
మామునూరు: దసరా పండుగ సందర్భంగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన టీఎస్‌ఎస్పీ ప్రాంగణంలోని విజయ దుర్గమ్మ గుడి వద్ద జరిగింది. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్సై గూడెల్లి యాకయ్య, సుమతి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రాజేష్ (32) మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో స్పెషల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో దసరా సందర్భంగా టీఎస్‌ఎస్పీ ప్రాంగణంలోని విజయ దుర్గమ్మ గుడి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున బండలు జారీ కింద పడిపోయే క్రమంలో రాజేష్ అక్కడే ఉన్న జీరో బల్బు వైర్‌ను చేతితో అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురై కేకలు వేశాడు. గమనించిన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసే లోపు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వెంటనే ఎంజీఎం తరలించారు.
అక్కడ పరీక్షించగా రాజేష్ అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి ఎంజీఎం చేరుకుని మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. దీంతో రాయపర్తి మండలం మైలారం గ్రామం, టీఎస్ ఎస్పీ బెటాలియన్‌లో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి యాకయ్య, టీఎస్‌ఎస్పీ బెటాలియన్ అధికారుల ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు. కాగా, మృతుడికి భార్య గౌతమి, కుమారుడు ఉన్నారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
రాయపర్తి : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గూడెల్లి రాజేష్ మామునూరులో టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్ర మంలో సోమవారం విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ సందర్భంగా బెటాలియన్ ఎస్పీతోపాటు పోలీసులు గ్రామానికి చేరుకుని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి గ్రామానికి చేరుకుని రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment