కూతురు వైద్యవిద్యకు మళ్లీ ఆర్థికసాయం
ఎంఎస్ ఫీజుకు అవసరమైన రూ.24 లక్షలు చెక్కురూపంలో అందజేత
కిష్టయ్య కుటుంబంతో కలిసి భోజనం చేసిన బీఆర్‌ఎస్ అధినేత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. తెలంగాణ కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసిన విషయం తెలిసిందే. పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానంటూ కేసీఆర్ ఆనాడే అండగా నిలిచారు. కిష్టయ్య మరణించిన నాటికి, ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు కావడంతో వారి చదువుతో సహా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు.
కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ చేయడానికి అవసరమైన ఆర్థికసాయం కేసీఆర్ గతంలోనే అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకు అవసరమైన రూ.24 లక్షలను చెక్కురూపంలో ఆదివారం నందినగర్‌లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.
అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
అమ్మకు కష్టం కలిగించొద్దు : కేసీఆర్
‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది..చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటుంది.’అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు.
నా కుటుంబానికి అండగా ఉన్న దేవుడు కేసీఆర్ :కిష్టయ్య భార్య పద్మావతి
‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. నా భర్త పోలీస్ కిష్టయ్య దూరమై 15 సంవత్సరాలు గడిచాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చాడు.
నువ్వు బాధపడకమ్మా... నీ పిల్లలను నేను చూసుకుంటా అని ఇచ్చిన మాట ప్రకారమే, మా పిల్లలు, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నారు. 6వ తరగతి నుంచి ఇప్పటివరకు అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారు’అని భావోద్వేగంతో కేసీఆర్‌ను దేవుడంటూ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment