joint highcourt
-
గ్రూప్–2 జవాబు పత్రాలు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల్లో వైట్నర్ వాడిన, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారన్న ఆరోపణల నేపథ్యంలో.. అభ్యర్థుల జవాబు పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. టాప్–5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తామని, ఇందుకోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘వైట్నర్’తో వివాదం టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2015లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్ల)పై వైట్నర్ ఉపయోగించరాదని, వివరాల నమోదులో తప్పులు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పరీక్ష నిబంధనల్లో స్పష్టం చేసింది. అయితే పరీక్ష నిర్వహించిన అనంతరం.. వైట్నర్ వినియోగించిన, బబ్లింగ్‌లో, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినవారిని కూడా టీఎస్పీఎస్సీ అర్హులుగా గుర్తించిందంటూ వివాదం తలెత్తింది. దీనివల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని, గ్రూప్–2 నియామకాలను నిలిపేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు వైట్నర్ వాడిన వారి సంఖ్య తక్కువని, ఆ కారణంతో మొత్తం నియామక ప్రక్రియను నిలిపేయవద్దంటూ మరికొందరు పిటిషన్లు వేశారు. ఆ వ్యాజ్యాలన్నింటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. తాజాగా బుధవారం మరోసారి విచారణ జరిపారు. మార్గదర్శకాలను ఉల్లంఘించడమే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఓఎంఆర్ షీట్లలో సమాధానాల బబ్లింగ్, వైట్నర్ వినియోగం విషయంలో టీఎస్పీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. వాటి ప్రకారం వైట్నర్ను ఉపయోగించకూడదని.. కానీ వైట్నర్ వాడి న, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా గుర్తించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 1,032 పోస్టుల భర్తీ కోసం 1:3 పద్ధతిన 3,096 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని కోర్టుకు వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఓఎంఆర్ షీట్ల పరిశీలనకు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్పీఎస్సీ అధికారుల సహాయంతో.. టాప్ 5 వేల మంది మెరిట్ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలించాలని సూచించారు. అనంతరం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. శని, ఆదివారాల్లో కమిటీ పరిశీలన జరుపుతుందని.. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదికను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. -
లోపాలు సరిచేశాకే పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చే ముందు సీనియారిటీ లిస్టులోని లోపాల్ని సరిదిద్దాలని, ఆ తర్వాతే కేంద్ర మార్గదర్శకాల మేరకు తుది కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారును ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ 2014 జూన్ 23న జారీ చేసిన జీవో 108 ప్రకారం డీఎస్పీల సీనియారిటీలో లోపాలున్నాయని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం 19వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. లోపాల్ని సరిచేసేందుకు ఏళ్లపాటు కాలయాపన చేయడం సబబు కాదని, కోర్టును ఆశ్రయించిన డీఎస్పీలు/పిటిషనర్ల అభ్యర్థనల మేరకు రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం వారికి మేలు చేసినట్లు కాదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ ఇన్స్పెక్టర్లు డీఎస్పీలుగా ప్రమోషన్లు పొందిన తర్వాత ‘నోషనల్ ప్రమోషన్’ పద్ధతి ద్వారా పదోన్నతి ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని నేరుగా డీఎస్పీలుగా నియమితులైన వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఓ సీఐ డీఎస్పీగా పదోన్నతి పొందాక.. ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వారే పొందడం వల్ల నేరుగా డీఎస్పీలుగా నియమితులైన తమకు అన్యాయం జరుగుతోందని పిటిషన్లలో పేర్కొన్నారు. లోపాలున్నా పదోన్నతులు సరికాదు.. ‘సీనియారిటీ జాబితాలో లోపాలున్నాయని గుర్తించినప్పుడు వాటిని సరిచేయకుండా పదోన్నతులు ఇవ్వడం సరికా దు. లోపాల్ని సరిదిద్ది.. తర్వాత సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలి. ఆపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పదోన్నతులు ఇవ్వాలి. సీనియారిటీ జాబితాలో లోపాలున్నాయని తెలిసి కూడా సరిచేయకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు డీఎస్పీల తుది కేటాయింపులు చేస్తే అనవసరంగా కోర్టు కేసులకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. లోపాలున్న జాబితా మేరకు పదోన్నతులు ఇవ్వడం చెల్లదు’ అని హైకోర్టు ఏపీ సర్కారుతోపాటు డీజీపీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. పదవీ విరమణ వయసు పెంపుపై రిట్ డిస్మిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచారని, అదేవిధంగా తమకు కూడా పదవీ విరమణ వయసు పెంచేలా తెలంగాణ సర్కారుకు ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఓ డీఎస్పీ దాఖలు చేసిన రిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
పలువురు జిల్లా సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతి కల్పిస్తూ, మరికొందరు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.పి. సన్నిధిరావుకు పదోన్నతి కల్పిస్తూ విజయవాడ కోపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించారు. అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.మాలతికి పదోన్నతి కల్పిస్తూ రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రమేశ్ అదే ప్రాంతంలో ఏడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. రాజగోపాలరావును ఒంగోలు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.బాల భాస్కరరావుకు పదోన్నతి కల్పించి రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎ.కర్ణకుమార్కు పదోన్నతి కల్పించారు. ఆయన్ను చిత్తూరు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. సికింద్రాబాద్ పదవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఏఎల్ సత్యవతిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 25వ అదనపు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు. వరంగల్ జిల్లా జనగాం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శాంతిని నెల్లూరు జిల్లా, గూడూరు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.రాధారత్నంను గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్.శివకుమార్ విశాఖపట్నం జిల్లా గాజువాక 13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జిగా నియమించారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఒ. వెంకట నాగేశ్వరరావు విశాఖపట్నం 11వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. గుంటూరు నాల్గవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.కమలాదేవి అనంతపురం జిల్లా గుత్తి 6వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా, ఎల్బీ నగర్ కోర్టు 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి హుజైబ్ అహ్మద్ ఖాన్‌ను నల్లగొండ జిల్లా, 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు, నర్సరావుపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.లక్ష్మి గుంటూరు నాల్గవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నల్లగొండ నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీపీ వింధేశ్వరిని అదే జిల్లా మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.జె. విశ్వనాథంను ఒంగోలు 1వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. బదిలీ అయిన వారందరూ కూడా ఈ నెల 30వ తేదీకల్లా ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవై అక్టోబర్ 7వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. -
హైకోర్టు విభజనపై రిజర్వులో తీర్పు
హైదరాబాద్ : హైకోర్టు విభజనపై గురువారం వాదనలు పూర్తయ్యాయి. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్‌పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. తెలంగాణ ప్రభుత్వ తరఫున ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ తరఫున ఏజీ వాదనలు వినిపించగా, కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. హైకోర్టు విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. కాగా హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్‌లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది.