సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల్లో వైట్‌నర్ వాడిన, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారన్న ఆరోపణల నేపథ్యంలో.. అభ్యర్థుల జవాబు పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. టాప్–5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తామని, ఇందుకోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘వైట్‌నర్’తో వివాదం
టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2015లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్ల)పై వైట్‌నర్ ఉపయోగించరాదని, వివరాల నమోదులో తప్పులు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పరీక్ష నిబంధనల్లో స్పష్టం చేసింది. అయితే పరీక్ష నిర్వహించిన అనంతరం.. వైట్‌నర్ వినియోగించిన, బబ్లింగ్‌లో, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినవారిని కూడా టీఎస్‌పీఎస్సీ అర్హులుగా గుర్తించిందంటూ వివాదం తలెత్తింది. దీనివల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని, గ్రూప్–2 నియామకాలను నిలిపేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు వైట్‌నర్ వాడిన వారి సంఖ్య తక్కువని, ఆ కారణంతో మొత్తం నియామక ప్రక్రియను నిలిపేయవద్దంటూ మరికొందరు పిటిషన్లు వేశారు. ఆ వ్యాజ్యాలన్నింటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. తాజాగా బుధవారం మరోసారి విచారణ జరిపారు.
మార్గదర్శకాలను ఉల్లంఘించడమే
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఓఎంఆర్ షీట్లలో సమాధానాల బబ్లింగ్, వైట్‌నర్ వినియోగం విషయంలో టీఎస్‌పీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. వాటి ప్రకారం వైట్‌నర్‌ను ఉపయోగించకూడదని.. కానీ వైట్‌నర్ వాడి న, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా గుర్తించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 1,032 పోస్టుల భర్తీ కోసం 1:3 పద్ధతిన 3,096 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని కోర్టుకు వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఓఎంఆర్ షీట్ల పరిశీలనకు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్‌పీఎస్సీ అధికారుల సహాయంతో.. టాప్ 5 వేల మంది మెరిట్ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలించాలని సూచించారు. అనంతరం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. శని, ఆదివారాల్లో కమిటీ పరిశీలన జరుపుతుందని.. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదికను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment