కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి
నివాళులర్పించిన డీసీపీ అశోక్‌కుమార్
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్‌గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్
కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం
కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి
నివాళులర్పించిన డీసీపీ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment