సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్ ఎద్దుల రామకృష్ణ (35) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాలు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ 2011లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. సంజామల, ఆళ్లగడ్డ పోలీస్టేషన్‌ల్లో విధులు నిర్వహించి నంద్యాల త్రీటౌన్ పోలీస్టేషన్‌కు ఇటీవల బదిలీపై వచ్చాడు.
విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తోటి సిబ్బందితో సరదాగా ఉండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యథావిధిగా విధులకు హాజరయ్యాడు. స్టేషన్ భవనంపై ఉన్న రెస్ట్ రూమ్‌కు వెళ్లి తన సెల్ ఫోన్‌కు ఉన్న లాక్ నంబర్ రాసి పెట్టి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణ, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ నరసింహులు స్టేషన్‌కు చేరుకుని రామకృష్ణ ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో ఎటువంటి సమాచారం లేదని డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment