kistaiah
-
కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. తెలంగాణ కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసిన విషయం తెలిసిందే. పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానంటూ కేసీఆర్ ఆనాడే అండగా నిలిచారు. కిష్టయ్య మరణించిన నాటికి, ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు కావడంతో వారి చదువుతో సహా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ చేయడానికి అవసరమైన ఆర్థికసాయం కేసీఆర్ గతంలోనే అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకు అవసరమైన రూ.24 లక్షలను చెక్కురూపంలో ఆదివారం నందినగర్‌లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు కష్టం కలిగించొద్దు : కేసీఆర్ ‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది..చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటుంది.’అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు. నా కుటుంబానికి అండగా ఉన్న దేవుడు కేసీఆర్ :కిష్టయ్య భార్య పద్మావతి ‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. నా భర్త పోలీస్ కిష్టయ్య దూరమై 15 సంవత్సరాలు గడిచాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చాడు. నువ్వు బాధపడకమ్మా... నీ పిల్లలను నేను చూసుకుంటా అని ఇచ్చిన మాట ప్రకారమే, మా పిల్లలు, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నారు. 6వ తరగతి నుంచి ఇప్పటివరకు అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారు’అని భావోద్వేగంతో కేసీఆర్‌ను దేవుడంటూ కొనియాడారు. -
విద్యుదాఘాతంతో వాచ్మెన్ మృతి
నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ కరెంటు మోటారు చెడిపోవడంతో మరమ్మతులు చేసే క్రమంలో వాచ్మెన్ విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హకీంపేట పారామౌంట్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు రంగారెడ్డి జిల్లా పరిగి మండలం కిష్టాపూర్‌కు చెందిన కె.కిష్టయ్య(40) భార్య నర్సమ్మ, ఇద్దరు కొడుకులు, కూతురుతో కలిసి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ మోటార్ పాడవడంతో బాగు చేయడానికి యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. భర్త మృతితో నర్సమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం చేయాల్సిందిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్ సూపర్వైజర్ కళ్లముందే ఈ ఘటన జరిగిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడని, అలా కాకుండా తప్పించుకొని పరారయ్యాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కరెంట్ షాక్‌తో.. ఇద్దరు రైతులు దుర్మరణం
- ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణం - విద్యుత్ ఏఈ ఘెరావ్ - సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఖేడ్ సీఐ - ప్రభుత్వం నుంచి రూ.4లక్షలు - మరో రెండు లక్షలు సాయం చేయనున్న ఎమ్యెల్యే బాబూమోహన్ రేగోడ్ (మెదక్ జిల్లా) ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలు తీసింది. బహిర్భూమికి వెళుతూ ఒకరు.. అతన్ని కాపాడబోతూ మరొక రైతు ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఉసిరికపల్లి గ్రామ పంచాయతీలోని దరఖాస్తుపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. బాధిత కుటుంబాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిరికపల్లి గ్రామానికి చెందిన మంతూరి కిష్టయ్యకు నాలుగుఎకరాల భూమి ఉంది. మంతూరి ఫీరయ్యకు ఒక ఎకరం భూమి ఉంది. అన్నదమ్ముల పిల్లలైన కిష్టయ్య, ఫీరయ్యలు వరుసకు కూడా ఇద్దరు అన్నద మ్ములు. ఉన్న భూమిలో పత్తి, కంది, పెసర పంటలను సాగు చేశారు. వ్యవసాయం చేస్తూ కూడా కూలీ పనులు చేసుకుంటూ కుటుంభాన్ని పోషించేవారు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం బహిర్బూమికి ఫీరయ్య (45) వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కిందపడిన తీగలను గమనించని ఫీరయ్య అడుగు పెట్టాడు. ఇది గమనించిన కిష్టయ్య (35) దుప్పటి సాయంతో ఫీరయ్య ను కాపాడ బోయాడు.. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రాంరెడ్డి, కాంగ్రెస్ నేత సూర్రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు వీరారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదనాయక్, రేగోడ్ ఏఎస్ఐ నారాయణలు మృతదేహాలను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. మృతుడు కిష్టయ్య తండ్రి భూమయ్య ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు. -
కరెంట్ షాక్ తో రైతు బలి
రంగారెడ్డి జిల్లా: పొలానికి నీరందించే బోరు మోటారుకు కరెంటు సరఫరా కావడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన రైతు షాక్‌తో నిలువునా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డిజిల్లా బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డిపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలి కిష్టయ్య(46) శుక్రవారం ఉదయం తన బోరు మోటారుకు విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. దానిని మరమ్మతు చేసేందుకు ప్రయత్నించటంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. సమీప పొలాల్లో ఉన్న రైతులు కిష్టయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతనికి భార్య అంజిలమ్మ, కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. (బొంరాస్‌పేట)