సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగార్థులకు ఊరట లభించింది. కటాఫ్ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమినరీ రాత పరీక్షలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు కటాఫ్ మార్కులు తగ్గాయి.
సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30% మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రకటించింది. వాస్తవానికి గత నియామకాల సమయంలో జనరల్ కేటగిరీకి 40% మార్కులు అర్హతగా ఉండగా.. బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు 30% కటాఫ్‌గా నిర్ధారించారు. ఈసారి జనరల్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు సైతం 30% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే అన్ని కేటగిరీలకు ఒకే రకమైన మార్కులు నిర్దేశించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కటాఫ్ తగ్గిస్తూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీకి కటాఫ్ మార్కులు 10% తగ్గడంతో.. మిగ తా కేటగిరీలకు కటాఫ్ తగ్గిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేటగిరీల వారీగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఆదివారం కటాఫ్ మార్కులు తగ్గిస్తూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకా రం బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి 20% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసింది. తాజా నోటిఫికేషన్‌ను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు వారి వివరాలను అప్‌లోడ్ చేసేందుకు ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment