మంగళసూత్రాల ప్రస్తావన తేలేదు!
⇒ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలో 8 లక్షల మంది హాజరవుతున్నారని, అంతమంది ఒకేసారి పరీక్ష రాయడం ఇదే మొదటిసారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఎలాంటి సమస్య లేకుండా పరీక్ష నిర్వహిస్తామని, మహిళా అభ్యర్థులు మంగళసూత్రం ధరించి పరీక్షకు వెళ్లవద్దని కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నాయని, అది చాలా దౌర్భాగ్యమైన విషయమని, తాము ఎక్కడా మంగళసూత్రాల ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మెహిందీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు చర్మంపై మెహిందీ ఉంటే ఫింగర్‌ప్రింట్స్ సరిగ్గా రికార్డ్ కావని, దానికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
బ్లూటూత్ లాంటి పరికరాలను అనుమతించడం లేదని తెలిపారు. తమ వద్ద అభ్యర్థుల పూర్తి సమాచారం ఉందని, కేవలం ఆధార్‌కార్డు తీసుకుని రావాలని వెల్లడించారు. పరీక్షరాసే 8 లక్షల మంది అభ్యర్థుల్లో మూడున్నర లక్షలమంది హైదరాబాద్‌లోనే సెంటర్ కావాలని అడిగారని, కాని హైదరాబాద్‌లో కేవలం లక్షా 20 వేలమందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని మిగిలిన వారికి మిగిలిన ప్రాంతాల్లో కేంద్రాలు కేటారుుంచామని తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ అడిగితే ఇతర జిల్లాలకు వేశారని ప్రశ్నిస్తున్నారని, వారు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి వస్తుందని, రెండురోజులు పరీక్షరాయడానికే ఇబ్బందిపడితే ఉద్యోగం వస్తే 30 సంవత్సరాలు తెలంగాణ మొత్తం తిరగాల్సి వస్తుందని అన్నారు. పరీక్షహాల్‌లో ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని, అలా సృష్టించేవారిని వదిలిపెట్టే అవకాశం లేదని, జాతీయ స్థాయిలో ఉన్న పరీక్షలతో సహా అన్ని పరీక్షలు రాయకుండా చేసే అధికారాలు తమకు ఉన్నాయని వెల్లడించారు.