
గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ఘటన
తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటున్న స్థానికులు
కొడుకుల కంటి సమస్యలను తట్టుకోలేక చంపానంటూ లేఖ
జీడిమెట్ల: కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తను కూడా అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్ హెయిట్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌నంబర్ 204లో ఉంటున్నారు.
వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్‌మెంట్ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్‌మెంట్ వారు వెళ్లి చూడగా, తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు సెకండ్ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా, కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉండగా, హర్షిత్‌రెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
వెంటనే అపార్ట్‌మెంట్ వారు హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే...తేజస్విని తన ఇద్దరు కొడుకులను విచక్షణారహితంగా చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

8 పేజీల లేఖ స్వాధీనం
తేజస్విని ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులకు 8 పేజీల ఓ లేఖ దొరికింది. అందులో తన ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉందని, రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారని...దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు అని రాసి ఉంది. తనను అందరూ పిచ్చిది అంటున్నారని, ఆ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆ లేఖలో పేర్కొంది. కాగా తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అపార్ట్‌మెంట్‌లోనూ ఎవరితో మాట్లాడదని స్థానికులు అంటున్నారు.