
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment