రాజన్.. వడ్డించెన్! | Analysts, economists divided over Rajan's RBI policy review measures | Sakshi
Sakshi News home page

రాజన్.. వడ్డించెన్!

Published Sat, Sep 21 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

రాజన్.. వడ్డించెన్!

రాజన్.. వడ్డించెన్!

ఎవరుకొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... అన్నట్లు ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా వస్తూవస్తూనే  షాకిచ్చారు. అందరి అంచనాలూ తలకిందులు చేస్తూ అటు కార్పొరేట్లు, ఇటు సామాన్యులపై కూడా వడ్డీరేట్ల పిడుగు వేశారు. వడ్డీరేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం ఎంతగా గొంతుచించుకున్నప్పటికీ తొలి పాలసీ సమీక్షలోనే తన రూటే సెప‘రేటు’ అని నిరూపించారు. కీలకమైన రెపో రేటును పావు శాతం పెంచుతూ రాజన్ నిర్ణయం తీసుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు అడ్డుకట్టవేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టీకరించారు. దీంతో కార్పొరేట్, గృహ, వాహన రుణాలన్నింటిపైనా వడ్డీరేట్లు మరింత ఎగబాకనున్నాయి. రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) గుదిబండగా మారనున్నాయి.
 
 ముంబై: అంచనాలకు అందనిరీతిలో ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం చేపట్టిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది ఇప్పుడున్న 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. గడచిన రెండేళ్లలో రెపో పెంపు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం అంటే.. 2011 ఆక్టోబర్‌లో చివరిసారిగా రెపో రేటు పావు శాతం పెరిగింది (8.5 శాతానికి). ధరల పెరుగుదల ఆందోళనలు, దీనికితోడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయిన నేపథ్యంలో రాజన్ కఠిన పాలసీకే కట్టుబడ్డారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, రెపో పెంపుతో దీనితో ముడిపడిఉన్న రివర్స్ రెపో కూడా పావు శాతం పెరిగి.. 6.5 శాతానికి చేరింది.
 
 ఇక నగదు నిల్వల నిష్పత్తిని రాజన్ ముట్టుకోలేదు. ఇప్పుడున్నట్లుగానే 4 శాతాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెలువడిన తక్షణం బ్యాంకర్లు కూడా వడ్డీరేట్ల పెంపు పల్లవి అందుకున్నారు. పండుగ సీజన్‌లో రుణాలు, ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) డిమాండ్‌లు పెరగనున్న నేపథ్యంలో డిపాజిట్, రుణ రేట్లు ఎగబాకుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్  అగ్రగామి ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి వ్యాఖ్యానించారు. కాగా, ఆర్‌బీఐ చర్యపై కార్పొరేట్లు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.
 
 దువ్వూరి బాటలోనే...
 ధరల కట్టడిపై అలుపెరుగని పోరు జరిపిన మాజీ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి కూడా చాలావరకూ కఠిన పాలసీనే అనుసరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్‌లను పక్కనబెడుతూ దువ్వూరి గడచిన రెండు సమీక్షల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు రాజన్ కూడా దువ్వూరి బాటలో నడవడమే కాకుండా ఆయనకంటే మరింత కఠినంగా వ్యవహరించడం గమనార్హం.ఏకంగా రెపో రేటును పెంచడం అటు కార్పొరేట్లు ఇటు మార్కెట్ వర్గాలను నిశ్చేష్టుల్ని చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా శుక్రవారం కుప్పకూలాయి. వాస్తవానికి పాలసీ రేట్లను తగ్గించకపోయినా... కనీసం యథాతథంగానైనా ఉంచుతారని కార్పొరేట్లు, విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆర్‌బీఐ పాలసీ సడలింపునకు ఆస్కారం ఉందనే వాదనలు వెల్లువెత్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఆర్‌బీఐ చర్యలు వెలువడటంతో అందరూ అవాక్కయ్యారు.
 
 ద్రవ్యసరఫరాపై స్పల్ప ఊరట...
 బ్యాంకులపై రెపో రేటు భారాన్ని తగ్గించే విధంగా రాజన్ లిక్విడిటీ పెంచేవిధంగా కొద్దిగా ఊరటనిచ్చారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును ముప్పావు శాతం తగ్గించి 9.75 శాతానికి పరిమితం చేశారు. అదేవిధంగా సీఆర్‌ఆర్‌లో బ్యాంకులు రోజువారీ అవసరాలకు వినియోగించే నిధులను కూడా కొద్దిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, రూపాయి పతనం చికిత్స కోసం ద్రవ్య సరఫరా కట్టడిలో భాగంగా ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలో బ్యాంక్ రేటు, ఎంఎస్‌ఎఫ్‌లను చెరో రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత భారంగా మారింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్‌బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్‌ఎఫ్‌ను ఆర్‌బీఐ 2011-12లో కొత్తగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా, ఎంఎస్‌ఎఫ్ తగ్గింపువల్ల రెపో పెంపు ప్రభావం ఉండకపోవచ్చని రాజన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా బ్యాంకులు తమ నిధుల సమీకరణ వ్యయాలను దృష్టిలోపెట్టుకొని వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవాలేతప్ప.. భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని తాను భావించడం లేదని కూడా రాజన్ పేర్కొన్నారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52 శాతంగా నమోదుకాగా.. టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి (6.1 శాతం) ఎగబాకడం తెలిసిందే. ముఖ్యంగా నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ధరలు తీవ్రస్థాయికి దూసుకెళ్తుండటం ఆర్‌బీఐ పాలసీ సడలింపునకు అడ్డంకిగా మారింది.
 
 పాలసీలో ఇతర ముఖ్యాంశాలివీ...

  •      ద్రవ్యోల్బణం రిస్క్‌లు పొంచి ఉన్నాయి. గత అంచనాలతో పోలిస్తే ఈ ఏడాది చివరికల్లా ద్రవ్యోల్బణం పెరగవచ్చు.
  •   మౌలికరంగ ప్రాజెక్టుల నిర్మాణం చాలా మందకొడిగా ఉంది. కొత్త ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కడం లేదు.
  •      మెరుగైన రుతుపవనాలు, వర్షాలు బాగుండటంతో ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయోత్పత్తి పుంజుకోనుంది. దీంతో మొత్తం జీడీపీ వృద్ధికి కాస్త చేదోడుగా నిలవొచ్చు. ఎగుమతులు మెరుగుపడుతుండటం కూడా సానుకూలాంశం.
  •   ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా కాస్త శాంతించే అవకాశాలున్నాయి. గతేడాది క్యాడ్ రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(88.8 బిలియన్ డాలర్లు) ఎగబాకడం తెలిసిందే. దీన్ని ఈ ఏడాది 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలనేది కేంద్రం లక్ష్యం.
  •   తదుపరి పాలసీ సమీక్ష అక్టోబర్ 29న ఉంటుంది.

 
 ద్రవ్యోల్బణం కట్టడే ముఖ్యం: రాజన్
 రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేస్తుందని రఘురామ్ రాజన్ స్పష్టీకరించారు. తన తొలిపాలసీ సమీక్షలో రెపో రేటు పెంపును సమర్థించుకున్నారు. ద్రవ్యసరఫరా మెరుగుపరిచే చర్యలతోపాటు రెపో రేటు పెంచడం అనేది వృద్ధికి చేయూతనిచ్చేదేనని రాజన్ పేర్కొన్నారు.   ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
 
 ‘ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి పరిమితం చేయడమే మా ప్రధాన కర్తవ్యం. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు రెండూ  కీలకమే. భవిష్యత్తులో వీటిపైనే పాలసీ ఆధారపడిఉంటుంది.  అయితే, వృద్ధి మందగమనంపైనా ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. రెపో పెంపు వల్ల వృద్ధిపైన ప్రభావం పట్ల అప్రమత్తంగానే ఉన్నాం. అయితే కొన్నిసార్లు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం వల్ల కూడావృద్ధికి చేయూత లభించవచ్చు. రెపో, ఎంఎస్‌ఎఫ్‌ల మధ్య వ్యత్యాసాన్ని క్రమంగా 1 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది(ప్రస్తుతం ఈ వ్యత్యాసం 2%).  తాజా సమీక్షలో ద్రవ్యసరఫరాను మెరుగుపరచడం వల్ల బ్యాంకులకు నిధుల సమీకరణ భారం కొంత తగ్గుతుంది. అమెరికా సహాయ ప్యాకేజీ కోతపై భయపడాల్సిన అవసరం లేదు.
 
 ఈ ప్రభావం మనపై పడకుండా పటిష్టమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఫెడ్ దీన్ని వాయిదా మాత్రమే వేసింది. రానున్న రోజుల్లో ఎప్పుడైనా ప్యాకేజీల కోత మొదలవుతుంది. ఇది జరిగే సమయానికి తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉండేవిధంగా మనం సర్వ సన్నద్ధంగా ఉండాలి. ముందే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. రూపాయి పతనం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీల డాలర్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయం(విండో) శాశ్వతమేమీ కాదు. రూపాయి విలువ స్థిరీకరణ జరిగితే దీన్ని కూడా క్రమంగా సడలిస్తాం. డాలరుతో రూపాయి మారకం విలువలో ఇటీవలి రికవరీ కాస్త మంచి పరిణామమే. కరెన్సీ కదలికలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాం. ఇంకా స్థిరీకరణ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement