
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను మనువాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం అధికారికంగా ఈ నెల 30న ముంబైలో 39 అట్లామౌంట్ రోడ్‌లో జరుగబోతోంది. మరోవైపు వీరి పెళ్లి కూడా డిసెంబర్‌లో జరుగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన కార్డు తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డు అంబానీ ఫ్యామిలీ స్థాయిని మించి ఉంది. ఆకర్షణీయమైన తెల్లటి రంగు బాక్స్.. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే చిన్న ఆలయం.. గ్లాస్ డోర్‌తో ఉన్న ఆ ఆలయంలో, అన్ని శుభకార్యాలకు ఫలప్రదమైన వినాయకుడి విగ్రహం ఉన్నాయి. ఆ చిన్ని ఆలయంపైనే ఆకాశ్, శ్లోకాల వెడ్డింగ్ కార్డు ఉంది. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసింది. ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రిక ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
కాగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థానికి అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో ఆమె బుధవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. నిశ్చితార్థపు తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక కూడా గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment