ఆ ముగ్గురు ఎక్కడ..? | Police Searching For Culprits In Nalgonda | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు ఎక్కడ..?

Published Wed, Jul 10 2019 9:58 AM | Last Updated on Wed, Jul 10 2019 10:14 AM

Police Searching For Culprits In Nalgonda - Sakshi

సాక్షి, సూర్యాపేట క్రైం: సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ.. విరామం సమయంలో కొత్త బస్టాండ్‌ వద్దకు వెళ్తున్న కానిస్టేబుల్‌ సుధాకర్‌గౌడ్‌ ప్రయాణిస్తున్న బైక్‌ను ముగ్గురు యువకులు బుల్లెట్‌పై వచ్చి ఢీకొట్టిన ఘటనలో సుధాకర్‌ మృతిచెందిన విషయం విధితమే. అయితే సుధాకర్‌ మృతికి కారణమైన ఆ ముగ్గురు యువకులు ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు..? అన్న అంశంపై ఎన్నో ప్రశ్నలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. సుధాకర్‌గౌడ్‌ మృతికి కారకులైన ఎరుకల దిలీప్, నరేందర్, ప్రవీణ్‌ పరిస్థితి ఏంటని ఆరా తీస్తే.. ఏ ఒక్కరికి కూడా బలమైన గాయాలు కాలేదని.. ఆ యువకులు మద్యంమత్తులో ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.  

ఎందుకు అదుపులోకి తీసుకోలేదని అడిగితే.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే విచారణ కొనసాగుతుందని సమాధానం చెబుతున్నారు. ఖాకీవనంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ప్రమాదంలో మృతిచెందినా.. న్యాయం చేసేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారోనని ఆ శాఖ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కానిస్టేబుల్‌ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిపోయి.. మృతికి కారకులైన వారిని రక్షించే పనిలో నిమగ్నమైపోయినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బైక్‌ ఎవరు నడిపారన్నదానిపై విచారణ..
సుధాకర్‌గౌడ్‌ బైక్‌ను ఢీకొట్టిన బుల్లెట్‌ను ఆ ముగ్గురిలో నడిపి ఢీకొట్టిందెవరూ అన్నదానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ సమయంలో బైక్‌ ఎవరునడిపారన్న దానిపై ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. రైడింగ్‌ ఎవరు చేసినా కూడా ముగ్గురిపై కేసు నమోదుచేశారు. ఏదీ ఏమైనా ఒకటి రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. 

ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వస్తూ..
మద్యం, గంజాయి మత్తులో ఉన్న యువకులు ఎరుకల దిలీప్, ప్రవీణ్, నరేందర్‌ సరిగ్గా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. అయితే హోటల్‌లో స్వైపింగ్‌ పనిచేయడం లేదని హోటల్‌ నిర్వహకులు తెలపడంతో అక్కడి నుంచి నేరుగా శంకర్‌ విలాస్‌ సెంటర్‌లోని ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు బుల్లెట్‌పై వస్తూ కానిస్టేబుల్‌ సుధాకర్‌గౌడ్‌ వాహనాన్ని ఢీకొట్టారు. 

ఆస్పత్రికి తరలించడంలో.. కనికరం చూపని యువకులు
ప్రమాదం జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ సుధాకర్‌గౌడ్‌ పోలీస్‌ యూనిఫామ్‌లోనే ఉన్నారు. అయితే యువకులు కనీసం సుధాకర్‌ను ఆస్పత్రికి తరలించలేదు. కానిస్టేబుల్‌ సుధాకర్‌ బైక్‌పైనే ఈ ముగ్గురూ స్థానిక ఆస్పత్రికి చేరుకొని వైద్యం చేయించుకున్నారు. పోలీసులు అంటేనే భయం లేకుండా పోయే విధంగా యువకులు మద్యం, గంజాయి మత్తులో ఉండిపోతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. 

పెట్రోలింగ్, గస్తీ పెంచుతాం 
సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్, గస్తీ పెంచుతాం. రహదారులపై ముఖ్యంగా పోలీసులు నిత్యం గస్తీ తిరిగేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మద్యం సేవించి రహదారులపై వాహనాలు నడిపే వారిపై చట్టరిత్యా చర్యలకు వెనుకాడేదిలేదు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. పోలీసు కానిస్టేబుల్‌ మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేశాం.  
– రావిరాల వెంకటేశ్వర్లు, ఎస్పీ, సూర్యాపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement