సాక్షి, హైదరాబాద్: పోలీసు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చే ముందు సీనియారిటీ లిస్టులోని లోపాల్ని సరిదిద్దాలని, ఆ తర్వాతే కేంద్ర మార్గదర్శకాల మేరకు తుది కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారును ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ 2014 జూన్ 23న జారీ చేసిన జీవో 108 ప్రకారం డీఎస్పీల సీనియారిటీలో లోపాలున్నాయని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం 19వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. లోపాల్ని సరిచేసేందుకు ఏళ్లపాటు కాలయాపన చేయడం సబబు కాదని, కోర్టును ఆశ్రయించిన డీఎస్పీలు/పిటిషనర్ల అభ్యర్థనల మేరకు రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం వారికి మేలు చేసినట్లు కాదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ ఇన్‌స్పెక్టర్లు డీఎస్పీలుగా ప్రమోషన్లు పొందిన తర్వాత ‘నోషనల్ ప్రమోషన్’ పద్ధతి ద్వారా పదోన్నతి ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని నేరుగా డీఎస్పీలుగా నియమితులైన వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఓ సీఐ డీఎస్పీగా పదోన్నతి పొందాక.. ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వారే పొందడం వల్ల నేరుగా డీఎస్పీలుగా నియమితులైన తమకు అన్యాయం జరుగుతోందని పిటిషన్లలో పేర్కొన్నారు.
లోపాలున్నా పదోన్నతులు సరికాదు..
‘సీనియారిటీ జాబితాలో లోపాలున్నాయని గుర్తించినప్పుడు వాటిని సరిచేయకుండా పదోన్నతులు ఇవ్వడం సరికా దు. లోపాల్ని సరిదిద్ది.. తర్వాత సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలి. ఆపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పదోన్నతులు ఇవ్వాలి. సీనియారిటీ జాబితాలో లోపాలున్నాయని తెలిసి కూడా సరిచేయకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు డీఎస్పీల తుది కేటాయింపులు చేస్తే అనవసరంగా కోర్టు కేసులకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. లోపాలున్న జాబితా మేరకు పదోన్నతులు ఇవ్వడం చెల్లదు’ అని హైకోర్టు ఏపీ సర్కారుతోపాటు డీజీపీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
పదవీ విరమణ వయసు పెంపుపై రిట్ డిస్మిస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచారని, అదేవిధంగా తమకు కూడా పదవీ విరమణ వయసు పెంచేలా తెలంగాణ సర్కారుకు ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఓ డీఎస్పీ దాఖలు చేసిన రిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
Published Sun, Sep 24 2017 2:19 AM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement
Advertisement