
అప్పుల భారం.. బలవన్మరణం
ఘట్‌కేసర్/రాంగోపాల్‌పేట్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్‌లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన నరసింహరాజు (39) సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన భారీగా నష్టపోయారు. నారపల్లిలోని తన ఇంటిని విక్రయించినా అప్పులు తీరలేదు.
ఎప్పుడూ అప్పుల గురించి ఆయన తీవ్రంగా మథనపడేవారు. అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన నరసింహరాజు ఆదివారం వేకువ జామున తన బైక్‌పై ఘట్‌కేసర్‌కు వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి ఘట్‌కేసర్ హెచ్‌పీసీఎల్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నారు. గుర్తు తెలియని రైలు పైనుంచి వెళ్లడంతో తల మొండెం వేరయ్యాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.