హసన్‌పర్తి: బాధ్యతాయుత స్థానంలో ఉన్నోడు.. విద్యార్థుల భవితకు బాసటగా నిలవాల్సినోడు. కూతురి వయసున్న ఓ విద్యార్థిపై కన్నేశాడు. వంకర బుద్ధితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కళాశాల యజమానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటితో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. భీమారానికి చెందిన బూర సురేందర్‌గౌడ్ స్థానికంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను నడుపుతున్నాడు. ఈ కళాశాలలో బాయ్స్, గర్ల్స్ క్యాంపస్‌లు వేర్వేరుగా ఉన్నాయి. గర్ల్స్ క్యాంపస్ నిర్వహిస్తున్న పై అంతస్తులోనే సురేందర్.. కుటుంబసభ్యులతో ఉంటూ పర్యవేక్షణ సాగిస్తున్నాడు.
అర్ధరాత్రి విద్యార్థినికి ఫోన్
శుక్రవారం అర్ధరాత్రి సురేందర్‌గౌడ్ గర్ల్స్ క్యాంపస్‌లో ఉంటున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి ఫోన్ చేశాడు. రెండో అంతస్తులో ఉన్న ఆ విద్యార్థిని కిందికి రమ్మని చెప్పాడు. ఫోన్ చేసినప్పటికీ ఆ విద్యార్థిని స్పందించలేదు. పది సార్లు ఫోన్ చేయడంతో ఆమె మరో పది మంది విద్యార్థులను వెంటబెట్టుకుని కిందికి దిగింది. అప్పటికే రాత్రి 12 గంటలు దాటింది. ఈక్రమంలో సురేందర్‌గౌడ్ తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థినితోపాటు మరికొంతమంది విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు శనివారం కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు
ఈ విషయమై విద్యార్థినుల తల్లిదండ్రులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళాశాల యజమాని తమ పిల్లలపై అసభ్యరకంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ కర్ణాకర్, స్థానిక ఎస్సై సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు.
కళాశాల ఎదుట ఆందోళన
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు శనివారం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు ఆందోళన సాగింది. కార్యక్రమంలో బీఎస్పీ రీజియన్ కార్యదర్శి కన్నం సునీల్, టీబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్, విద్యార్థి సంఘాల నాయకులు ఉషాన్‌నాయక్, మామిడి నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment