నిందితుడు మేకల ఈశ్వర్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలియక చోరీ సెల్‌ఫోన్లు ఖరీదు చేసిన వారిని బెదిరించడంతో మొదలైన ఇతడి వ్యవహారం స్నాచింగ్ గ్యాంగ్స్ నిర్వహించే వరకు వెళ్లింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈశ్వర్ ఆది నుంచీ వివాదాస్పదుడే. గడిచిన పుష్కరకాలంలో అతగాడు దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడగట్టాడని తెలుస్తోంది. ‘ఉద్యోగం ఉన్నా పోయినా నాకు పెద్ద ఫరక్ పడదు’ అంటూ ఇతగాడు సహోద్యోగుల్నే కాదు అధికారులనూ బెదిరించే వాడని సమాచారం.
బెదిరింపు వసూళ్లతో మొదలై...
ఈశ్వర్ టాస్క్‌ఫోర్స్‌లోకి రావడానికి ముందు ఎస్సార్‌నగర్, బేగంపేట సహా వివిధ పోలీసుస్టేషన్లలో పని చేశాడు. అప్పట్లో చోరీ ఫోన్లు ఖరీదు చేసిన వాళ్లను బెదిరించడంతో ఇతడి దందాలు మొదలయ్యాయి. ఇతగాడు తనకున్న పరిచయాలను వినియోగించుకుని తస్కరణకు గురైన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు సేకరించే వాడు. వీటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించే వాడు.
సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో లభిస్తున్న సెల్‌ఫోన్లలో అనేకం చోరీ ఫోన్లు కూడా ఉంటున్నాయి. విషయం తెలియక ఇలాంటి చోట వాటిని ఖరీదు చేసి, వినియోగిస్తున్న వారి నెంబర్లు ఈశ్వర్ వద్దకు చేరేవి. ఆ ఫోన్లు వాడుతున్న వారిని పిలిపించుకునే ఇతగాడు ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. ఇలా రికవరీ చేసిన ఫోన్‌ను సైతం అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు.
చదవండి: (సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా!)
వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలు...
ఇలా చోరీ ఫోన్ల మార్కెట్‌పై ఇతడికి పట్టువచ్చింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో ఆవాసం కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు స్నాచింగ్స్ చేయాలని టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను వారికి జీతంగా లెక్కించి దాని విలువకు సమానమైన మొత్తాన్ని వారికి ఇచ్చేవాడు. ఈ చోరీ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీరి నుంచీ ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దేవాలయాలు, పబ్లిక్ మీటింగ్స్ జరిగే ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేయించే ఈశ్వర్ సెల్‌ఫోన్లతో పాటు బంగారు నగలను స్నాచింగ్ చేయించే వాడు.
ఒక్కో సీడీఆర్ రూ.50 వేలకు విక్రయం...
దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న ఈశ్వర్ మరో దందా కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్) విక్రయమని తెలుస్తోంది. వీటిని పొందాలంటే ఉన్నతాధికారుల ఈ–మెయిల్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు అభ్యర్థన వెళ్లాల్సిందే. అయితే ఈశ్వర్‌కు మాత్రం ఇవి చాలా తేలిగ్గా వచ్చి చేరుతున్నాయని సమాచారం. చోరులకు సంబంధించిన సీడీఆర్‌ల ద్వారా వారి నుంచి సొత్తు కొనే రిసీవర్లను గుర్తిస్తున్న ఇతగాడు బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. వీటి ద్వారానే కొత్త చోరుల వివరాలు తెలుసుకుని వారి తనకు అనుకూలంగా వాడుకునే వాడు. అలాగే కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీలకు ఒక్కో సీడీఆర్‌ను రూ.50 వేలకు అమ్ముతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక అక్రమాలకు పాల్పడిన ఈశ్వర్ రూ.20 కోట్లకు పైగా కూడగట్టిన ఆస్తుల్లో అనేకం బినామీ పేర్లతోనే ఉన్నాయని తెలిసింది. ఇతడిని సస్పెండ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు అంతర్గత విచారణ మొదలెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment