క్యూఆర్‌.. అదిరింది యార్‌! | QR code on the wedding card | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌.. అదిరింది యార్‌!

Published Tue, Feb 12 2019 2:13 AM | Last Updated on Tue, Feb 12 2019 2:13 AM

QR code on the wedding card - Sakshi

పెళ్లి.. జీవితంలో మరుపురాని ఓ మహాఘట్టం. దీన్ని సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. పెళ్లికి సంబంధించిన అన్ని అంశాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. పెళ్లి ఘట్టంలో నిశ్చితార్థం తర్వాత పెళ్లి పిలుపు ప్రధాన ఘట్టం. దాంట్లోనే తమ హోదా చూపించుకోవాలని భావిస్తారు. ఇప్పుడు నెలరోజులుగా తగ్గిన శుభముహూర్తాలు తాజాగా ఊపందుకున్నాయి. మాఘమాసంతో పాటు ఫాల్గుణ మాసంలోనూ మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల సందడి గ్రేటర్‌లో జోరందుకుంది. అతిథులను ఆహ్వానించేందుకు పెళ్లి పిలుపులో ‘క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌’అనే నయాట్రెండ్‌ వచ్చిచేరింది.

హైదరాబాద్‌లో ఇప్పుడు అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. సాధారణంగా వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వేదిక ఎక్కడున్నది త్వరగా తెలియదు. ఇందుకోసం తమను ఆహ్వానించిన వారికి ఫోన్‌ చేయటం లేదా దారిన పోయే వారిని అడగాల్సి రావటం మనందరికీ అనుభవమే. అయితే వేడుకల హడావుడిలో ఉన్న వారు ఇలా కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవటం కొంత ఇబ్బందికరమే. ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్‌ పెడుతూ వేదిక ఎక్కడో ఈ కోడ్‌లో నిక్షిప్తం చేసేస్తున్నారు. అతిథులు తమ వద్ద ఉన్న ఆహ్వానపత్రికలోని క్యూఆర్‌ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేస్తే తాము ఉన్న ప్రాంతం నుంచి వేదిక వద్దకు చేరడానికి మార్గం, పట్టే సమయం అంతా గూగుల్‌ మ్యాప్‌లో చూపిస్తుంది. ఉదాహరణకు లండన్‌లోని బంధువు దీనిని స్కాన్‌ చేస్తే అక్కడి నుంచి విమాన మార్గంలో దగ్గరి ప్రాంతానికి ఎంత సమయం పడుతుంది. అక్కడి నుంచి కార్‌ వంటి వాటిల్లో నేరుగా వేదిక వద్దకు రావటానికి పట్టే సమయాన్ని సైతం ఇది సూచిస్తుంది.     

రూపాయే ఎక్కువ.. 
సాధారణ కార్డుతో పోలిస్తే క్యూఆర్‌ కోడ్‌ను జత చేసిన కార్డు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అధికమని భాగ్యనగరంలో ఈ తరహా కార్డును ఇటీవల ముద్రించిన వారు అంటున్నారు. అంతేకాక దీనిలో వేడుక సందడి గురించి తెలియజేస్తూ రూపొందించిన వీడియో ప్రోమో సైతం కోడ్‌ స్కాన్‌ చేసుకున్న వారిని పలకరిస్తుంది. నేరుగా తమ వారు తమను ఆహ్వానిస్తూ వీడియోలో కనిపించటం విశేషం. విదేశాల్లో ఈ ట్రెండ్‌ ఏళ్ల క్రితమే ప్రారంభమవ్వగా.. మన దేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement