వరంగల్ క్రైం: ఓ యువ జర్నలిస్టు తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన గట్టిగొప్పుల యుగంధర్‌రెడ్డి అలియాస్ యోగి (36) పలు ఎలక్ట్రానిక్ మీడియాల్లో రిపోర్టర్‌గా పనిచేశాడు. హనుమకొండ నక్కలగుట్టలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతనికి తల్లి కృష్ణవేని, భార్య స్వప్న, కూతురు ఆద్య(10) ఉన్నారు.
కూతురు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సాయంత్రం పాఠశాల ముగిశాక కూతురును తీసుకుని ఏకశిలా పార్క్ సమీపంలోని తన కార్యాలయానికి వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ, కూతురు ఆద్య(10)ను ఫ్యాన్‌కు చీరతో ఉరేసి, తనూ ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకున్నాడు. వ్యక్తిగత పనిపై ఓ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్.. యోగి కార్యాలయానికి వెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి.
ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి మిగతా జర్నలిస్టులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి వెళ్లి బలవంతంగా తలుపులు తెరవగా తండ్రి,కూతురు వేలాడుతూ కనిపించారు. వెంటనే కిందికి దింపి చూడగా యోగి అప్పటికే చనిపోయాడు. ఆద్యకు పల్స్ ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు మృతదేహాలను సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, యోగి.. కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment