టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టిడించిన మత్స్యకార సంఘం నాయకులు, బోటు ఓనర్స్ అసోషియేషన్ నేతలు
భానుగుడి (కాకినాడ సిటీ) : టీడీపీ వైఖరిపై మత్స్యకారులు మండిపడ్డారు. తమ కులాన్ని, తమ మత్స్యకార వృత్తిని అవమానించారంటూ నిప్పులు చెరిగారు. ఇష్టానుసారం వ్యాఖ్యలతో వారి రాజకీయ లబ్ధి కోసం తమను పావుగా వాడుకోవడం దారుణం అని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా బోట్ల ద్వారా మాదక ద్రవ్యాల దిగుమతి జరుగుతోందని ఏ విధంగా చెబుతారని నిలదీశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభి కళ్లతో చూసినట్లు మాట్లాడటం దుర్మార్గమని, ఆయన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టాభి పాత్రికేయుల సమావేశం ముగిసిన కొద్ది సేపటి తర్వాత వారు ఆయన వ్యాఖ్యల పట్ల కలత చెంది.. పార్టీలకతీతంగా కాకినాడ బోటు ఓనర్స్, మత్స్యకారులు పెద్దసంఖ్యలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కులాన్ని, వృత్తిని అవమానపరుస్తూ అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పట్టాభి, టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులంతా పెద్ద ఎత్తున ఉద్యమించి తీరుతామని బోటు ఓనర్స్ అసోషియేషన్ పేర్కొంది.
పట్టాభీ.. మీరు చూశారా?
విజయవాడలో ఉన్న పట్టాభి.. కాకినాడలో బోటు తగలబడితే అందులో మాదకద్రవ్యాలు ఉన్నాయని ఏవిధంగా చెబుతారని మత్స్యకార సంఘం నేతలు నిలదీశారు. ఆ సమయంలో పట్టాభి అక్కడికి వచ్చి బోటు లోపలికి తొంగి చూశారా? అని మండిపడ్డారు. గాలిమాటలతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘ఈ విధంగా మాట్లాడాలని మీకు చంద్రబాబు చెప్పారా? లేక పేరు కోసం ఇలా గాలి మాటలు మాట్లాడావా? అని ధ్వజమెత్తారు. తగలబడినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసు రక్షణలోనే బోటు ఉందని, ఆ విషయాలేవీ తెలుసుకోకుండా ఇలాంటి ప్రేలాపనలకు దిగడం విడ్డూరమని అన్నారు.
పట్టాభిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి డిపాజిట్లు రాకుండా చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, మత్స్యకారులతో టీడీపీ కాకినాక పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబు చర్చించే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పట్టాభి పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాలేదు. అంతలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఉద్రిక్తతలు పెరగకుండా పట్టాభిని అక్కడి నుంచి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment