మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం
► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం!
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు.
రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది.
ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన.
కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి.
యూకే ఓటర్ల జాబితాలో మాల్యా...
రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది.
ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.