భార్య శివాని, పిల్లలతో రమేష్ (ఫైల్)
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడితో కలిసి భార్యే అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్ (35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్‌ను పరిశీలించారు.
అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య బుధవారం పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతని అన్నయ్య బర్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఆ దిశగా ప్రారంభమైన పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని.. భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామారావు అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రమేష్‌ను అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రమేష్ మద్యం తాగి పడుకున్న సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ప్రియుడితో కలిసి తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. భర్త బెడ్‌పై గిలగిల కొట్టుకుంటుప్పుడు భార్య శివాని సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే ఆ వీడియో ఎందుకు తీసింది? హత్యకు దారి తీసిన పరిణామాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వద్ద లభించిన వీడియోలో దృశ్యాలు నేపథ్యంలో అతనిని తలగడతో నొక్కి చంపి ఉంటారా? లేదా విష ప్రయోగం చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం ఆమె ప్రియుడు రామారావును, గురువారం ఆమెను ఎంవీపీ పోలీసులు పూర్తిస్థాయిలో విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. దర్యాప్తు పట్ల పూర్తి గోప్యత పాటిస్తున్నారు. వీరు వెల్లడించిన వివరాలతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి.. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment