు వేయడం వరకు అన్ని పనులనూ ఇంట్లో వాళ్లు చేసుకునేవాళ్లు. ఇంటిల్లిపాదీ పెళ్లి పనులు చేసేవాళ్లు. బంధువులు కూడా పెళ్లి పనుల్లో సాయం చేసేవాళ్లు.
ఇప్పుడు ప్రతిదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే. ఇప్పటి సంపన్న పెళ్లిళ్ల ట్రెండ్ చూస్తుంటే మూడుముడులు వేయడానికి నచ్చిన వేదిక కోసం ముల్లోకాలను గాలిస్తున్నట్లే ఉంది. ఈ వెకేషన్ మ్యారేజ్‌లకు కేరళ కొబ్బరితోటలు, బాలిలోని పగడపు దీవులలోపాటు అరబ్ ఎమిరేట్స్ కూడా భారతీయ పెళ్లి కళను సంతరించుకుంటున్నాయి. ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నాయకుడి కొడుకు పెళ్లి అబుదాబిలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌కి ఖమ్మంలో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో కళాత్మక నిర్మాణాలు, వాటర్ ఫౌంటెయిన్‌లను, బాహుబలి సెట్టింగులను మించిన సెట్టింగులను వేశారు. ఇలా శుభలేఖల నుంచి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ, విందు భోజనాలు, పెళ్లి ఫొటోల వరకు ప్రతిదీ కొత్తదనం– సంపన్నతల కలబోత అయింది.
పెళ్లి పిలుపు
50 ఏళ్లనాటి ఒక పెళ్లిపత్రిక
పంతొమ్మిది వందల అరవైల నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై క్రీగంటి చూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు! పెళ్లికి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా, ఫొటోస్టూడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. రాజుల కాలం నాటి చుట్ట చుట్టిన వర్తమాన వస్త్రం నమూనాలోకి పెళ్లిపత్రికను తెచ్చుకున్నారు కొందరు. చిన్న బ్యాటరీని అమర్చిన పెళ్లి పత్రికలూ వచ్చాయి. కార్డు తెరవగానే సంగీతం వినిపించేది. కొన్ని కార్డులు ఫొటో ఫ్రేమ్‌తో వస్తున్నాయి. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పత్రికను తీసేసి ఎవరికి వాళ్లు తమకు ఇష్టమైన ఫొటోను అమర్చుకుని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది.
ఫోన్‌లో పెళ్లి పత్రికను (పెళ్లి ఫైల్ అనాలేమో) ఓపెన్ చేయగానే వధూవరుల ఫొటోలతో ఉన్న చిన్న వీడియో ప్లే అవుతోంది. ఆ ఆహ్వానం చూస్తుంటే పెళ్లి చూసినట్లే ఉంటోంది.
పెళ్లి పందిరి
పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పసుపు దంచడానికి, పందిరి వేయడానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారు. మామిడాకులు కట్టిన ఒక రాటను నాటుతారు. ఆ తర్వాత పందిరి కోసం కొబ్బరి ఆకులు, తాటాకులు తేవడం కూడా ముఖ్యమైన ఘట్టమే. వధువు తండ్రి బండి కట్టి ఎడ్లను అదిలిస్తుంటే తల్లి నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని ఎదురు రావడం ఓ సంతోషకరమైన ఘట్టం. తాజా కొబ్బరాకుల పచ్చి వాసనతో పచ్చటి పందిరి సిద్ధమయ్యేది. గెలవేసిన అరటి చెట్లు ద్వారపాలకుల్లా ఠీవిగా కొలువుదీరేవి. మామిడి తోరణాలు ఆరడుగుల ఆజానుబాహుల నుదుటిని తాకి పలకరిస్తుంటే.. అంతగా ఎదిగిన సంగతి గుర్తొచ్చి మురిసిపోతూ, మామిడి తోరణం కింద ఒదిగి నడిచేవాళ్లు. అలాంటి పందిరిని రంగుల షామియానా మింగేసింది. ఇప్పుడు మళ్లీ సంప్రదాయపు ట్రెండులో భాగంగా పెళ్లికి ఇంటి ముందు పందిరి వేయడం అనే ముచ్చట అందరినీ మురిపిస్తోంది.
తన గంగడోలుతో ఆడుకున్న పాపాయి పెళ్లి కూతురవుతోందని ఆ ఇంటి ఎడ్లకు ఎలా తెలుస్తుందో ఏమో! ఎప్పుడూ మొరాయించే ఎడ్లు కూడా ఆ రోజు తలలూపుతూ ఉల్లాసంగా కదిలేవి!
పెళ్లి మండపం
ఒకప్పుడు ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరే పెళ్లి మండపం. వచ్చేవారు ఎక్కువ మంది ఉంటే ఊరి ఆలయంలోని దేవుని మండపమే కల్యాణవేదిక. ఇప్పుడు కల్యాణ వేదిక ఫంక్షన్ హాల్‌కు తరలిపోయింది. మండపం అలంకరణలో మన దగ్గర పూచే పూలకు ఆదరణ తగ్గి, కార్నేషన్, ఆర్చిడ్ వంటి పరదేశీ పూలు వచ్చి చేరాయి. పెళ్లితోపాటు నిశ్చితార్థం, రిసెప్షన్ వేదికలు కూడా ఇప్పుడు ఫంక్షన్ హాల్‌లే.
పెళ్లి దండలు
పెళ్లి సీజన్‌ను బట్టి మల్లెపూలు, చేమంతులు, మరువం, కనకాంబరాలతో చిక్కగా మాలలు కట్టి, ఐదారు మాలలను కలిపి ఒత్తుగా దండ అల్లేవాళ్లు. మన దగ్గర గులాబీ తోటలు విస్తరించిన తర్వాత వధూవరుల మెడలను గులాబీ దండలు అలంకరించాయి. పీటల మీదకు వచ్చేటప్పుడు ధరించిన ఆ దండలు.. పెళ్లి పూర్తయ్యేలోపు రెక్కలు రాలి కాడలుగా మిగిలేవి. బెంగళూరు హైబ్రీడ్ గులాబీలు ఈ సమస్యని తప్పించాయి. కానీ మెడలు లాగేసేటంతటి బరువుగా ఉండేవి. పువ్వు మొత్తంతో పనేంటి రెక్కలుంటే చాలుగా అంటూ పూలరెక్కలతో దండలు అల్లే ట్రెండ్ కూడా వచ్చింది. అలాగే మెడలో ఉండీ లేనట్లుంటే ఆర్చిడ్స్, బరువైన కలువపూల దండలు వచ్చాయి. సన్నటి మల్లెల మాలలు కూడా కనిపిస్తున్నాయి.
వధూవరుల దుస్తులకు మ్యాచింగ్ దండలు వచ్చేశాయి. ఇక్కడ వధువు చీర, జాకెట్ రంగులకే ప్రాధాన్యం. వధూవరుల దుస్తులు కనుక కాంబినేషన్‌లో ఉంటే పూలదండలు కూడా అదే రంగుల్లో ఉంటున్నాయి.
పెళ్లి దుస్తులు
ఒకప్పుడు వధువు పెళ్లి దుస్తుల ఎంపిక కూడా వరుడి తరఫు వాళ్లదే. ‘మా అమ్మాయికి ఈ రంగు ఇష్టం’ అని వధువు తల్లి ఒక చీర చేతికి తీసుకుంటే... ‘ఆ చీరతో పెళ్లి పీటల మీద కూర్చుంటే మా బంధువులు నవ్వుతారు’ అని అబ్బాయి తరఫున ఎవరో నోరుజారేవాళ్లు. ఇప్పటి వధువు.. తనకు కూడా ఇష్టాయిష్టాలున్నాయని ప్రకటించింది. కొత్తదనంలో ఎన్ని రకాల దుస్తులు మారినా.. పెళ్లి చీర ప్రత్యేకత మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అబ్బాయిలే పెళ్లి దుస్తుల శైలిని మారుస్తూ వస్తున్నారు. యాభై– అరవై ఏళ్ల కిందట అందరూ పంచెలు కట్టుకున్నారు. కాలేజ్‌లో చదివిన వాళ్లు ప్యాంటు ధరించడం అనే ట్రెండ్‌ని సెట్ చేశారు. ఎనభైల నాటికి సూట్‌లు ధరించారు. కొత్త మిలీనియంలో మన సంప్రదాయాన్ని పాటించడం అనే ఫ్యాషన్‌లో జారి పోతున్న పట్టు పంచెలతో కుస్తీలు పడుతూ, రాజస్థానీ షేర్వాణీలను ఆశ్రయిస్తున్నారు.
మగపెళ్లి వాళ్లు హుందాగా ‘మీరే వెళ్లి అమ్మాయికి నచ్చినవి తీసుకోండి’ అని వధువు తల్లిదండ్రుల చేతిలో డబ్బు పెట్టేస్తున్నారు. పెళ్లి దుస్తుల షాపింగ్‌కి వధువు కూడా వెళ్లడం మొదలైంది.
పెళ్లి అలంకరణ
పెళ్లి అలంకరణలో కాళ్లకు పారాణితోపాటు నుదుట బాసికానికి అగ్రస్థానం ఉండేది. అందుకు తగ్గట్లే కిరీటం మీద కలికితురాయిలాగ వరుడికి పెద్ద బాసికం ఉండేది. ఆ బాసికానికి రెండు వైపులా చెంపల మీద జారుతూ పట్టుకుచ్చులు, ముఖమల్ కుచ్చులు వేళ్లాడుతుండేవి. ఇప్పుడు బాసికం నుదుటి బొట్టంత చిన్నదిగా మారిపోయింది. అప్పట్లో పెళ్లి కూతురి అలంకరణ బంధువులే చేసేవాళ్లు. కొత్తగా పెళ్లయిన యువతులు, అలంకరణ మీద ఆసక్తి ఉన్న మహిళలు చొరవగా ముందుకు వచ్చేవాళ్లు. ఇక పూలజడల్లో కనకాంబరాలు, మల్లెలు, మరువాలుండేవి. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. ఆర్చిడ్స్, పేపర్ ఫ్లవర్స్, గోల్డ్ రిబ్బన్ ఫ్లవర్స్ జడలుగా అమరుతున్నాయి.
ఇప్పుడు వధువు అలంకరణ ఒక పరిశ్రమగా మారిపోయింది. బ్రైడల్ మేకప్ బ్యూటీపార్లర్‌లో కానీ బ్యూటీషియనే మండపానికి వచ్చి మేకప్ చేయడం కానీ జరుగుతోంది.
పెళ్లి వంటలు
అరిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, బూందీ లడ్డు, జిలేబీ, వడలు, సుగీలు, పులిహోర, పాయసం, పప్పు, నెయ్యి, కాయగూరల వంటలను అరిటాకులో వడ్డించేవాళ్లు. చివరగా అరటిపండు, తమలపాకులు, వక్కపొడితో భోజనం పూర్తయ్యేది. పీటల మీద కూర్చుని ప్రశాంతంగా తినేవాళ్లు. బంతి చాపలు, టేబుళ్లు– కుర్చీలు వచ్చాయి వచ్చి వెళ్లిపోయాయి. ఇప్పుడు బరువైన ప్లేట్ చేత్తో పట్టుకుని, బరువు మోయగలిగినంత సేపు ఎంత తిన్నామో అదే భోజనం. పదార్థాలు మాత్రం బారులు తీరి ఉంటున్నాయి. మూడు రకాల స్వీట్లు, రోటీ, నాన్, పుల్కా, పూరీ, వెజ్‌టబుల్ బిరియానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, చైనీస్, థాయ్, కాంటినెంటల్ వంటకాలు, ఆవకాయ అన్నం, కరివేపాకు అన్నం, పనీర్ కర్రీ, జీడిపప్పు కూర, వేపుళ్లు, వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఊరగాయలు, పొడులు... నోరూరిస్తుంటాయి. భోజనానికి ముందు సలాడ్‌లు, భోజనం తర్వాత డెజర్ట్‌లు. పెళ్లి పెద్దకి మాత్రం తిన్న వారికి తిన్నంత పెట్టాలనే ఉంటుంది. అయితే కేటరింగ్ సప్లయర్లకు ట్రైనింగ్‌లో భాగంగా గరిటెలోకి కూర రాకుండా వడ్డించే నైపుణ్యం అలవడి ఉంటోంది.
పెళ్లెప్పుడు అని అడగడానికి ‘పప్పన్నం ఎప్పుడు’ అని అడిగేవాళ్లు అప్పట్లో. పెళ్లితో అంతగా కలగలిసిపోయిన ముద్దపప్పు మాత్రం పెళ్లి భోజనాల్లో కనిపించడం లేదిప్పుడు!
పెళ్లి ఊరేగింపు
వరుడు మోతుబరి అయితే ఏనుగు అంబారీ మీద, మిగిలిన వాళ్లు గుర్రం మీద ఊరేగేవాళ్లు. వరుడి వెంట అతడి బంధువులు గుర్రం వెంట నడిచేవాళ్లు. గ్రామంలో ప్రతి గుడి దగ్గర ఆగి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగేవాడు వరుడు. వధువు పల్లకిలో ప్రయాణమవుతుంది. పల్లకి వెంట వధువు బంధువులు తరలి వెళ్లేవాళ్లు. నడవగలిగిన వాళ్లు నడిచి వస్తుంటే, మిగిలిన వాళ్లు ఎడ్ల బండిలో అనుసరించేవాళ్లు. పెళ్లి కోసం ప్రత్యేకంగా సవారి బండ్లు ఉండేవి. పెళ్లి బండి ఎడ్లను మువ్వలు, గజ్జెలు, నల్లతాళ్లతో అలంకరించేవాళ్లు. ఇప్పుడు పూలతో అలంకరించిన టాప్‌లెస్ కారులో వధూవరుల ఊరేగింపు జరుగుతోంది. అది కూడా ఊరంతా కాదు, విడిది ఇంటి నుంచి కల్యాణ మండపం వరకే.
పెళ్లి కూతురి వెంట పది– ఇరవై బండ్లు ఉండేవి. పెళ్లి బండ్ల సంఖ్య పెద్దదయితే... అది, వధువుకి ఆత్మీయుల బలగం అంత పెద్దదని చెప్పకుండా చెప్పడం.
పెళ్లి ఫొటోలు
ఓ యాభై ఏళ్ల కిందట పెళ్లికి ఫొటోలు తీయించుకోవడం ఓ లగ్జరీ. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే. ఓ పది ఫొటోలు... తీయించుకుంటే అదే ఎక్కువ. ఎనభైలకు కలర్ రీల్ వచ్చింది. పెళ్లి చీరను ఫొటోలో చూసుకుని మురిసిపోయే చాన్స్ పెళ్లి కూతురికి వచ్చింది. వీడియో కూడా వచ్చింది. కెమెరామన్ చెప్పినట్లు పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి పురోహితుడికి ఎదురైంది. అతిథులు కెమెరా టీమ్ వీపులను చూసి చూసి బోరు కొట్టి, పక్కన కూర్చున్న వాళ్లతో కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయేవాళ్లు. అప్పుడొచ్చాయి స్క్రీన్‌లు. అతిథులకు పెళ్లిని స్క్రీన్ మీద చూసే భాగ్యం కలిగింది. డ్రోన్ కెమెరాతో కూడా పెళ్లి తంతును షూట్ చేయించుకుంటున్నారిప్పుడు.
‘పెళ్లిని సినిమా కూడా తీయించారా’ అని అడగడంలో అమాయకత్వం, ‘తీయించాం’ అని చెప్పడంలో ఆడంబరం కొంతకాలం రాజ్యమేలాయి. క్రమంగా పెళ్లి తంతు మొత్తంలో కెమెరా టీమ్‌దే పై చేయిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment