బ్యాంకింగ్‌లో సంస్కరణల మోత!
బ్యాంకింగ్ రంగంలో త్వరలో భారీ సంస్కరణలను తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.
వాషింగ్టన్: బ్యాంకింగ్ రంగంలో త్వరలో భారీ సంస్కరణలను తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. విదేశీ బ్యాంకులు భారత్‌లోకి పెద్దయెత్తున ప్రవేశించేందుకు వీలవడంతోపాటు దేశీ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు కూడా దోహదం చేసేలా ఈ సంస్కరణలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నిర్వహించిన కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. భారత్‌లోకి విదేశీ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించి విధానపరమైన కార్యాచరణను వచ్చే కొద్దివారాల్లో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.
విదేశీ బ్యాంకులకు కూడా దాదాపు దేశీ బ్యాంకుల స్థాయిలోనే అనుమతులు ఇస్తామని, అయితే ఇందుకు రెండు షరతులు వర్తిస్తాయని రాజన్ పేర్కొన్నారు. ‘విదేశీ బ్యాంకులకు భారత్ ఏవిధంగా అనుమతులు ఇస్తుందో.. అదేవిధంగా ఆయా దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇక రెండోది... ఏదైనా విదేశీ బ్యాంక్ భారత్‌లో బ్రాంచ్‌ల ఏర్పాటు రూట్, అనుబంధ సంస్థ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు... రెండింటిలో ఏదోఒక విధానాన్నే ఎంచుకోవాలి. నియంత్రణ ప్రక్రియ సరళీకరణ, పారదర్శకతే మా ఉద్దేశం’ అని రాజన్ వివరించారు.
పరపతి విధానానికి ధరలే ప్రాతిపదిక...
ఆర్‌బీఐ సాధారణ పరపతి విధాన సమీక్షలో ఎప్పుడూ ధరల పరిస్థితినే పరిగణనలోకి తీసుకుంటామని రాజన్ చెప్పారు. ఈ నెల 29న ఆర్‌బీఐ రెండో త్రైమాసిక పాలసీ సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా షట్‌డౌన్‌పై..: అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్)పై స్పందిస్తూ... అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేంత పరిస్థితులేవీ లేవని రాజన్ అభిప్రాయపడ్డారు. అక్కడి ఎకానమీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, యూఎస్ బాండ్(ట్రెజరీ బిల్స్)లలో భారత్ పెట్టుబడులను(దాదాపు 59.1 బిలియన్ డాలర్లు) విక్రయించే అవకాశమే లేదన్నారు.
నేనేమీ సూపర్‌మేన్‌ను కాదు
ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యాఖ్యానాలపై రాజన్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా కొత్త బాధ్యతలపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కొంత అమితోత్సాహం నెలకొంది. నాపై అంచనాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అయితే, నేనేమీ సూపర్‌మేన్‌ను కాదని మీకు స్పష్టం చేయదలచుకున్నా’ అన్నారు. రాజన్‌ను మీడియా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించడం తెలిసిందే.